సినిమా పోయింది... సీన్‌ తారుమారైంది

సినిమా పోయింది... సీన్‌ తారుమారైంది
x
Highlights

పవన్‌కళ్యాణ్. ప్రశ్నించే గొంతుక.. ఎవరినైనా నిగ్గదీసి అడిగే ధైర్యం. ఆయన గురించి అభిమానుల అభిప్రాయమిది. జనసేన పెట్టినప్పుడు, పార్టీ పుట్టినప్పుడు పవన్...

పవన్‌కళ్యాణ్. ప్రశ్నించే గొంతుక.. ఎవరినైనా నిగ్గదీసి అడిగే ధైర్యం. ఆయన గురించి అభిమానుల అభిప్రాయమిది. జనసేన పెట్టినప్పుడు, పార్టీ పుట్టినప్పుడు పవన్ ఆవేశం చూసి అభిమానులు, ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ గురించి ఆలోచించే నాయకుడు.. ప్రశ్నించే నేత వచ్చాడని ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ ప్రశ్నించాల్సిన గొంతుక ఎందుకు మూగబోతోంది? సక్సెస్‌ అంచనాలను అందుకోలేక చతికిలపడ్డ అజ్ఞాతవాసితో పవన్‌కల్యాణ్‌లో పొలిటికల్‌ ఫైర్‌ తగ్గించిందా? పట్టున్న జిల్లాల్లో సభలు పెడుతూ చప్పట్లు కొట్టించుకుంటే... సమస్యలపై అప్పుడప్పుడూ పోరాడుతుంటే రాజకీయంగా రాణిస్తారా? అసలు అభిమానుల లెక్కలేంటి? పొలిటికల్ సర్కిల్స్‌లో ఇక్వేషన్లేంటి?

అనుకోకుండా ప్రజల ముందుకువస్తాడు. సమస్యలపై ఆవేశంగా మాట్లాడుతాడు. ప్రజల పక్షాన పదునైన ప్రశ్నలు సంధిస్తాడు. అంతటితో ఆ షో గ్రాండ్‌ సక్సెస్‌. మళ్లీ ఎప్పుడు వస్తాడో.. ఏ వేదికపై నుంచి స్పందిస్తాడో.. ఓ లెక్కాపత్రం ణాళిక ఉండదు. ఉన్నదున్నట్టే సైలెంట్ అయిపోతారు. పార్టీ కార్యకలపాలకూ దూరంగా ఉంటారు. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి బ్లాక్‌బస్టర్‌ మూవీగా ఉంటుందనీ, బాక్సాఫీస్‌ బద్ధలు కొడుతుందని వేసుకున్న అంచనాలు చతికిలపడటం... పవన్‌ ఆశలపై నీళ్లు చల్లాయా?

క్లియర్‌ కట్‌గా చెప్పుకోవాలంటే... కొంతకాలంగా పవన్‌కల్యాణ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. చంద్రబాబుకి ఇబ్బంది కలిగినప్పుడు... బయటకు వస్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్న జనసేనానికి అజ్ఞాతవాసి మూవీ ఆశలపై నీళ్లుచల్లిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసితో జనాల్లోకి వెళ్లాలని, ప్రత్యర్థులకు చెక్‌ పెట్టాలని భావించినా అది అంతగా సక్సెస్‌ కాలేదు. అటు సినిమా సూపర్ హిట్ అయితే...పవన్‌కి తిరుగుండదనుకున్న అభిమానులూ నీరుగారిపోయారు.

అజ్ఞాతవాసితో పొలిటికల్‌ తెరకు దూరం దూరంగా ఉంటున్న జనసేనాని మళ్లీ డీప్‌మూడ్‌లోకి వెళ్లిపోయారు. రాజకీయంగా తనకు ఊతమిచ్చి... ఉత్సాహం ఇస్తుందనుకున్న మూవీ కోలుకోలేని దెబ్బతీయడంతో రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. దీనికి తోడు... సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం. అభిమానుల కౌంటర్‌... ప్రత్యర్థుల ఎన్‌కౌంటర్‌. తననే టార్గెట్‌ చేస్తూ సోషల్్ మీడియాలో జరుగుతున్న వార్‌‌తో పవన్‌ ఒకరకమైన నైరాశ్యంతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

రాజకీయాలపై మౌనంగా ఉంటున్న పవన్‌కల్యాణ్‌... అజ్ఞాతవాసి రిలీజ్‌కు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మీడియాలో దాదాపు అదే చివరిగా కనిపించిందేమో. ఆ సందర్భంలో పవన్‌ నోట ఓ మాట వచ్చింది. ఇక నుంచి తాను పూర్తి సమయం రాజకీయాలకే కేటయిస్తానని. అంతవరకు స్తబ్ధుగా ఉన్న జనసైన్యంలో పవన్‌ నోట వెంట వచ్చిన మాట కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎటూ రాబోయేది త్రివిక్రమ్‌ మూవీ కాబట్టి... అజ్ఞాతవాసి ఎటూ కొండలు పిండిచేస్తుందన్న భావనతో ఉన్న క్యాడర్‌... ఒక్కసారిగా నిరాశకు గురైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ అడుగులు ఎటువైపు?

పవన్ నిశ్శబ్ధం ఒకవైపు కొనసాగుతుంటే... మరోవైపు ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. కొన్ని రోజులుగా పవన్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరుగుతుంది. అది కాస్త దాడుల వరకు వెళ్లింది. కత్తి మహేష్ టార్గెట్‌గా కొంత మంది కోడిగుడ్లతో దాడి చేశారు. అది పవన్ అభిమానుల పనే అంటున్నారు కత్తి మహేష్. ఈ మొత్తం పరిణామాలపై పవన్ సైలెంట్‌గా ఉండటం... అభిమానులు అత్యుత్సాహం జనసేన పార్టీకి నష్టం కలిగిస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో మోడీని, బాబును ప్రమోట్ చేసిన పవన్‌కల్యాణ్.. వచ్చే ఎన్నికలకు కూడా సింగిల్‌గా స్కెచ్ వేస్తున్నారని చెబుతుంది జనసైన్యం. కిందటి నెలలో విశాఖలో డ్రెడ్జింగ్‌ కంపెనీ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన పవన్‌.. తర్వాత మానిన గాయాలను తవ్వి తీశాడు. ప్రజారాజ్యాన్ని భ్రష్టు పట్టించిందెవరో తనకు తెలుసంటూ... ఎవరినీ వదలనంటూ మంగమ్మ శపథాలు చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలసి అలా షో చేసిన పవన్‌ మళ్లీ కనిపించలేదు.

పవన్‌కల్యాణ్‌ ఏమాశించి అలా మాట్లాడారో తెలియదు కానీ... మానిన గాయాలను మళ్లీ తవ్వి తీశాడు. డిసెంబరు జనంలోకి వెళ్లిన జనసేనాధిపతి ప్రజారాజ్యం భ్రష్టు పట్టడానికి కారణాలను వివరించారు. తానప్పడు మాట్లాడలేని స్థితిలో పరిస్థితులు ఉండటం వల్లే ఎదురించలేకపోయానని చెప్పుకొచ్చారు. పదేళ్లయినా ఆ గాయం తగ్గలేదని, ఎవరినీ వదిలపెట్టనని ఆవేశంగా శపథం చేశాడు.

ప్రజారాజ్యం, పరిటాల రవితో తనకు జరిగిన అవమానంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం పవన్‌కల్యాణ్‌ను వీక్‌నెస్‌ను బయటపెట్టిందంటారు విశ్లేషకులు. అనవసర విషయాలు తిరదోడటం ఇప్పుడు అవసరం లేదన్న అభిప్రాయాలు అప్పట్లో ఆఫ్‌ ద రికార్డ్‌గా అభిమానుల నుంచే వినిపించాయ్. అజ్ఞాతవాసి రిలీజ్‌కు ముందు... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక, కేసీఆర్‌ సీఎం అయ్యాక పవన్‌ సమావేశం అదే మొదటిది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇద్దరి మద్య చర్చకు వచ్చాయి. కేసీఆర్ దగ్గర రాజకీయ సలహాలు తీసుకోవడానికే పవన్‌ వెళ్లారన్న అభిప్రాయాలూ వినిపించాయ్ అప్పట్లో.

అదే సమయంలో రాష్ట్ర విభజన తనను బాధించిందనీ, 11 రోజులు అన్నం తినడం మానేశానని అప్పట్లో చెప్పుకొని.. వాటి అన్నిటికీ కారణమే కేసీఆర్‌గా భావించిన పవన్‌కల్యాణ్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవడం ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిపోయి ఉండొచ్చు... కానీ పొలిటిక్స్‌లో మాత్రం ఈ భేటీ హాట్‌ హాట్‌గా మారింది. అలా మీడియాలో కనిపించడమే ఈ మధ్య కాలంలో చివరిది. ఈలోపు అజ్ఞాతవాసి రిలీజ్‌ అవడం.. ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో పవన్‌లో నిరాశ ఆవహించి ఉంటుందని, జనాల్లోకి రాకపోవడానికి అదే కారణమేమోనన్న భావన వ్యక్తమవుతోంది.

కొన్నాళ్ల నుంచీ ఒకే రకమైన రాజకీయాలకు అలవాటు పడ్డ ఆంధ్ర ప్రజలు.. ఫైర్‌లో ఉన్న పవన్‌ కల్యాణ్‌లాంటి లీడర్‌ను స్వాగతించారు ప్రజలు. కటౌట్‌ ఉన్నోడికి కంటెంట్‌‌తో పని లేదంటూ భారీ డైలాగ్‌లు చెప్పుకునే పవన్‌కల్యాణ్‌ రీల్‌ లైఫ్‌లో హీరో అనిపించుకున్నా... రియల్‌ లైఫ్‌లో ఆ మాటను నిలబెట్టు కోలేకపోయారన్న విమర్శలున్నాయ్‌.

ఎవరెన్ని చెప్పినా.... రాజకీయమంటే అంత ఈజీ వ్యవహారమేమీ కాదు. ఫీల్డ్‌లోకి వస్తేనే అసలు పిక్చర్‌ తెలిసేది. సినిమాల్లో పంచ్‌లు వేస్తూ... దంచే డైలాగులతో అదరగొట్టినోళ్లు... జనాల మధ్య రాణించలేకపోయారు. అది చాలా సందర్భాల్లో చాలా చోట్ల నిరూపితమైనదే. అసలు సిసలు రాజకీయ నాయకుడు కావాలనున్నప్పుడు చేయాల్సింది ఇది కాదు. ఆన్‌లైన్‌ రాజకీయాలు కంప్యూటర్‌ ముందు కూర్చొని చేస్తే సమ్మగానే అనిపిస్తుంది కానీ... క్షేత్రస్థాయిలో అదే పనిగా ఉంటేనే కానీ తెలియదు చెమట చుక్క విలువ అంటున్నారు ప్రజలు. అయితే సమాజానికి ఏదో చేయాలన్న తపనతో ఉన్న పవన్‌కల్యాణ్‌... రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని చెబుతున్నారు అభిమానులు.

కానీ పవన్‌కల్యాణ్‌ అభిమానుల కోరికను తీరుస్తున్నాడా? ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారా? నిజం మాట్లాడుకోవాలంటే లేదనే చెప్పాలి. మధ్య మధ్యలో తీరిక చేసుకొని నాలుగు ట్వీట్లు కొట్టిన్నంత మాత్రాన రాజకీయాల్లో కచ్చితంగా రాణించలేరన్న వాస్తవం ఓ రాజకీయ నాయకుడిగా పవన్‌కు తెలియంది కాదు. నిరంతరం జనాల్లో ఉంటూ... జనాల సమస్యలను తన భుజాలపై మోసే నాయకులనే ప్రజలు చీదరించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది ఆన్‌లైన్‌ రాజకీయాలు చేస్తే కొమురం పులిలా గర్జించడం ఇంపాజిబుల్‌ అన్న విషయం ఈ సర్దార్‌కు తెలియదని కాదు.. అదంతా ఓ స్ట్రాటిజిక్‌ సైలెంట్‌ అని చెబుతున్నారు పవన్‌కల్యాణ్‌ అభిమానులు.

రాజధాని రైతుల గోడును అప్పట్లో సీరియస్‌గా తీసుకున్న పవర్‌స్టార్‌... వారి గోసను అంతగా వినిపించుకోలేదనీ, ప్రభుత్వాన్ని ఆ దిశగా కదలించలేకపోయారన్న ఆరోపణలు ఉన్నాయ్‌. దేశంలో బీజేపీ... రాష్ట్రంలో తెలుగుదేశం వస్తే.. అటు ఇండియా, ఇటు ఏపీ వెలిగిపోతుందంటూ బీజేపీ- టీడీపీ కూటమికి పరోక్ష మద్ధతు తెలిపిన పవన్‌ మాటలకు ఏపీ ప్రజలు కదలివచ్చారు. తెలుగుదేశానికి జై కొట్టారు. మీరు చెబితేనే టీడీపీకి ఓట్లేశాం... ఇప్పుడు మీరే పట్టించుకోకుంటే ఎట్లా అంటూ రాజధాని రైతులు గగ్గోలు పెట్టేసరికి.... నవ్యాంధ్రకు పయనమైన పవన్‌... అక్కడి రైతులను ఒప్పించి... మెప్పించలేకపోయారన్నది మరో వాదన.

ఉద్ధానం మూత్రపిండాల సమస్యనో... పోలవరం నిర్మాణం తీరునో... అక్వా పరిశ్రమపైనో.... ఇలా ట్వీటితే చాలు, అలా పనులు జరిగిపోతున్నాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టేనని చెబుతున్నారు విశ్లేషకులు. తానేదో సమస్యను ఎత్తుకోగానే... పాలకులు దిగివచ్చి... సమస్యను పటాపంచలు చేస్తున్నారని అనుకుంటే ఏం లాభం లేదని అంటున్నారు. దానికి అసలు రాజకీయ కోణం వేరేగా ఉంటుందంటున్నారు. ప్రత్యేక హోదాకు సభలు, పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలపై అలుపెరగని పోరాటం చేస్తానన్నాడు పవన్. కానీ దాన్ని కూడా అటెక్కించాడన్న అభిప్రాయం ఉంది.

నాలుగేళ్లు అనేది వయసు కింద చెప్పుకుంటే చాలా తక్కువ. కానీ రాజకీయాల్లో నాలుగేళ్లు నలగడమంటే సీనియర్‌ కిందే లెక్క. మరి జనసేన పరిస్థితి ఏంటి. నాలుగేళ్ల కింద పురుడుపోసుకున్న జనసేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీకి సిద్ధమని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? ఆ దిశ‌గా పార్టీని నిర్మించే ప‌నిలో ఉన్నారా..? క్యాడ‌ర్‌ను నిర్మించుకునే ప్రయ‌త్నం చేస్తున్నారా? ద‌శ‌ల‌వారీగా నాయ‌కుల్ని ఎంపిక చేసుకుంటున్నారా..? ఇలాంటివి ఎన్నో జవాబు లేని ప్రశ్నలు అభిమానుల్ని వెంటాడుతున్నాయ్.

సంస్థాగ‌తంగా జ‌న‌సేన పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ముంద‌డుగులూ ప‌డ‌టం లేద‌నేది వాస్తవం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేస్తాం అని ప్రక‌టించారే త‌ప్ప ద్వితీయ శ్రేణి నాయ‌కత్వం గురించి గానీ, పార్టీ క్యాడ‌ర్ నిర్మాణం విష‌యంలో గానీ అనూహ్య పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి... ఈ మ‌ధ్య ప‌వ‌న్ దూకుడు కూడా కాస్త త‌గ్గింది. కొన్ని ప్రెస్ నోట్లు విడుద‌ల‌కే ప‌రిమితం అవుతున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీపై విమ‌ర్శలు చేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థమైన‌ట్టే ఉంది. అందుకే, ఒంట‌రి పోరు అనే టాపిక్ జోలికి కూడా వెళ్లడం లేదు. కేవ‌లం బీజేపీపై విమర్శలతోనే టైంపాస్ చేస్తూ వ‌స్తున్నారన్న ఆరోపణలున్నాయ్‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా తెలుగుదేశం చాటునే జ‌న‌సేన ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నది కొందరి అభిప్రాయం. అలా ఏం కాదు మా సర్దారే వచ్చే ఎన్నికల్లో గబ్బర్‌సింగ్‌లా మారుతారంటారు అభిమానులు.
ఎవరి మాటలు ఎలా ఉన్నా... వాస్తవం ఎప్పటికీ వాస్తవమే. ఎందుకంటే, ప‌వ‌న్ సోలోగా ఎన్నిక‌ల‌కు వెళ్తే తెలుగుదేశం పోరాటం వేరేలా ఉంటుంది. దాన్ని త‌ట్టుకునేంత స్థాయి ప్రస్తుతానికి జ‌న‌సేన‌కు లేద‌ు. సోలోగా ముందుకెళ్ళాల‌ని అనుకుంటే ఎవరి సపోర్ట్‌ ఉంటుందనే దానిపై ఎక్సర్‌సైజ్‌ చేయాలి. ప్రస్తుతం అంతో ఇంతో ప్రాధాన్యం ఉంటోందంటే కార‌ణం టీడీపీ చాటు పార్టీగానే జ‌న‌సేన‌ను కొన్ని వర్గాలు చూస్తున్నాయ‌ంటారు విశ్లేషకులు.

ప‌వ‌న్‌కు కావాల్సినంత క్రేజ్ ఉందంటారు అభిమానులు. మరి ఎందుకీ మీన‌మేషాల లెక్కింపు. దానికీ ఓ లెక్కుందట. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన‌ప్పుడు కూడా ఇలానే అంచ‌నా వేశారు. మెగాస్టార్‌ స‌భ‌ల‌కు అశేష జ‌న‌వాహిని త‌ర‌లి వ‌స్తుంటే ఆంధ్రా రాజ‌కీయాల్లో మ‌రో అద్భుతం ఆవిష్కృతం అవుతుంద‌ని అందరూ అంచ‌నా వేశారు. కానీ, చివ‌రికి ఏమైందో అందరికీ తెలుసు. వీటన్నింటని బేరీజు వేసుకుంటున్న పవన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రాటజీతో ఎన్నికలకు రెడీ అవుతున్నారన్నది ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల మనోగతం.

అయితే పవర్‌స్టార్‌కు సమాజం పట్ల అంకిత భావం ఎక్కవ అంటున్నారు అభిమానులు. అందుకే ఆయన సమాజానికి ఏదో చేయాలన్న కసితో ఉంటారన్నది వారి మాట. వట్టి మాటలు కట్టి పెట్టోయ్‌... గట్టి మేలు తలపెట్టవోయ్‌ అన్న గురజాడ మాటలను బాగా వంటపట్టించుకున్న ఈ కొమురం పులి... నిశ్శబ్ద సంచలనమని ఫ్యాన్స్‌ చెబుతుంటారు.

ఏమైనా పవన్‌కల్యాణ్‌ నిశ్శబ్ధం ఓ వ్యూహాత్మకమంటున్నారు అభిమానులు. మూడేళ్ల పండగను ట్విట్టర్ల రూపంలో కాకుండా... అభిమానులు, ప్రజలు, జనసేన నాయకుల మధ్య జరుపుకుంటే ఇంకా బావుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌. ఇలా చేయకపోవడం కూడా స్ట్రాటజీయే అన్న మాటలూ వినిపిస్తున్నాయ్‌.

అవినీతి నిర్మూలించడం, సామాన్యుడి అభివృద్ధికి పాటుపడటం, నిజాయితీ అనే అంశాలే రాజకీయాల వైపు నడిపించాయంటారు పవన్‌. నిజాయితీ పరుడన్న పేరున్న సర్దార్ గబ్బర్‌సింగ్‌.... తనకు అవినీతిని పారద్రోలాలనే సంకల్పముందని చెబుతాడు. ఒక్కసారి పవన్‌ అందుకు నడుం కడితే... ఆయన వెనక నడవడానికి తాము సిద్ధమేనంటున్నారు అభిమానులు. మరీ పవనే కాస్త దూకుడు తగ్గించి... సైలెంట్‌గా ఉంటున్నాడని చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మరి పవన్‌కల్యాణ్‌ ఏం స్టెప్‌ తీసుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories