మరో స్వాతి ఎపిసోడ్..బావ సాయంతో భర్తను కడతేర్చిన కసాయి పెళ్లాం

మరో స్వాతి ఎపిసోడ్..బావ సాయంతో భర్తను కడతేర్చిన కసాయి పెళ్లాం
x
Highlights

గుంటూరు జిల్లాలో మరో స్వాతి ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. బావ సాయంతో భర్తను చంపేసింది ఓ కసాయి పెళ్లాం. బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీవిద్య...

గుంటూరు జిల్లాలో మరో స్వాతి ఎపిసోడ్ వెలుగులోకి వచ్చింది. బావ సాయంతో భర్తను చంపేసింది ఓ కసాయి పెళ్లాం. బావతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీవిద్య భర్తను అడ్డుగా భావించింది. బావతో పాటు మరో ఇద్దరి సాయంతో భర్తను హత్య చేసింది. సాతులూరులో గత నెల 19న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడు నివాసి నల్లబోతు నరేంద్ర(27)కు అదే గ్రామంలో ఉండే మేనమామ కూతురు శ్రీవిద్యతో మూడున్నరేళ్ల కిందట పెళ్లయింది. నరేంద్ర పరిశ్రమ కాపలాదారుగా, శ్రీవిద్య నరసరావుపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గత నెల 19న తనను ఇంటికి తీసుకెళ్లేందుకు నరసరావుపేటకు రావాలని శ్రీవిద్య భర్తను కోరింది. మరుసటి రోజే మార్గమధ్యంలోని నాదెండ్ల మండలం సాతులూరు పొలిమేరలో నరేంద్ర మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు మృతుడి ఫోన్‌ కాల్స్‌పై దృష్టి సారించారు.

మృతుని భార్యకు, ఆమె అక్క లావణ్య భర్త గొట్టిపాటి వీరయ్య అలియాస్‌ వాసుకు చివరలో ఎక్కువ కాల్స్‌ ఉండటాన్ని గమనించి కూపీ లాగారు. పెళ్లి కాకముందు నుంచే శ్రీవిద్యతో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమందకు చెందిన ఆమె బావ వీరయ్య సంబంధాలు కొనసాగిస్తున్నారని తేలింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని శ్రీవిద్య, వీరయ్య కలిసి నరేంద్రను హతమార్చాలని పథకం వేశారు. దాని ప్రకారం.. వీరయ్య తన తోడల్లుడు నరేంద్రకు ఫోన్‌ చేసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో తనకు రూ.పది లక్షలు రావాల్సి ఉందని, వసూలుకు సాయం చేయాలని కోరాడు. ఆ డబ్బు వస్తే జనవరి 1న బుల్ల్లెట్‌ కొనిస్తానని ఆశ చూపాడు. గత నెల 19న భార్యను ఇంటికి తెచ్చేందుకు నరసరావుపేటకు బయలుదేరిన నరేంద్రను కారులో ఎక్కించుకున్నాడు. బస్టాండ్‌ వద్ద ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్లకు చెందిన గుంజి బాలరాజు, గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల వాసి పి.చౌడయ్యలనూ వెంటబెట్టుకున్నాడు. మద్యం, శీతల పానీయాలు, తినుబండారాలు కొని వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఓ చోట కారు నిలిపారు. అప్పటికే మత్తులో ఉన్న నరేంద్రకు సైనేడ్‌ కలిపిన మద్యం అందించారు. ఆయన ప్రాణాలు వదిలాక మృతదేహాన్ని సాతులూరు పొలిమేరలో కాల్వ కట్టపై పడేశారు. పక్కన సగం ఖాళీ చేసిన మద్యం సీసాలో పురుగుమందు కలిపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. దర్యాప్తు అనంతరం నరేంద్ర అనుమానాస్పద మృతిని పోలీసులు హత్య కేసుగా మార్చారు. ప్రధాన నిందితుడు వీరయ్యను, సహకరించిన బాలరాజు, చౌడయ్యలను అరెస్టు చేశారు. మరో నిందితురాలు శ్రీవిద్య పరారీలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories