అన్నదాతకు అన్యాయమేనా?

x
Highlights

రైతులు అష్ట కష్టాలు పడి కూరగాయలు పండిస్తున్నా అటు రైతు, ఇటు వినియోగ దారుడు ఇద్దరూ నానా అగచాట్లూ పడుతున్నారు పంట మార్కెట్ కి వస్తున్నా రైతు జేబు నిండటం...

రైతులు అష్ట కష్టాలు పడి కూరగాయలు పండిస్తున్నా అటు రైతు, ఇటు వినియోగ దారుడు ఇద్దరూ నానా అగచాట్లూ పడుతున్నారు పంట మార్కెట్ కి వస్తున్నా రైతు జేబు నిండటం లేదు అటు వందలు వందలు పోస్తున్నా వినిమయ దారుడి సంచి నిండటం లేదు పండిన పంటకు, ఇంటికి చేరే ధరకు మధ్యలో ఏం జరుగుతోందనిత్యం పండించేవే రోజూ తినే సరుకే కానీ అవే సరుకుకు ఒక్కోసారి ఒక్కో ధర ప్రకృతి కారణాలతో కూరగాయల ధరలలో హెచ్చు తగ్గులు సహజమే కానీ మరీ ఎక్కువ తేడా ఉంటే మాత్రం అను మానించాలి ఒక్కోసారి కొరత ఒక్కోసారి ధరల పతనం దీనికి కారణమేంటి?ధరలు మధ్యతరగతి, పేద ప్రజలకు ఇవి శరాఘాతం. టమాటా మళ్లీ రోడ్డున పడింది. మిర్చి మాత్రం అదిరిపోయే ఘాటున్నా పండించే రైతుకు మాత్రం కన్నీళ్లే మిగులుస్తోంది అదే పంట, అదే భూమి, అదే రైతు అదే వినియోగ దారుడు కానీ సీన్ మాత్రం సీజన్ సీజన్ కి ఎందుకు మారుతుంది? ఆ మధ్య టమాటా రేట్లు ఆకాశానికంటడంతో కూరల్లో టమాటా వాడకం మానేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా అయితే అదిరిపోయే రేటు లేదంటే నేల చూపులే టమాటా రైతుల ఆవేదన ఇది నిన్న మొన్నటి వరకూ కేజీ30,40 రూపాయలమ్మిన టమాటా ఇప్పుడు కేజీ రూపాయికి పడిపోయింది అయినా వినిమయ దారుడికి మాత్రం ఆ ధరకు రానంటోంది అటు పండించిన రైతు, ఇటు కొంటున్న వినియోగ దారుడూ ఇద్దరూ బాధితులు గానే మిగిలి పోతున్నారు.

ఒకటి రెండు నెలల కిందట టమాటా అంటే అదిరిపోయే రేటు కేజీ వంద వరకూ పలికింది. కానీ ఇప్పుడు కేజీ అయిదు రూపాయలు పలుకుతోంది కొన్ని కొన్ని చోట్ల కేజీ రూపాయన్నా కొనేవారూ లేరు. తినే వారు లేరు కష్టపడి పండించిన పంట మొత్తం రోడ్ల పాలవుతోంది. దీనికి సవాలక్ష కారణాలున్నాయి మన రాష్ట్రంలో తగినన్ని శీతల గిడ్డంగులు లేకపోవడం, టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడం వల్ల ఒక్కసారి పంట పండితే దానిని నిల్వ చేసి రైతే లాభసాటిగా అమ్ముకునే వ్యవస్థ లోపించింది తెలంగాణలో 50 వేల ఎకరాల్లో టమాటా సాగు చేస్తారు దీనికి తోడు ఏపి, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుంచి కూడా టమాటా దిగుమతి అవుతుంది సాధారణంగా చలికాలంలో టమాటాలు బాగా పండుతాయి. టమాటా పంట ఎంత పండినా బాగుపడేది, లాభపడేది మాత్రం దళారీలే టమాటాకు మార్కెట్ లో డిమాండ్ ఉన్నా ఆ అవసరం రైతు వరకూ చేరడం లేదు అదే సీజన్ లో టమాటా ధర తగ్గితే ఆ ఎఫెక్ట్ మాత్రం రైతు మీద దారుణంగా పడిపోతుంది రైతు కష్టపడి టమాటా పండిస్తే దళారులు కేజీ రూపాయికి కొని దానిని మార్కెట్లో అయిదునుంచి పది రూపాయలకు అమ్ముతున్నారు మన రాష్ట్రంలో ఏసి గొడౌన్లు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణం.

తెలంగాణకు దాదాపు 216 గొడౌన్లు అవసరం కాగా ఇప్పుడున్నవి కేవలం 56 గొడౌన్లు కాస్త సొమ్మున్న రైతు ఏసి గొడౌన్ లో నిల్వ చేసుకోగలడు కానీ అప్పటికప్పుడు అమ్ముకుని సొమ్ము చేసుకునే రైతులే మనదగ్గర ఎక్కువ కావడంతో దళారీలది మెయిన్ రోల్ అయిపోతోంది. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే దిగుమతులూ ఒక కారణమే.. ఈసారి వరంగల్ లో టమాటా పంటను రోడ్లపై కుమ్మరించేశారు. కారణం దానికి తగిన గిట్టుబాటు ధర రాకపోవడమే ఈసారి అనంతపురం నుంచి ఎక్కువగా టమాటా వరంగల్ కు దిగుమతి కావడంతో స్థానిక పంటను కొనేవారే కరువయ్యారు.. వ్యాపారులు, దళారులు, మార్కెట్ యార్డు సిబ్బంది కుమ్మక్కై బయట నుంచి పంటను కొని అమ్ముతుంటే.. స్థానిక పంటను కొనేదెవరు? రైతు పంటను కొనేవారు లేక అయిన కాటికి అమ్ముకుపోవడమో.. నిరాశ పెరిగితే రోడ్డుపైనే కుమ్మరించి వెళ్లిపోడమో చేస్తున్నారు..

ఇక ఎండుమిర్చి విషయంలో మాత్రం రైతు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నాడు మిర్చి పంటకు తగిన ధర రాక ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి పంటలో అడుగడుగునా మోసమే.. ఈ ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు రాక రైతులు పంటను తగులబెట్టేసారు మరికొందరు అప్పుల పాలయి ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పరిస్థితి ఒక్క తెలంగాణే కాదు.. అటు ఏపిలో గుంటూరు మార్కెట్ యార్డులోనూ అదే పరిస్థితి.. రైతులు తెచ్చే పంటను కొనడానికి సవాలక్ష నాణ్యతా పరమైన వంకలు పెట్టే వ్యాపారులు తాము అమ్మాల్సి వస్తే మాత్రం రేట్లు దారుణంగా పెంచేస్తారు..క్వింటాల్ మిర్చి నాలుగు వేలకు మించి ధర లేదంటారు వ్యాపారులు.. పోనీ ఆ రేటుకు వినియోగ దారుడికి వస్తుందా అంటే అదీ లేదు.. అటు రైతు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే.. కొనుగోలు దారుడు ధరల మోతకు భయపడి పోతున్నాడు ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డులపై దాడులు చేస్తున్నారు..క్వింటాల్ మిర్చి కనీసం10 వేలకు కొనాల్సి ఉండగా, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై క్వింటాల్ 4,500 కు కొంటున్నారు. పోనీ వినియోగ దారుడికి రేటు తగ్గుతోందా అంటే అదీ లేదు.. లెక్క ప్రకారం క్వింటాల్ 4,500కి వ్యాపారి కొనుగోలు చేస్తే కిలో మిర్చి 45 రూపాయలకు రావాలి.. కానీ వినియోగదారుడికి వ్యాపారులు కేజీ వంద లేదా 120కి తక్కువ అమ్మడం లేదు.. అంటే కేజీపై 50 నుంచి 60 రూపాయలు వ్యాపారికే లాభం.. ఇక రైతు ఏడవక ఏం చేస్తాడు? రాత్రనకా, పగలనకా కష్టపడి పంటను సాగు చేస్తే.. రైతుకు మిగిలేది అప్పులు.. ఏ మాత్రం కష్టపడకుండా వ్యాపారులు మాత్రం దర్జాగా కూర్చుని ఇటు రైతులను, అటు వినియోగ దారులను దోచేస్తున్నారు.

ఇక రైతును వ్యాపారులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది ఏడిపించాలంటే సవాలక్ష వంకలు దొరుకుతాయి నాణ్యమైన సరుకునూ నాణ్యత లేని సరుకుగా తేల్చేయగల నైపుణ్యం మన అధికారులది. ఇద్దరూ ఏకమై ఎంత క్వాలిటీ సరుకు తెచ్చినా ఏదో ఒక వంకతో రేటును తగ్గించేలా చేయడమే వారి పని.. పత్తి విషయమైనా, ఎండు మిర్చి విషయమైనా అదే తీరు.. పంట ఎక్కువ వస్తే చాలు.. ధర తగ్గించుకుంటూ పోతారు..అధికారులు, వ్యాపారులు కలసి ఒక పథకం ప్రకారం ధరలను తగ్గించేస్తూ.. రైతుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు ఉల్లిపాయ లేనిదే వంటింట్లో ఇల్లాలికి రోజు గడవదు ఉల్లి దెబ్బకు గతంలో ప్రభుత్వాలు కూడా కుప్ప కూలాయి. 1998లో ఢిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలు,1980లో కేంద్ర ప్రభుత్వం కుప్ప కూలడానికి ఉల్లిపాయలే కారణం ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువగా ఉల్లిపాయలను పండించే దేశం మనదే మొత్తం దిగుబడిలో 45 శాతం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలనుంచే అందుతుంది. ఇంత ఎక్కువ ఉత్పత్తి ఉన్న చోట అసలు కరువును ఊహించగలమా? కానీ ఇక్కడ బ్లాక్ మార్కెటీర్ల మాయాజాలం వల్ల సరుకు కనపడకుండా పోతోంది. అందుకే ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఉల్లిపాయలను కొంత కాలం సరఫరా చేసింది. ఉల్లిపాయలకు కొరత వచ్చినప్పుడల్లా స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం అందిస్తోంది అలాంటి ఉల్లి ధర ప్రస్తుతం కేజీ 40 రూపాయలుంది ఒక్కోసారి 60 వరకూ కూడా ఈ ధర పోతోంది మరోమారు ఉల్లి పాయల ధరలకు రెక్కలొస్తాయేమోనన్న భయాందోళనలు సగటు పౌరుడిని కుదిపేస్తున్నాయి ఏ పంటకైనా కొరత ఎందుకొస్తుంది? సీజన్లలో ప్రకృతి పరంగా జరిగే నష్టాలు రైతు పై పడకుండా ధరల స్థిరీకరణ నిధిని ఎందుకు అమలు చేయలేం? కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో రాజకీయాలెందుకు జరుగుతున్నాయ్?

వ్యవసాయమంటేనే జూదం వర్షాలు పడి, సరైన విత్తనాలు దొరికి పంటలు వేస్తే చీడ పీడలు వేపుకు తింటాయ్ అయినా అప్పులు చేసి, పెట్టుబడి పెట్టి రైతు పంట పండించి మార్కెట్ కు తెస్తాడు అలాంటి రైతు నేరుగా పంటను అమ్ముకునే విధానం కోసమే మార్కెట్ యార్డులు, రైతు బజార్లు పుట్టుకొచ్చాయ్ కానీ అక్కడా దళారుల దందాయే సాగుతోంది. వ్యాపారుల పైత్యమే నెగ్గుతోంది వ్యాపారులు, అధికార్లు మిలాఖత్ అయిపోయి రైతు నెత్తిన కుచ్చు టోపీ పెట్టేస్తారు. నెంబర్ వన్ క్వాలిటీ పంట తెచ్చినా ఏవో వంకలు పెడతారు.. లేనిపోని నిబంధనలను తెరపైకి తెస్తారు.. చాలా తక్కువ రేటుకు పంటను కొంటారు.. ఈపరిస్థితిని నివారించడానికే కనీస మద్దతు ధర డిమాండ్ పుట్టుకొచ్చింది.. కానీ కనీస మద్దతు ధర నిర్ణయించాల్సిన సర్కార్లు ముఖం చాటేస్తాయి. ఒకవేళ ధర పెట్టినా సరుకు నాణ్యత పేరుతో రైతు ముందరి కాళ్లకు బంధం వేస్తారు..ఒక్కోసారి కనీస మద్దతు ధర చెల్లిస్తామని చెప్పి సర్కారే చేతులెత్తేస్తుంది..ఆర్భాటంగా పథకాలు, స్కీములు ప్రకటించడం కాదు.. ప్రకటించిన వాటి అమలుపై చిత్తశుద్ధి కూడా ఉండాలి.. రాజకీయం, వ్యాపారం, కలగలిసిపోతే వ్యవస్థ ఎంత కలుషితమైపోతుందనడానికి ఈ రంగమే పెద్ద ఉదాహరణ.. రైతుకు ఉపశమనం పేరుతో మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసినా,ఏసి గొడౌన్లు కల్పించినా, మద్దతు ధరలు ప్రకటించినా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినా.. సమస్య సమస్యలాగే ఉండిపోతోంది. రైతు కంటా కన్నీరే.. కొనుగోలు దారుడి కీ ధరల మంటే.

Show Full Article
Print Article
Next Story
More Stories