సైలెంట్‌గా లొంగిపోయిన జంపన్న వెనక ఏం జరిగింది?

సైలెంట్‌గా లొంగిపోయిన జంపన్న వెనక ఏం జరిగింది?
x
Highlights

ప్రత్యేక పరిణామాలేవీ లేకుండా నక్సలైట్‌ జంపన్న లొంగిపోయాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు లొంగిపోయాడా అని అంతా ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. ఆ ఆశ్చర్యానికి సమాధానం...

ప్రత్యేక పరిణామాలేవీ లేకుండా నక్సలైట్‌ జంపన్న లొంగిపోయాడు. ఇంత హఠాత్తుగా ఎందుకు లొంగిపోయాడా అని అంతా ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. ఆ ఆశ్చర్యానికి సమాధానం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఒక ఎజెండాతోనే జంపన్న జన జీవన స్రవంతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ జంపన్న ఎజెండా ఏంటీ?

మామూలుగా పార్టీ మారితే ఏవో తాయిలాలుంటాయి. టికెట్‌, ఆశ చూపి, పదవి ఎర వేసి ప్రతిపక్ష సభ్యులను ఆకర్షించడం ఆనవాయితీ. దీన్నే ఆపరేషన్‌ ఆకర్ష్‌ అంటారు. మరి ఇదే ఆపరేషన్‌ ఆకర్ష్‌ను అధికార పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులో, బాగా పేరున్న నాయకులపైనో ప్రయోగిస్తుంది. తాజా రాజకీయంలో కొత్త ఒరవడి మొదలైంది. మావోయిస్టు పార్టీ నేతలను ఆకర్షించడానికి టికెట్‌ ఆశ చూపే నయా ట్రెండ్‌‌ని టీఆర్‌ఎస్‌ పార్టీ స్టార్ట్‌ చేసిందంటున్నారు.

మొన్నామధ్య మావోయిస్టు పార్టీలో కీలక నేత జంపన్న అలియాస్‌ జీనుగు నర్సింహారెడ్డి లొంగి పోవడం వెనుక అధికార పార్టీ హస్తముందనే వాదన వినవస్తోంది. 2014 ఎన్నికల్లోనూ మాజీ నక్సలైట్లు బోడిగ శోభ, వేముల వీరేశం వంటి వారు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో మాజీలకు తెలంగాణాలో మంచి రోజులు వచ్చినట్లున్నాయనే వాదన వినవచ్చింది. పైగా ఈ మధ్య వరస ఎన్‌కౌంటర్లతో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై వ్యతిరేకత పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్‌ గ్రాండ్‌ స్కెచ్‌ వేసినట్లు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు జంపన్నను జన జీవన స్రవంతిలోకి తీసుకొని రావడానికి గత కొంత కాలంగా తెర వెనుక ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కరీంనగర్‌ ఎమ్మెల్సీ నారదాసు లక్ష‌్మణరావు మధ్యవర్తిత్వం జరిపి జంపన్న దంపతులను జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చినట్లు టీఆర్‌ఎస్‌ నేతలే అంటున్నారు. జంపన్నకి 2019 ఎన్నికల్లో టికెట్‌ ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్‌ హామీ లభించన తరువాతే జంపన్న మావోయిస్ట్‌ పార్టీ నుంచి జన జీవన స్రవంతిలోకి జంప్‌ అయినట్లు అధికార పార్టీలోనే కామెంట్లు వినవస్తున్నాయి.

లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు జంపన్నకి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారన్నదానిపైనా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం పాలకుర్తిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకి ఈసారి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని పార్టీ అంతర్గత సర్వేలు చెబుతున్నట్లు తెలుస్తోంది. పాలకుర్తిలో ఈసారి కాంగ్రెస్‌ నుంచి జంగా రాఘవరెడ్డి బరిలో దిగనున్నారని, ఆయన్ను ఎదుర్కొనడానికి గట్టి అభ్యర్థి ఉండాలని పార్టీ అధిష్టానం వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. జంపన్నకి ముందుగా గులాబీ తీర్థం ఇచ్చి, తరువాత పాలకుర్తి నియోజక వర్గ ఇంఛార్జీగా నియమించి ఆ పైన ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలనే రాజకీయ పథక రచన చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎర్రబెల్లికి జనగాం టికెట్‌ ఇచ్చి బుజ్జగిస్తారని అంటున్నారు.

తెలంగాణా సర్కార్‌ను ఓడించాలని మావోయిస్టు పార్టీ, ఆ పార్టీ సానుభూతి పరులు పిలుపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మావోయిస్టును.. లొంగిపోయేలా చేసి, మాజీ నక్సలైట్‌గా మార్చి.. ఆ తరువాత పార్టీలోకి తీసుకొని, పదవి కట్టబెట్టి.. ఎన్నికల రణరంగంలో గెలవాలన్నది గులాబీ బాస్‌ వ్యూహమంటున్నారు. అందుకే.. జంపన్న.. జన జీవన స్రవంతిలోకి జంప్‌ అయ్యాడంటున్నారు. జంపింగ్‌ జపాంగ్‌ల్లో ఇదో కొత్త తరహా జంపింగ్‌ జపాంగ్‌. జంపన్నను ఆదర్శంగా తీసుకొని మరింత మంది మావోయిస్టు నేతలు జన జీవన స్రవంతిలోకి వచ్చే అవకాశముందని, ఆ రకంగా వారి ప్రభావాన్ని వచ్చే ఎన్నికల్లో తగ్గించాలన్నది సీఎం కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories