మోత్కు పల్లితో భేటీ అందుకే రద్దయిందా?

x
Highlights

పవన్ కల్యాణ్ జన సేన తెలంగాణలో ఆచితూచి అడుగులు వేస్తోందా? పార్టీ చేరికలపై ఏలాంటి తొందర పడటం లేదా? అందుకే మోత్కుపల్లి నర్సింహులు చేరికపై అనాసక్తిని...

పవన్ కల్యాణ్ జన సేన తెలంగాణలో ఆచితూచి అడుగులు వేస్తోందా? పార్టీ చేరికలపై ఏలాంటి తొందర పడటం లేదా? అందుకే మోత్కుపల్లి నర్సింహులు చేరికపై అనాసక్తిని ప్రదర్శిస్తోందా? తెలంగాణలో కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించిన పవన్ ఎన్నికల వ్యూహం ఏలా ఉండనుంది?

తెలంగాణలో జనసేన ఎంట్రీకి పవన్ కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందుకెలుతున్నారా? పార్టీలోకి ఎవరెవరిని తీసుకోవాలి? ఎవరితో కలిగే ఉపయోగాలేంటి అనే అంశాలపై పూర్తి క్లారిటీతో ఉన్నారా? జనసేన లో జరుగుతున్న అంతర్మధనం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఏపీ లో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేక మవుతున్నారు. ప్రత్యేక హోదా మొదలుకుని ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యంపై జిల్లాల వారీగా సమస్యల పై సమర శంఖం వినిపిస్తున్నారు. ఆయనతో సీపీఎం, సీపీఐలు జట్టు కట్టడంతో ఏపీలో మూడో ప్రత్యామ్నయం ఖాయమని తేలిపోయింది. ఇంత కాలం ప్రశ్నించేందుకే జన సేన అన్న పవన్ ఇప్పుడు ఎన్నికల గోదాలోకి దిగేందుకు రెడీ అయ్యారు. అందుకు అనుగుణంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారు. తనదైన దూకుడుతో ఏపీ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తున్నారు.

ఏపీలో మంచి దూకుడు మీద ఉన్న పవన్ తెలంగాణ విషయంలో మాత్రం ఆచీ తూచి అడుగులు వేస్తున్నారు. అడపా దడపా తెలంగాణ రాజకీయాలపై తన అభిప్రాయలను వ్యక్తం చేస్తున్న పవన్ ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాత్రం తొందరపడటం లేదు. పార్టీలో చేరుతామని ముందుకు వస్తున్న నాయకుల పట్ల సైతం ఆయన పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అందుకే మాజీ మంత్రి, టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తో బేటిని చివరి నిమిషంలో రద్దు చేసారు. అయితే ఈ రద్దు వెనక పెద్ద కసరత్తే జరిగినట్టు జనసేన సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

మోత్కుపల్లి గత కొంత కాలంగా పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పవన్ తో చేతులు కలపాలని భావించారు. మాజీ మంత్రి, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో మోత్కుపల్లికి జనసేన తెలంగాణ శాఖలో కీలక బాధ్యతలు అప్ప జెబుతారనే ప్రచారం సాగింది. అనుగుణంగా ఆగస్టు 2, గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు పవన్, మోత్కుపల్లి భేటీ ఖరారైంది. అయితే చివరి నిమిషంలో పవన్ తన మనసు మార్చుకున్నారు. మోత్కుపల్లి నరసింహులు తీరు పట్ల అనుమానాలు బలపడటమే భేటీ రద్దుకు కారణమని జనసేన పార్టీ లో ప్రచారం సాగుతోంది. మోత్కుపల్లి తన అవసరాల కోసమే పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు తప్ప జనసేన బలోపేతం కోసం కాదనే విషయం పవన్ కి చేరడం వల్లే పవన్ మన మనసు మార్చుకున్నారట. జనసేన లో కీలక భాద్యతలు చేపట్టిన తర్వాత దీర్ఘాకాలం పార్టీ కోసం పనిచేసే ఆలోచనలో మోత్కుపల్లి లేరని జనసేన లో ఉంటూ మరో పార్టీలో చేరడం ఖాయమనే సమాచారం పవన్ కు చేరినట్లు తెలుస్తోంది అందుకే మోత్కుపల్లి చేరికను పవన్ వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఏలాగు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించాలని పవన్ నిర్ణయించారు. కేసీఆర్ సర్కార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఎన్నో సార్లు కితాబిచ్చారు. అలాంటప్పుడు పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాల్సిన అవసరం ఇప్పటికిప్పుడు జనసేనానికి లేదు. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు పవన్ కల్యాణ్ ను వినియోగించుకోవాలన్న యోచనలో టీఆర్ఎస్ ఉంది. అందుకే టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి అభ్యర్ధులను నిలబెట్టాలని పవన్ భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గం, సెటిలర్లు, యువత ను ఆకట్టుకునేందుకు పవన్ తో టీఆర్ఎస్ జట్టుకట్టినా ఆశ్చర్యపోనక్కర లేదనే టాక్ ఉంది. అందుకే తెలంగాణలో ఇప్పటికిప్పుడు పార్టీలో మోత్కుపల్లి వంటి సీనియర్ నేతలను చేర్చుకోవాల్సిన అవసరం పవన్ కు లేదని జనసేన సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చివరి నిమిషంలో మోత్కుపల్లితో భేటీని పవన్ రద్దు చేసుకున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories