కనబడుట లేదు..

x
Highlights

ఒకప్పుడు జిల్లాలో ఆయన ఎదురు లేని నాయకుడు. ఒంగోలు నుంచి వరసగా నాలుగు సార్లు గెలిచి ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. జిల్లా రాజకీయాలను ఒక ఊపు...

ఒకప్పుడు జిల్లాలో ఆయన ఎదురు లేని నాయకుడు. ఒంగోలు నుంచి వరసగా నాలుగు సార్లు గెలిచి ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. జిల్లా రాజకీయాలను ఒక ఊపు ఊపారు. కానీ గత కొంత కాలంగా ఆయన అసలు రాజకీయాల్లోనే కనిపించడం లేదు.. అడపా దడపా పార్టీ సమావేశాల్లో కనపడటం తప్ప ప్రత్యక్ష కార్యాచరణకు దూరంగా ఉన్నారు.. ఎవరా నేత? ఎందుకు?

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి 1999కి ముందు కాంగ్రెస్ లో ఓ సాధారణ కార్యకర్తగా, యూత్ కాంగ్రెస్ లీడర్ గా ఉన్న బాలినేని 1999నుంచి 2012 వరకూ వరసగా ఒంగోలు నుండే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో ఓ సారి మంత్రి కూడా అయ్యారు. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం బాలినేని ఎదుగుదలకు బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. వైఎస్ కి స్వయానా తోడల్లుడైన వైవి సుబ్బారెడ్డి బావ అయిన బాలినేని1999,2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు. వైఎస్ హయాంలో గనుల శాఖా మంత్రిగా కూడా నియమితులయ్యారు.

వైఎస్ హటాన్మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో బాలినేని తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల తర్వాత బాలినేని దాదాపుగా ఒంగోలు ప్రజలకు దూరమైపోయారు. ఒంగోలు అభివృద్ధికి చేయాల్సినంత కృషి చేయలేదనే ఆరోపణలు బాలినేనిపై ఉన్నాయి. ఇటీవల కాలంలో వైసీపీ చేస్తున్న హోదా పోరులోనూ ఆయన అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. ఒంగోలుకు బాలినేని చుట్టపు చూపుగా వస్తున్నారని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపారనే ఆరోపణలు కూడా బాలినేనిపై ఉన్నాయి. కందుకూరు, అద్దంకి, గిద్దలూరు, యర్రగొండ పాలెం నియోజక వర్గాల ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడం వెనక బాలినేని హస్తం ఉందనేది ఆయనపై స్థానికంగా వినిపిస్తున్న విమర్శ. పైగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు సైతం బాలినేని వెళ్లమంటేనే వెళ్లామని చెప్పడం కొసమెరుపు.

ఈ పరిణామాలను చూసిన జగన్ బాలినేనిని పిలిపించుకుని మాట్లాడినట్లు సంయమనంతో ఉండాలని కోరి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్లు సమాచారం. బాలినేని ఇలా అన్యమనస్కంగా ఉంటుండగా, ఆయన బావమరిది వై.వి. సుబ్బారెడ్డి మాత్రం ఒంగోలు ఎంపీగా దూసుకు పోయారు హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి ప్రజలముందుకొచ్చారు. తొలిసారి ఎంపీగా గెలిచినా నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని టాక్. ఎన్నికల ఏడాదిలో పోటీకి సమాయత్తమవ్వాల్సిన బాలినేని ఒంగోలు నుంచి మళ్లీ పోటీకి విముఖంగా ఉన్నారన్న వార్తలొస్తున్నాయి. టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనార్ధన్ తో పోటీ పడేందుకు వెనకంజ వేస్తున్నారని వేరే నియోజక వర్గం వైపు చూస్తున్నారని, అయితే జగన్ సీటు మార్పిడికి నిరాకరించారనీ స్థానిక నేతలు చెబుతున్న మాట. ఏదేమైనా ఒకప్పుడు ఒంగోలు రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న బాలినేని ఇపుడు పార్టీలో క్రియాశీలకంగా లేకపోవడం పట్ల పార్టీ కార్యకర్తలే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు రెడీ అవుతున్న జగన్ ఒంగోలుపై దృష్టిపెట్టకపోతే వైసీపీకే నష్టమనేది రాజకీయ విశ్లేషకుల భావన.

Show Full Article
Print Article
Next Story
More Stories