జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడ?

జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడ?
x
Highlights

ప్రశ్నిస్తా...ప్రశ్నిస్తా.. అన్న జనసేనాని ఎక్కడ? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకొన్న వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడు? కేంద్ర ప్రభుత్వం గత వారం...

ప్రశ్నిస్తా...ప్రశ్నిస్తా.. అన్న జనసేనాని ఎక్కడ? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకొన్న వ్యక్తి ఎందుకు మౌనంగా ఉన్నాడు? కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగినా ఎందుకు అజ్ఞాతవాసి అయ్యాడు? ప్రశ్నిస్తే కేంద్రం తన పవర్ కట్ చేస్తుందన్న భయమా? లేక దీని వెనుక ఏదైనా దీర్ఘకాల వ్యూహం ఉందా? ప్రశ్నించాల్సిన సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించకపోవడంపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.

జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు? అన్యాయాన్ని ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ పెట్టానని చెప్పే పవన్.. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయంపై ఇంత కలకలం చెలరేగుతుంటే కనీసం స్పందించకపోవడం ఏంటి? ముఖ్యంగా బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై జనసేన తప్ప పార్టీలన్నీ కేంద్రంపై భగ్గుమంటున్నాయి. కేంద్ర సర్కార్ పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. కానీ జనసేన ఇప్పటివరకు స్పందించపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిలదీయాల్సిన నోరెందుకు పలకడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలే రాజకీయ యాత్రలు చేపట్టి..ఇక ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, కొద్దిరోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద విషయంపై ఇలా సైలెంట్ గా ఉండిపోవడం ఏంటి? ఇప్పుడు పవన్ గురించి సోషల్ మీడియాలో ఈ ప్రశ్నలే హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రానికి ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా స్పందించకపోవడం..పవన్ రాజకీయ వైఖరిని తేటతెల్లం చేస్తోందని..ఇకనైనా అతని నిజ స్వరూపం తెలుసుకోండని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు, కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

రేపటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ఆలోచించి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారా? లేక బడ్జెట్లో అసలు ఏపీకి అన్యాయం జరిగినట్లు భావించడం లేదా? లేక అసలు బడ్జెట్ విడుదల విషయం ఇంకా తెలియలేదా?...లేదా కేంద్ర బడ్జెట్ మీద స్పందించేంత అవగాహన లేదు అని అంటారా?...ఇలా ఏ కారణంతో ఆయన స్పందించడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలని నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇప్పటికైనా పవన్ స్పందించకపోతే ఇమేజ్ చాలా డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన బాధ్యత జనసేనానిదేనని.. గతంలో టీడీపీ-బీజేపీ పొత్తును ముందుండి బలపర్చి ప్రచారం చేసిన విషయం ఎవరూ మర్చిపోలేదని అంటున్నారు. రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదో.. ప్రజలకు వివరించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

అనంత కరువుపై అధ్యయనం చేసిన పవన్.. సమస్య పరిష్కారానికి ఈ వారంలో ప్రధాని మోడీని కలుస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటిలో బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. అయితే ఇదే తీరు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలెవరూ జనసేనను నమ్మరని అటు నెటిజన్లే కాదు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories