logo
సినిమా

‘ఏ మంత్రం వేసావె’ మూవీ రివ్యూ

‘ఏ మంత్రం వేసావె’ మూవీ రివ్యూ
X
Highlights

టైటిల్ : ఏ మంత్రం వేసావె జానర్ : థ్రిల్లర్‌ తారాగణం : విజయ్‌ దేవరకొండ, శివాని సింగ్‌, శివన్నారాయణ, ఆశిష్‌...

టైటిల్ : ఏ మంత్రం వేసావె
జానర్ : థ్రిల్లర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, శివాని సింగ్‌, శివన్నారాయణ, ఆశిష్‌ రాజ్‌
సంగీతం : అబ‍్బట్‌ సమత్‌
దర్శకత్వం : శ్రీధర్‌ మర్రి
నిర్మాత : గోలీసోడా ఫిలింస్‌ ప్రొడక్షన్‌

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమా సూపర్ హిట్ తరవాత విజయ్‌కు అవకాశాలు బాగా పెరిగిపోయాయి. వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. విజయ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు కొత్త కథల కోసం అన్వేషిస్తున్నారు. దర్శకులు స్క్రిప్టులతో విజయ్ ముందు వాలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా కంటే ముందు విజయ్ నటించిన ఓ చిత్రం బయటికి వచ్చింది. అదే ‘ఏ మంత్రం వేసావె’. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అది. శ్రీధర్ మర్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు (మార్చి 9న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సోషల్‌ మీడియా, గేమింగ్‌ లాంటి వాటిలో పడి యువత ఎలా నష్టపోతుంది అన్న కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్‌ కెరీర్‌కు మరింత బూస్ట్‌ ఇచ్చిందా..?

కథ : నిఖిల్‌ (విజయ్‌ దేవరకొండ) గేమింగే ప్రపంచంగా బతికే కుర్రాడు. నెలల తరబడి తన రూమ్‌లో నుంచి బయటకు రాకుండా గేమ్స్‌ ఆడుతూ కాలం గడిపేస్తుంటాడు. తన ఫ్రెండ్స్‌ తో ఛాలెంజ్‌ చేసి మరి ఆన్‌లైన్‌లో గేమ్స్‌ లో విజయం సాధిస్తుంటాడు. అలాంటి అబ్బాయిని ఓ అమ్మాయి రియల్‌ లైఫ్‌లో గేమ్‌ ఆడదామని ఛాలెంజ్‌ చేస్తుంది. రాగ్స్‌ (శివాని సింగ్‌) ఓ గేమింగ్ కంపెనీలో డిజైనర్‌గా పని చేస్తుంటుంది. అందరూ రక్తపాతం, పోరాటం లాంటి కాన్సెప్ట్‌ లతో గేమ్స్‌ తయారు చూస్తుంటే తాను మాత్రం అందుకు భిన్నంగా నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా ఓ గేమ్‌ కాన్పెప్ట్‌ తీసుకువస్తుంది, కానీ బాస్‌ తన గేమ్‌ కాన్సెప్ట్‌ను రిజెక్ట్‌ చేస్తాడు. దీంతో రాగ్స్‌ తన రియల్‌ లైఫ్‌ గేమ్‌తో ఎలాగైన గేమింగ్‌ కాంపిటేషన్‌లో అవార్డు సాధించాలని నిఖిల్ ను ట్రాప్‌ చేసి గేమ్‌ లోకి లాగుతుంది. రాగ్స్‌.. నిఖిల్‌ తో ఆడిన గేమ్‌ ఏంటి..? అసలు రాగ్స్‌ ట్రాప్‌లోకి నిఖిల్‌ ఎలా వచ్చాడు..? ఈ గేమ్‌ కారణంగా నిఖిల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? ఏం ఏం విజయాలు సాధించాడు అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే: కథలో కొత్తదనం ఉంది. కథనం పరంగా కూడా కసరత్తులు బాగానే చేశాడు దర్శకుడు. కానీ వాటికి తెర రూపం ఇచ్చే ప్రయత్నమే సరిగ్గా కుదరలేదు. కంప్యూటర్లో మన స్నహితుడు ఒకడు సరదాగా ఓ గేమ్‌ ఆడుతుంటే చూస్తున్నట్లు, మనమే కంప్యూటర్‌లో ఓ షాట్‌ఫిలిం చూస్తున్నట్లు అనిపిస్తుంది ఈ సినిమా. ఆరంభ సన్నివేశాలు సాదాసీదాగా అనిపిస్తాయి. ఎప్పుడైతే కథానాయిక తెరపైకి వచ్చి ఆట మొదలుపెడుతుందో అప్పటినుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆమెను వెతికే క్రమమంతా సాగదీతగా అనిపించినప్పటికీ ఆ సన్నివేశాలన్నీ ఓ గేమ్‌ని తలపించడంతో ఆ గేమ్‌ ఎక్కడ ముగుస్తుందో చూడాలనే ఆసక్తి కొనసాగుతుంటుంది. సోషల్‌మీడియా వెనక చీకటి కోణాన్ని కూడా ఈ కథలోని ఓ పార్శ్వంలో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు మాత్రం సినిమా ఉద్దేశాన్నే మార్చేశాయి. కథనంపై ఇంకొన్ని కసరత్తులు చేసుంటే ఈ సినిమా ఫలితం మరొకలా ఉండేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: విజయ్‌ దేవరకొండ లుక్‌ పరంగా, నటన పరంగా ఆకట్టుకున్నారు. నటనకు పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ పాత్ర పరిధి మేరకు చక్కటి ప్రభావం చూపిస్తారు. కథానాయిక శివానీ సింగ్‌ కూడా నటన పరంగా ఆకట్టుకుంది. గ్లామర్‌ పరంగా మాత్రం ఆమెకు పెద్దగా మార్కులు పడవు. మిగతా తారాగణం ఆయా పాత్రలకు తగ్గట్టు నటించారు. పరిమిత వేగంతో తెరకెక్కిన చిత్రం కావడంతో పేరున్న నటీనటులు తెరపై కన్పించరు. సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. వర్తమాన పరిస్థితులను ప్రతిబింబించేలా కథ రాసుకున్నారు. కథనం పర్వాలేదనిపించినప్పటికీ అవి రెండున్నర గంటల సినిమాకు తగ్గట్టుగా లేవు. సంగీతం, కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు నాసిరకంగా అనిపిస్తాయి.

బలాలు:

+కథ

+విజయ్‌ దేవరకొండ నటన

బలహీనతలు:

-వాణిజ్యాంశాలు లేకపోవడం

-సాగదీతగా అనిపించే ద్వితీయార్థం

-నిరాశపరిచే పతాక సన్నివేశాలు

Next Story