logo
తాజా వార్తలు

వ్యవసాయంలో నయా ట్రెండ్..ఆస్ట్రేలియా ద్రాక్షపై యువ శాస్త్రవేత్త పరిశోధన

X
Highlights

రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా...అధిక ఆదాయం పొందాలన్నా...వాణిజ్య పంటలతోనే సాధ్యమవుతుంది. ...

రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలన్నా...అధిక ఆదాయం పొందాలన్నా...వాణిజ్య పంటలతోనే సాధ్యమవుతుంది. స్థానికంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో తన పంటను అమ్ముకున్నప్పుడే రైతు సాగులో రాణించగలుగుతాడు అందుకే సాగులో రైతులు అధిక ఆదాయం పొందాలనే ధ్యేయంతో తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త హరికాంత్ తన వంతు కృషిని చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉన్న ద్రాక్షను భారత్‌ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసి అధిక దిగుబడులను సాధిస్తున్నారు.

ద్రాక్షలో రెడ్‌గ్లోబ్ రకం ఆస్ట్రేలియాలో పండుతుంది. పెద్దగా, మంచి ఎరుపు రంగు, తీయగా ఉంటుంది ఈ ద్రాక్ష. ఈ ద్రాక్షలో ఔషద గుణాలు అధికమే...అందుకే ఆస్ట్రేలియా ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో మాత్రమే ఈ ద్రాక్ష సాగవుతుంది. అలాంటిది మన దేశ వాతావరణ పరిస్థితుల్లోనూ పండించి శభాష్‌ అనిపించుకుంటున్నారు శాస్త్రవేత్త హరికాంత్‌.

ప్రత్యేక వాతావరణ పరిస్థితిలో మాత్రమే పండే ద్రాక్ష పంటపై పరిశోధనలు చేసి విజయం సాధించారు తెలంగాణకు చెందిన శాస్త్రవేత్త హరికాంత్‌. ఆస్ర్టేలియా రకం ద్రాక్షను మనదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలిచి, అధిక దిగుబడులు సాధించారు. ఎర్రమట్టి నేల, నీరు, తేమతో కూడిన అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పిస్తూ ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఆస్ట్రేలియా రకం ద్రాక్షను విజయవంతంగా సాగు చేశారు.

ద్రాక్షలో రెడ్‌గ్లోబ్ రకం ఆస్ట్రేలియాలో విరివిగా పండుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ద్రాక్షను భారత్‌లో సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ భావించింది. ఈ సాగుపై కోయంబత్తూరు, పూణె, బెంగళూ రు, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పరిశోధనలు జరిగాయి. ఈ రకం పంటను అభివృద్ధి చేసే పనిని అక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు, ICAR పరిశోధనా సంస్థలకు అప్పగించింది. దేశవ్యాప్తంగా వర్సిటీల్లో ఈ సాగుపై పరిశోధనలు జరిగాయి. అయితే కోయంబత్తూర్‌లో మాత్రం మంచి ఫలితాలు వచ్చాయి.

ICAR లో ఎమ్మెస్సీ చేస్తున్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక హరికాంత్‌ నాయక్ ద్రాక్ష సాగుపై పరిశోధన బాధ్యతలు స్వీకరించారు తనకు విశ్వవిద్యాలయం లో అప్పగించిన పరిశోధనా కేంద్రంలో అంటుకట్టిన మొక్కలను నాటి సాగు ప్రారంభించాడు. ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు పాటించి ఆస్ట్రేలియా రకం ద్రాక్షను విజయవంతంగా సాగు చేసి చూపించారు. ఒక్క తెలంగాణాలోనే కాక తమిళనాడు, కర్ణాటకల్లో ద్రాక్షపై పరిశోధనలు చేసి ప్రశంసలు అందుకున్నారు.

ద్రాక్ష లో రెడ్‌గ్లోబ్‌ రకం భారత వాతావరణ పరిస్థితిలో పండించి అధిక దిగుబడి సాధించిన నాయక్‌ను ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించింది. ఎడారి ప్రాంతమైన ఇజ్రాయిల్‌లో గ్రీన్‌హౌస్‌, బిందుసేద్యం, పూర్తి యాంత్రీకరణ పద్ధతుల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న తీరును ఆయన అధ్యయనం చేశారు. వ్యవసాయరంగంలో నాయక్‌ చేసిన కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం హరికాంత్‌ను బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపికచేయగా, ఫాదర్‌ ఆఫ్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ ఎంఎస్‌ స్వామినాధన్‌ చేతులమీదుగా నాయక్‌ ఆ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితోపాటు పలువురు సీనియర్‌ శాస్త్రవేత్తలు హరికాంత్‌ సాగుచేసిన ద్రాక్ష తోటను సందర్శించి, విరగగాసిన ద్రాక్ష గుత్తులను చూసి అబ్బురపడ్డారు.

ఆస్ట్రేలియాలో సూపర్‌ స్నాక్‌గా పిలవబడే ఈ ద్రాక్ష సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి. అధిక దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలి. ఏ నేలలు సాగుకు అనుకూలం.? మొక్కలు ఎక్కడ లభిస్తాయి.? సాగు విధానాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్‌గ్లోబ్ రకం ద్రాక్ష సాగుకు ఎర్రనేలలు అనుకూలం. ఈ పంటను సాగు చేయాలనుకునే రైతులు అంటుకట్టిన మొక్కలను వేసుకోవాలి. వెజ్‌ గ్రాఫ్టింగ్ అనే టెక్నిక్‌ ద్వారా అంటుకట్టి మొక్కలను నాటుకోవాలి. ఎకరానికి సుమారు 600 నుంచి 650 మొక్కల వరకు వేసుకోవచ్చు. ఒక్కో మొక్క 150 రూపాయల వరకు పలుకుతుంది. నాసిక్‌లో ఈ మొక్కలు లభిస్తాయి. మొక్కలను స్థానిక రైతులకు అందుబాటులో ఉంచేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు హరికాంత్‌.

మొక్కలకు సపోర్టుగా పందిర్లు వేయాలి. పంట వేసుకునే ముందే ఏ మందిళ్లు వేసుకోవాలో రైతు ముందే నిర్ణయించుకోవాలి. కత్తిరింపులకు, ఎరువులు, పురుగుమందుల పిచికారీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పందిళ్లను నిర్మించుకోవాలి.
స్పాట్ :
ద్రాక్ష పంటకు నీటిని అందించడానికి డ్రిప్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు 20 నుంచి 25 లీటర్ల నీరు సరిపోతుంది. ప్రతీ మొక్క దగ్గర రెండు డ్రిప్పర్‌లను అమర్చి నీటిని విడుదల చేయచాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీటిని వదలాలి. మొదటి మూడు సంవత్సరాలు నీటిని అధికంగా ఇవ్వాలి. గ

ద్రాక్షలో పొడి తెగులు అధికంగా ఉంటుంది. అయితే రెడ్ గ్లోబ్ ద్రాక్షలో పొడి తెగులును తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఎక్కువగా పురుగుమందులను పిచికారీ చేసే అవసరం రాదు. సేంద్రియ విధానంలోనూ వీటిని సాగుచేసుకోవచ్చు. ప్రకృతి విధానంలో సాగు చేసిన ద్రాక్షకు ఎగుమతి పరంగానూ మంచి ధర లభిస్తుంది.

ఆస్ట్రేలియా ద్రాక్ష పంట కాలం 20 నుంచి 25 సంవత్సరాలు. మొదటి మూడు సంవత్సరాలే కీలకం పంట వేసిన మొదటి మూడు సంవత్సరాల్లో రైతుకు రాబడి ఉండదు ఒక్కో ఎకరానికి మొదటిదశలో సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. నాలుగో ఏడాది నుంచి పంట చేతికి వస్తుంది. ఒక్కో చెట్టుకు సుమారు 15 నుంచి 20 గెలలు వస్తాయి. గెల బరువు సుమారు కనిష్ఠంగా 800 గ్రాముల నుంచి గరిష్ఠంగా రెండున్నర కిలోల వరకు ఉంటుంది.

నాలుగేళ్ల వరకు రైతులు పెట్టుబడి పెట్టి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ద్రాక్ష తోటలో అంతరపంటలు సాగు చేసుకోవచ్చు. బొప్పా యి, చామంతి, బంతి, అలోవేర్‌లతో పాటు ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. ఇవి ఏడాది కాలం పంటలు. కాబట్టి ద్రాక్ష తోటకు పెట్టిన ఖర్చును కొంతవరకు ఈ పంటల ద్వారా తిరిగి పొందవచ్చు. ముఖ్యంగా ద్రాక్షతోటల్లో అంతర పంటగా బొప్పా యి సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయని హరికాంత్ అంటున్నారు.

మన ద్రాక్షతో పోల్చితే రెడ్‌గ్లోబ్‌ ఆకారంలో పెద్దది. నీరు శాతం తక్కువగా ఉంటుంది. బరువు కూడా ఎక్కువ తూగుతుంది. ఎక్కువ కాలం పాడు కాకుండా వుంటుంది. ఈ రకం ఆస్ర్టేలియాలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే పండిస్తుంటే మనదేశంలో మాత్రం రెండుసార్లు కోతకు వస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఆస్ట్రేలియా రకం ద్రాక్షకు విదేశాల్లో మంచి డిమాండ్‌ వుంది.

రెడ్‌ గ్లోబ్‌ ద్రాక్షలో నిల్వ శాతం అధికంగా ఉంటుంది. ఎంత దూర ప్రదేశాలకైనా వీటిని ఎంతో సులభంగా ఎగుమతి చేయవచ్చు. యాంటిఆక్సిడెంట్స్ శాతం ఇందులో అధికంగా ఉంటాయి. నీరు శాతం తక్కుగా ఉంటుంది. కాండం గట్టిగా ఉంటుంది. అందుకే వీటికి అధిక ధర పలుకుతుంది.

ద్రాక్షలో ఈ రకం పండ్లు విదేశాలకు ఎగుమతి చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. అక్కడ ఈ ద్రాక్షకు కిలో 350 రూపాయల వరకు ధర పలుకుతోంది.
క్షేత్రస్థాయిలో రైతులు కొలోకు 150 రూపాయల వరకు విక్రయించవచ్చు. డిమాండ్‌ను బట్టి ఎరకం ద్రాక్ష సాగు చేస్తే రైతు ఎంతలేదన్నా 15 లక్షల రూపాయల వరకు ఆర్జించవచ్చు. ఎందుకంటే ఎకరాకు ఎంతలేదన్నా 8 నుంచి 10 టన్నల వరకు దిగుబడి వస్తుంది.

దుబాయ్, చైనా, ఇండోనేషియా, మలేషియాలో రెడ్‌ గ్లోబ్ ద్రాక్షకు మంచి డిమాండ్ ఉంది. రైతులు ఒక్కొక్కరిగా కాకుండా రైతు ఉత్పాదక సంఘాలుగా ఏర్పడి సాగు చేస్తే పంట ఎగుమతుల కోసం దళారీలపై ఆధారపడకుండా రైతే తన పంటను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకోవచ్చు. మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో రెడ్‌గ్లోబ్ రకం ద్రాక్ష సాగు అంతగా లేదు. మొట్టమొదటి సారిగా అనంతపురం రైతులు ఈ సాగుకు ముందుకు వచ్చారు. ద్రాక్ష సాగు ప్రారంభించారు. స్థానికంగా ఆస్ట్రేలియా ద్రాక్షను పండించేందుకు రైతులు ముందుకు వస్తే వారికి సలహాలను సూచనలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు హరికాంత్‌.

తన కృషికి ప్రభుత్వం ప్రోత్సాహం తోడైతే అరుదైన ద్రాక్షతో పాటుతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్‌ వున్న కూరగాయలను సాగు చేస్తానంటున్నారు ఈ యువ శాస్త్రవేత్త. ఇటువంటి యువ రక్తానికి, యువకులకి ప్రభుత్వాలు చేయూతనిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు.
హరికాంత్ పోరిక 94406 91020

Next Story