పవన్‌ను నడిపిస్తున్న నాయకుడెవరు?

పవన్‌ను నడిపిస్తున్న నాయకుడెవరు?
x
Highlights

ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారుతానన్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? పాలిటిక్స్‌లో ఆరడుగుల బుల్లెట్‌ ఇక దూసుకుపోతాడా? అన్నయ్య పార్టీ ఐదారేళ్లలో...

ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారుతానన్న జనసేనాని ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? పాలిటిక్స్‌లో ఆరడుగుల బుల్లెట్‌ ఇక దూసుకుపోతాడా? అన్నయ్య పార్టీ ఐదారేళ్లలో దుకాణం ముసేయడానికి కారకులెవరో తెలుసంటూ ఎవరినీ వదిలిపెట్టనంటూ శపథం చేసిన కాటమరాయుడు ఇక కదం తొక్కబోతున్నారా? తెలంగాణ నుంచి ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టడం వెనుక పవన్‌‌కల్యాణ్‌ స్కెచ్‌కు అసలు లెక్కేంటి? మంచి చేస్తే చెడును వెతికే పవర్‌ పాలిటిక్స్‌లో పవన్ నిలిచి గెలుస్తారా? తట్టుకొని నిలబెడతారా? మొత్తంగా మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్‌ ఏ మలుపు తిరగబోతోంది? మున్ముందు పవన్‌కల్యాణ్‌ రాజకీయం ఎలా ఉండబోతోంది?

నాలుగేళ్లు అనేది వయసు కింద చెప్పుకుంటే చాలా తక్కువ. కానీ రాజకీయాల్లో నాలుగేళ్లు నలగడమంటే సీనియర్‌ కిందే లెక్క. నాలుగేళ్ల కింద పురుడుపోసుకున్న జనసేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని ప్రక‌టించాడు సేనాని. ఆ దిశ‌గా పార్టీని నిర్మించే ప‌నిలో ఉన్నారా? క్యాడ‌ర్‌ను నిర్మించుకునే ప్రయ‌త్నం చేస్తున్నారా? ద‌శ‌ల‌వారీగా నాయ‌కుల్ని ఎంపిక చేసుకుంటున్నారా..? అందులో భాగంగానే తెలంగాణ నుంచి ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టారా.?

పవర్‌స్టార్‌కు సమాజం పట్ల అంకిత భావం ఎక్కువంటారు అభిమానులు. కొమురం పులి నిశ్శబ్ద సంచలనమంటారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లోని ప‌ట్టుద‌ల‌ గురించి జ‌నాల‌కు తెలిసింది త‌క్కువంటారు ఆయన సన్నిహితులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తర్వాత అసలు మీడియా ముందుకే రాని పవన్‌ అజ్ఞాతవాసి సక్సెస్‌ అంచనాలను తలకిందులు చేయడంతో కాస్త నిరాశలోకి వెళ్లాడేమోనన్న అనుమానాలు ఉండేవి. అలాంటిది అనూహ్యంగా, అకస్మాత్తుగా కొండగట్టు నుంచి ప్రజాయాత్రకు రెడీ అంటూ ట్వీట్లు చేయడం అన్నట్టుగానే దానికి శ్రీకారం చుట్టడం అంతా టకటకా జరిగిపోయాయి. అస‌లింత‌కీ ప‌వ‌న్‌లో ఇంత‌లోనే అంత ఫైర్ ఎలా వ‌చ్చింది?

నా నిజమైన గొంతుక వినిపించేందుకే రాజ‌కీయాల్లోకి వ‌చ్చానంటారు పవన్‌ ఇక రాజ‌కీయాలే అనుకుంటే ఇక అన్నీ వ‌దిలేస్తానన్నారు. తాను సైలెంటుగా ఉన్నానంటే ఏ ప‌నీ చేయ‌లేద‌ని, చేయలేనని కాదంటూ తనలోని ఇంకో కోణం ఉందన్నారు కాటమరాయుడు. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా రంగంలోకి దిగితే సక్సెస్ అవుతారా? అసలు పవన్‌కున్న అనుకూలతలు ఏమిటి? తెలంగాణలోనూ తనకు అభిమానులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ తర్వాత ఓ మాట చెప్పిన పవన్‌ ప్రజాయాత్రకు తెలంగాణ నుంచే శ్రీకారం చుట్టడంలో ఆంతర్యమేంటి?

తాను మెచ్చిందే తనకు నచ్చిందే చేసే పవన్ రాజకీయ పద్మవ్యూహంలో ఎంతవరకు నెగ్గుకొస్తారు? సమాజానికి ఏదో చేయాలన్న తపన రాజకీయాల్లో పనికొస్తుందా? ఇలాంటి ప్రశ్నలను కాస్త పక్కనపెడితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడంలో ఆంతర్యం తెలంగాణ రాజకీయానికి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. తెలంగాణలో 24గంటల విద్యుత్ ఇవ్వడాన్ని చూసి ఆశ్చర్యపోయానన్న జనసేనాని నిరంతర విద్యుత్ ఎలా సాధ్యమైందో సీఎం అడిగి తెలుసుకున్నానని చెప్పారు. విడిపోతే తెలంగాణ అంధకారమవుతుందని అనేక మంది అన్నారని, కానీ రైతులకు 24గంటల సరఫరాతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని తిట్టిన నోటితోనే కేసీఆర్‌ను ఆకాశానికెత్తారు. కానీ తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్‌లో ఈక్వేషన్స్‌ వేరేగా వినిపిస్తున్నాయి. లెక్కలు వేరేగా కనిపిస్తున్నాయ్‌.

తెలంగాణలో దొరల పాలన నడుస్తుందంటోంది ప్రతిపక్షం. అవన్నీ చౌకబారు ఆరోపణలు అంటోంది పాలకపక్షం. ఒకరకంగా టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ మధ్య ఖతర్నాక్‌ వార్‌ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను చావు దెబ్బతీస్తామని కాంగ్రెస్‌ చెబుతుంటే అడ్రస్‌ గల్లంతు చేసేస్తామంటూ అధికార పార్టీ కౌంటర్‌ ఇస్తోంది. ఇవన్నీ పరిణామాల మధ్య పవన్‌ ప్రజాయాత్ర వల్ల ఎవరికి లాభం ఉంటుంది.? ఎవరు నష్టాల బారిన పడతారు.? తనకు ఎంతో పట్టున్న ఏపీ నుంచి కాకుండా తెలంగాణ నుంచి పవన్‌ తన యాత్రకు శ్రీకారం చుట్టడం వెనుక ఎవరున్నారు? అజ్ఞాతవాసిని నడిస్తున్నదెవరు? అండగా వెనుకుండి ముందుకు నడుపుతున్నది ఎవరు?

టీఆర్‌ఎస్‌ వ్యతిరేకశక్తులను కూడగట్టే ప్రయత్నం జరుగుతుందని రేవంత్‌రెడ్డి ఎన్నోసార్లు ఎన్నో బహిరంగ ప్రకటనలు చేశారు. ఇప్పటికే కోదండరామ్‌ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రేవంత్‌రెడ్డి కదం తొక్కుతున్నారు. కాంగ్రెస్‌లోని ఇతర నేతలు తామేమీ తక్కువ కాదంటూ సవాల్‌ చేస్తున్నారు. అధికార పార్టీ పైకి గుంభనంగా కనిపిస్తున్నా ఆ పార్టీలోనే చాలా లుకలుకలు ఉన్నాయని కమలనాథులు కత్తి దూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌ యాత్ర ఎలాంటి రాజకీయ సమీకరణాలకు కారణమవుతుంది. తెలంగాణ రాజకీయాన్ని ఏ మలుపు తిప్పబోతోంది.? ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తున్న చర్చ ఇదే.

కోదండరామ్‌. తెలంగాణ ఉద్యమంలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉన్నారు. తర్వాత కేసీఆర్‌కు దూరమయ్యారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర అని ఎత్తుకున్నారు. తెలంగాణ అంతటా చుట్టిరావాలని నిశ్చయించుకున్నారు. అనుమతి కోసం అధికారపక్షం కాళ్లావేళ్లా పడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడమే కాదు ఏకంగా కోదండను అరెస్టు చేసి నిర్బంధించింది. ఇక్కడో మాట చెప్పుకోవాలి. అయ్యా అనుమతి ఇవ్వండి వేడుకున్న కోదండరామ్‌ను పట్టించుకోని ప్రభుత్వం పవన్‌కల్యాణ్‌ ఒక్క మాట అడిగారో లేదో వెంటనే అనుమతి ఇచ్చేసిందని సర్కార్‌పై కదం తొక్కుతున్నాయి ప్రతిపక్షాలు. పవన్‌కల్యాణ్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ వెనుకుండి నడిపిస్తుందని దుమ్మెత్తిపోస్తోంది. విపక్షాలకు చెక్‌ పెట్టేందుకే ఈ డ్రామా అంటూ మండిపడుతోంది.

ఏమైనా జనసేనాని జనయాత్ర తెలంగాణలో సమీకరణాల మార్పునకు సంకేతమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనుమతి ఇవ్వడం ఇవ్వకపోడం విషయాన్ని పక్కనపెడితే పవన్‌ ప్రజాయాత్రపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పవన్‌కల్యాణ్‌కు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదంటున్నాయి. ఆ మాటకొస్తే... అసలు పవన్‌కు తెలంగాణలో స్థానమే లేదంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్‌ యాత్ర ఏ టర్న్‌ తీసుకుంటుంది.? వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories