బీజేపీ-వైసీపీ నేతలు నిజంగా కలిశారా....కలిస్తే టీడీపీ ఎందుకు తప్పుపడుతోంది?

x
Highlights

ఎప్పుడూ కలవరు, కలిసే ఛాన్స్‌లేదన్న వాళ్లు కలిస్తే సెన్సేషన్. ఎన్నటికైనా కలవాలనుకున్నవాళ్లు కలిస్తే ఎమోషన్. కానీ కలవరు, కలవకూడదు, కలిసే...

ఎప్పుడూ కలవరు, కలిసే ఛాన్స్‌లేదన్న వాళ్లు కలిస్తే సెన్సేషన్. ఎన్నటికైనా కలవాలనుకున్నవాళ్లు కలిస్తే ఎమోషన్. కానీ కలవరు, కలవకూడదు, కలిసే అవకాశంలేదనుకున్నవాళ్లు కలిస్తే కొత్త డౌట్స్ క్రియేషన్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే కన్‌ఫ్యూజన్. ఎవరు ఎవర్ని కలిసినా, అపార్థాలకు దారితీస్తోంది. ఇదిగో వారి అక్రమ సంబంధమంటూ, ప్రత్యర్థులు వేలెత్తి చూపుతున్నారు. ఢిల్లీ పెద్దలతో వైసీపీ నేతలు రహస్య సమావేశమయ్యారని టీడీపీ ఆరోపించడం, ఏపీలో కొత్త రంగులు అద్దుకుంటున్న రాజకీయానికి అద్దంపడుతోంది...ఇంతకీ కలిశారా....కలవలేదా...బీజేపీ-వైసీపీ ఫ్రెండ్‌షిప్‌ ఎస్టాబ్లిష్‌ చేయడంలో టీడీపీ వ్యూహమేంటి?

ఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌ భవన్. మొదట వైసీపీ నాయకుడు, ఆ తర్వాత బీజేపీ నాయకుడు. వరుసగా కారు దిగారు. అదే దృశ్యం ఇప్పుడు ఏపీలో రాజకీయ మంటలు రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం రేపుతోంది.

ఎన్నికలు ఇంకా ఏడాదికి ముందే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రకరకాల రంగులు పులుముకుంటున్నాయి. తెలుగుదేశం, వైసీపీల పరస్పర ఆరోపణలు మలుపులు తిరుగుతున్నాయి. ఎవరు ఎవర్ని కలిసినా, ఎవరితో మాట్లాడినా, అదొక సంచలనమైపోతోంది. ముఖ్యంగా బీజేపీని ప్రధాన విలన్‌గా అభివర్ణిస్తున్న టీడీపీ, ఆ పార్టీ నేతలతో ఎవరు సమావేశమైనా, ఘాటైన విమర్శలతో చెలరేగిపోతోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో అంటకాగడమంటే, కుమ్మక్కు రాజకీయమేనని ఆరోపిస్తోంది. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే విజయసాయిరెడ్డి టచ్‌లోనే ఉన్నాడని విమర్శిస్తున్న టీడీపీ, తాజాగా మరో అస్త్రాన్ని బలంగా విసురుతోంది.

వైసీపీ నేతలు, బీజేపీ నేతలతో ఢిల్లీలో రహస్యంగా సమావేశమయ్యారని, ఈ దృశ్యాలు అందుకు సాక్ష్యమని ఆరోపిస్తోంది...ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మీద, చంద్రబాబు మీద కుట్ర చేసేందుకు, ఇలా సీక్రెట్‌గా మీట్‌ అవుతున్నారని, ఇదంతా ఆపరేషన్‌ గరుడ కాక మరేంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ రహస్య భేటి వెనక, కీలక పత్రాలు చేతులు మారాయన్నది టీడీపీ ప్రధాన ఆరోపణ. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం, పట్టిసీమ, అమరావతి నిర్మాణానికి భూసేకరణలాంటి పలు అంశాల్లో అవినీతి జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపణల చేస్తున్న వైసీపీ నేతలు, తాజా మీటింగ్‌లో ఆయా అంశాలపై పీఏసీ అధ్యక్ష హోదాలో తాను సేకరించిన పలు పత్రాలను బీజేపీ నేతలకు బుగ్గన అందించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గత మూడు రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో మకాం వేశారని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని మోడీ, అమిత్‌షాతో సుదీర్ఘ మంతనాలు జరిపారని, అటు ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారులతో కూడా కన్నా, పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు చర్చలు జరిపారని అంటోంది టీడీపీ. ఇదే సమయంలో, బుగ్గన, ఆకుల కలిసి రామ్‌మాధవ్‌తో సమావేశమైనట్లు ఆరోపిస్తోంది. బీజేపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయంటున్న తమ ఆరోపణలు, నిజమని మరోసారి రుజువైందని టీడీపీ నేతలంటున్నారు. మరోవైపు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశానంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఖండించారు. కలవకపోయినా కలిశానని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులూ ఉండరన్నది చారిత్రక వాస్తవం. భారతదేశ రాజకీయాల్లో అది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. ఇక ఏపీలో మొన్నటి వరకు కమలంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన టీడీపీ, రాష్ట్ర విభజన హామీలు, కొత్త స్నేహాలంటూ బీజేపీకి, ఎన్డీయేకి గుడ్‌ బై చెప్పింది. రాష్ట్రంలో పురోగతి లేకపోవడానికి కారణం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమేనంటూ, జనంలో బలంగా తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే బీజేపీతో వైసీపీ అంటకాగుతోందన్న విషయాన్ని ఎస్టాబ్లిష్‌ చేసేందుకు, అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.

2014 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. కానీ ఫలితాలు వచ్చిన వెంటనే, ప్రమాణస్వీకారానికి ముందే, నరేంద్ర మోడీని కలిశారు జగన్. ప్రత్యేక హోదా ఇవ్వాలని విన్నవించినట్టు చెప్పుకున్నారు. ఆ తర్వాత హోదా అటకెక్కడం, విభజన చట్టం హామీలు పక్కనపెట్టడం, నిధులు విడుదలకాకపోవడంపై దాని మిత్రపక్షమైన టీడీపీపై ఒక రేంజ్‌లో విమర్శలు చేశారు కానీ, అందుకు కారణమైన బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటా అనలేదు. అన్నట్టుగా కనీసం సంకేతాలు పంపలేదు. అదే బీజేపీ-వైసీపీ రహస్య స్నేహం మీద, టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలమిస్తోందని విశ్లేషకులంటున్నారు.

దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఆ గుంపులో జగన్‌ కనపడలేదు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల కూటములు కూడా వేదికలు పంచుకుంటున్నాయి. ఆ స్టేజ్‌పైనా వైసీపీ నాయకులు లేరు. కనీసం మమతా బెనర్జీ, కేసీఆర్‌తోనైనా ప్రత్యామ్నాయ కూటమిపై ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా చర్చించిన దాఖలా లేదు. పెద్దనోట్ల రద్దు, పెట్రోల్ ధరల పెంపును విమర్శించలేదు. దళితులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఆందోళనలపైనా మాట్లాడలేదు.

బీజేపీ వ్యతిరేకపోరులో జగన్‌ ఎక్కడా కనపడలేదు. అలాగని కాంగ్రెస్‌ శిబిరంలోనూ జగన్‌ లేడు. మొన్న జరిగిన కాంగ్రెస్‌ ఇఫ్తార్‌ విందుకూ వెళ్లలేదు. ఇదొక వ్యూహం కావచ్చు గానీ, ఇవే రహస్య స్నేహంపై అనుమానాలు కలిగిస్తున్నాయని, టీడీపీ చాలా గట్టిగా వాదిస్తోంది. అడక్కముందే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వడం, మొన్న విజయ సాయిరెడ్డి ప్రధానితో భేటి కావడం, నిన్న రాజేంద్రనాథ్‌ రెడ్డి కమలం పెద్దలతో సమావేశం కావడమే అందుకు నిదర్శనమని వాదిస్తోంది టీడీపీ.

నిజంగా బీజేపీ నేతలను వైసీపీ నాయకులు కలిశారో, లేదో తెలీదు. భవిష్యత్తులో కలుస్తారో, కలువరో కూడా గ్యారంటీ లేదు. కానీ ఇలా కలిశారు, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం, తెలుగుదేశం ఎస్టాబ్లిష్‌ చేస్తోంది. ఇలా రెండు పార్టీలనూ ఒకేగాటన కట్టడమన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఎందుకంటే, బీజేపీ అంటే, ఇప్పటికే ఏపీలో జనం ఆగ్రహంగా ఉన్నారని లెక్కలేస్తున్న చంద్రబాబు, రాష్ట్రానికి అన్యాయం చేసిన అదే పార్టీతో వైసీపీ కుమ్మక్కయ్యిందని చెప్పుకోవడం ద్వారా అనేక రాజకీయ వ్యూహాలు వేస్తున్నారు. రెండూ దొందూదొందేనని చెప్పడం ద్వారా, వైసీపీని కూడా విలన్‌గా ముద్ర వేయొచ్చన్నది ఆ పార్టీ వ్యూహం. బీజేపీ బూచి చూపి, వైసీపీ ఓటు బ్యాంకయిన దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలను తమవైపు ఆకర్షించొచ్చని బాబు స్ట్రాటజీ కావొచ్చని ఎనలిస్టుల విశ్లేషణ.

అయితే బీజేపీతో స్నేహాన్ని మాత్రం అటు కమలనాథులు, ఇటు జగన్ పార్టీ నాయకులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు. చంద్రబాబే ఉలికిపడుతున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి మొన్న విజయసాయిరెడ్డి కేంద్రమంత్రులతో భేటీలు, నిన్న బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రహస్య సమావేశాలంటూ, టీడీపీ రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తోంది. ఇవే ఆయుధాలుగా, తాజాగా కడప ఉక్కు పరిశ్రమపై అన్యాయం, ప్రత్యేక హోదా, నిధులపై జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్ట్రాటజీ చేస్తోంది. త్వరలో టీడీపీ ఎంపీలు కడప, వైజాగ్‌లో నిరసనలు చేయబోతున్నారు. చూడాలి, ఈ కలయికల లుకలుకలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో.

Show Full Article
Print Article
Next Story
More Stories