ఆర్మూర్‌ రూలర్‌ ఎవరు?

x
Highlights

ఒకరు రాజకీయ చతురత తెలిసిన తాజా మాజీ ఎమ్మెల్యే. మరొకరు ఎమ్మెల్యేగా పనిచేసి ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉన్న నాయకురాలు. మరొకరు అధికార పార్టీ సిట్టింగ్...

ఒకరు రాజకీయ చతురత తెలిసిన తాజా మాజీ ఎమ్మెల్యే. మరొకరు ఎమ్మెల్యేగా పనిచేసి ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉన్న నాయకురాలు. మరొకరు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఒకప్పటి ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు ఆ ముగ్గురు బరిలో నిలిచారు. నేనంటే నేనంటూ ప్రచారంలో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి అభ్యర్ధులు అధికారికంగా ఖరారు కాకున్నా ప్రచారం ప్రారంభించి అధికార పార్టీకి సై అంటే సై అంటున్నారు. త్రిముఖ పోరులో ఆర్మూర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు విజేతగా ఎవరికి మద్దతివ్వబోతున్నారు ముగ్గురు అభ్యర్థుల వ్యూహ ప్రతివ్యూహాలేంటి?

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం అక్షర క్రమంలో ముందు వరుసలో ఉంటుంది. జిల్లా రాజకీయాలకు గుండెకాయ లాంటి ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. అలాంటి నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారాయి. కాపు, రెడ్డి, పద్మశాలి, మైనార్టీ, ఆర్యక్షత్రియా, దేవాంగి, ఎస్సీలు వంటి కీలక సామాజిక వర్గాలు, అభ్యర్ధుల గెలుపు ఓటముల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. నియోకవర్గంలో మొత్తం 1, 70,732 మంది ఓటర్లు ఉండగా 90,402 మంది మహిళలు, 80, 325 మంది పురుషులు ఓటర్లుగా ఉన్నారు.

అధికార టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టికెట్టు ఖరారు కాగా బూత్ లెవల్‌లో ఓ దఫా ప్రచారం పూర్తి చేశారు. ఎంపీ కవితతో పాటు మంత్రులు, జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహంచారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరడం జీవన్ రెడ్డికి బలంగా మారింది. సురేష్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన కీలక నేతలు సైతం గులాబీ గుటికి చేరారు. ఫలితంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి బలంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ - బీజేపీ పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులు బరిలో ఉండటం టీఆర్ఎస్ అభ్యర్ధికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఎన్నికల్లో అన్నీతానేగా ఉన్న మిత్రుడు ప్రస్తుతం పార్టీ మారి బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉండటం టీఆర్ఎస్ అభ్యర్ధికి మింగుడుపడటం లేదు.

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచే అవకాశముంది. ఆకుల లలిత పేరు అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా ప్రచారంలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ నుంచి మాజీ సభాపతి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడం హస్తం పార్టీకి కొంత నష్టం చేకూర్చింది. అదే సమయంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితను రంగంలోకి దింపిన కాంగ్రెస్ అధిష్ఠానం, నష్ఠ నివారణ చర్యలు చేపట్టింది. ఐతే ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలిత, ఎమ్మెల్యే కోసం ఆర్మూర్‌లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధికి గట్టి పోటీనిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

బలమైన సామాజికవర్గం, మహిళగా ఎమ్మెల్సీగా గుర్తింపు ఉండటం కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు ఆకుల లలిత. ఐతే రేవంత్ వర్గంగా గుర్తింపు పొందిన మరో నేత రాజారాం యాదవ్, టికెట్టు రేసులో ఉన్నారు. ఒకవేళ టికెట్టు ఆకుల లలితకు ఖరారైతే రాజారాం యాదవ్ వర్గం ఆకుల లలితకు ఏ మేరకు సహకరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

భారతీయ జనతా పార్టీ సైతం, ఆర్మూర్ నియోజకవర్గంపై గురి పెట్టింది. ఒకప్పుడు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రాణ స్నేహితునిగా ఉన్న వినయ్ రెడ్డిని బీజేపీ తమ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. టీఆర్ఎస్‌లో ఉన్న వినయ్ రెడ్డి, బీజేపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్తజోష్ కనిపిస్తోంది. ఎన్నికలే లక్ష్యంగా కొంత కాలంగా నియోజవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలతో, వినయ్ రెడ్డికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత ఈమేజ్ వినయ్ రెడ్డికి పాజిటివ్‌గా మారే అవకాశంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే.. ఆర్మూర్‌లో ఈసారి విజేత ఎవరన్నది ఉత్కంఠగా మారింది. త్రిముఖ పోరులో మహిళకు పట్టం కడతారా...? సిట్టింగ్ కు మరో అవకాశం కల్పిస్తారా.. ? సామాజిక సేవ చేసే అభ్యర్ధిని గట్టెక్కిస్తారా అన్నది వేచిచూడాలి.....?

Show Full Article
Print Article
Next Story
More Stories