అన్నీ నేనే.. అంతా నేనే...

x
Highlights

ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి పోరాడారు ఏపిలో ఆ పార్టీ చేసినన్ని దీక్షలు, పోరాటాలు, ఆందోళనలు, బందులు మరే పార్టీ చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు ఓ రకంగా...

ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి పోరాడారు ఏపిలో ఆ పార్టీ చేసినన్ని దీక్షలు, పోరాటాలు, ఆందోళనలు, బందులు మరే పార్టీ చేయలేదనడంలో ఎలాంటి సందేహం లేదు ఓ రకంగా చెప్పాలంటే హోదాకు పేటెంట్ రైట్ ఆ పార్టీదే అనొచ్చు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న వైసీపీ చివరి అంకంలో బొక్క బోర్లా పడిందా?

తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం పైనా ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి తేలేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలుకు దిగడంతోపాటు బంద్ లను నిర్వహిస్తోంది. 2014 డిసెంబర్ ఐదున టిడిపి వైఖరికి నిరసనగా వైసీపీ ఆందోళనకు శ్రీకారం చుట్టి వివిధ రూపాల్లో హోదా అంశం ప్రజల్లో ఉండేలా చూస్తూ వస్తోంది. హోదా కోసం నాలుగేళ్ల నుంచీ ఉద్యమిస్తూ రాజకీయ మైలేజీలో నెంబర్ వన్ గా నిలిచిన వైసీపీ ఇప్పుడు తప్పటుడుగు లేస్తోందా? పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒంటెత్తు పోకడలు పోతున్నారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు పార్లమెంటులో మోదీ ప్రసంగాన్ని నిరసిస్తూ ఏపి బంద్ కు పిలుపు నిచ్చిన జగన్ దానిపై ఇతర పార్టీల మద్దతు మాత్రం కూడగట్టలేదు. కనీసం మాట మాత్రంగానైనా వారిని అడగలేదు. సాధారణంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చే ముందు ఇతర పక్షాలతో స్వయంగా కానీ పార్టీలోని సీనియర్లతో గానీ మాట్లాడించి ఆపై ప్రకటిస్తే ఆ పార్టీల మద్దతు దొరుకుంది. కానీ జగన్ ఆ పని చేయలేదు. ఈ ఏడాది మార్చి ఐదున ఢిల్లీలో నిర్వహించిన మహాధర్నాలో వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేసిందే తప్ప హోదా ఇవ్వని కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. చివరికి గత పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడూ అదే ధోరణి సభ జరగకపోడంపై కేంద్రాన్ని తప్పు బట్టక, చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేసింది. తన ఎంపీలతో రాజీనామా చేయించి, ఆవెంటనే ఏపి భవన్ లో నిరాహార దీక్షలకు కూడా కూర్చోబెట్టారు జగన్ అప్పట్లో హోదా కోసం చిత్త శుద్ధితో పోరాడుతున్న పార్టీగా వైసీపీకి కాస్త మైలేజీ పెరిగింది. టీడీపీ ఎంపీలను రాజీనామా చేయించాలంటూ డిమాండ్ చేసి వైసీపీ టీడీపీని తన ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేసింది. అయితే వైసీపీ గాలానికి చిక్కకుండా వ్యూహాత్మకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టి మైలేజీలో వైసీపీ కన్నా మరో అడుగు ముందుకేసింది టీడీపీ. అంతే కాదు ఎంపీల రాజీనామా తొందర పాటు చర్య అంటూ వైసీపీని టార్గెట్ చేసింది.

2019 ఎన్నికలు తెరపైకి చాలా సవాళ్లనే తెస్తున్నాయి. జనసేన ఆవిర్భావంతో ఓట్లు చీలి హంగ్ వచ్చే పరిస్థితి ఉందన్న అంచనాలున్నాయి. అవగాహనతో పోటీ చేయాల్సిన తరుణంలో దూకుడుగా పోయి విపక్షాలను జగన్ దూరం చేసుకుంటున్నారా?

జగన్ ఒంటెత్తు పోకడలు తొందర పాటు చర్యలు వైసీపీకి నష్ట దాయకమన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఎంపీలతో రాజీనామా చేయించి ఉండకపోతే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనే వీలు చిక్కేది. హోదా సంజీవని కాదు అని,ప్యాకేజీ మేలనీ ప్రకటించి, అసెంబ్లీలో తీర్మానాలు చేసిన టీడీపీ చివరకు యూ టర్న్ తీసుకుని ధర్మ పోరాట దీక్షలకు దిగుతుంటే హోదా కోసం మొదట్నుంచి పోరాడుతున్న వైసీపీ క్లైమాక్స్ సీన్ లో బొక్క బోర్లా పడిందన్న భావన రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. చివరకు బంద్ పిలుపు లోనూ విపక్షాల అభిప్రాయం తీసుకోలేదు. అందుకే దీనికి వామపక్షాలు జనసేన దూరంగా ఉంటున్నట్లు ప్రకటన చేశాయి. గతంలో రెండు సార్లు వైసీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వగా మద్దతు పలికిన వామపక్షాలు నేడు దూరం కావడానికి జగన్ ఏకపక్ష వైఖరేననే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన సమయంలో వైసీపీ మరీ దూకుడుగా పోతోందా? గత ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి గెలుపు అవకాశాలను కొద్దిలో కోల్పోయారు జగన్ కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. గతంలో టీడీపీకి మద్దతు పలికిన జనసేన ఈసారి లెఫ్ట్ పార్టీల సాయంతో బరిలో నిలుస్తోంది. చంద్రబాబు ఎన్నికల వ్యూహాలు పన్నడంలో దిట్ట బలమైన ఈ రెండు పార్టీలను ఎదుర్కొనడం వైసీపీకి పెద్ద సవాల్? పైగా ఈసారి హంగ్ వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ దూకుడుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, ఒంటరిగానే బరిలోకి దిగడం అంత మంచిది కాదనే భావన వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికలు జగన్ పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికలు ఈసారి అధికారానికి దూరమైతే జగన్ పార్టీని నిలబెట్టుకోడం కూడా కష్టమవుతుందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.

Show Full Article
Print Article
Next Story
More Stories