వరంగల్‌లో కిలాడీ లేడీ.. ఐదుగురిని బురిడీ కొట్టించిన చెన్నై చిన్నది

వరంగల్‌లో కిలాడీ లేడీ.. ఐదుగురిని బురిడీ కొట్టించిన చెన్నై చిన్నది
x
Highlights

ఇప్పుడు మీకు చెప్పబోయేది.. చూపించబోయేది సినిమా స్టోరీలాగే ఉంటుంది. కానీ సినిమా కాదు. ఇది రియల్‌గా జరిగిన రీల్ స్టోరీ. సినిమాల్లో మాత్రమే కనిపించే కథ.....

ఇప్పుడు మీకు చెప్పబోయేది.. చూపించబోయేది సినిమా స్టోరీలాగే ఉంటుంది. కానీ సినిమా కాదు. ఇది రియల్‌గా జరిగిన రీల్ స్టోరీ. సినిమాల్లో మాత్రమే కనిపించే కథ.. మన వరంగల్‌లో జరిగింది. ఒక్క యువతి ఐదుగురిని బురిడీ కొట్టించింది. 15 లక్షలు వారికి టోకరా వేసి ఉడాయించేసింది. చెన్నై బ్యూటీ ఇచ్చిన షాక్‌ నుంచి ఇంకా బాధితులు తేరుకోలేకపోతున్నారు.

ముని ప్రియదర్శిని అయ్యర్.. అలియాస్ నేహాశ్రీ. 2 నెలల క్రితం వరంగల్‌కు వచ్చింది. పోచమ్మ గ్రౌండ్‌ దగ్గర్లోని ఓ లేడీస్ హాస్టల్‌లో దిగింది. ఎంజీఎంలో అంకాలజిస్టుగా పనిచేస్తున్నానని మాయమాటలు చెప్పి.. హాస్టల్‌లోని ఓ యువతితో ఫ్రెండ్‌షిప్ చేసుకుంది. అంతటితో ఆగలేదు.. తాను చెన్నైలో ఉంటానని.. శశికళ బంధువునని నమ్మించింది. తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని.. వైట్‌గా మార్చేందుకే వరంగల్ వచ్చానని నమ్మించింది.

ఈ కిలాడీ లేడీ మాటలు నమ్మిన ఆ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. స్టోరీ.. ఇక్కడి నుంచే కొత్త టర్న్ తీసుకుంది. అతను మరో ఇద్దరిని పరిచయం చేశాడు. ఈ నలుగురు కలిసి.. తమకు తెలిసిన ఓ డ్యాన్స్ మాస్టర్‌ను చెన్నై బ్యూటీకి పరిచయం చేశారు. అంతే.. అందంగా ఉన్నాడని.. అల్లుకుపోయింది. అతగాడికి అప్పటికే పెళ్లై.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇది పక్కనబెడితే.. డ్యాన్స్ మాస్టర్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత.. అతడి దగ్గర్నుంచి 40 వేలు అప్పుగా తీసుకుంది. కొన్నాళ్లకు 30 వేలు తిరిగిచ్చింది. దీంతో ఆ కిలాడీ లేడీని పూర్తిగా నమ్మేశారు. బ్లాక్ మనీ త్వరలోనే వస్తుంది. నా దగ్గర చెక్కులు మాత్రమే ఉన్నాయ్. కొంత డబ్బు అవసరం ఉందని.. మళ్లీ డ్యాన్స్ మాస్టర్ క్రెడిట్ కార్డు నుంచి 80 వేలు లాగేసింది.

అక్కడ సీన్ కట్ చేస్తే.. తర్వాత ఫ్రేమ్ బెంగళూరులో ఓపెన్ అవుతుంది. బ్లాక్ మనీ తీసుకొద్దామని చెప్పి.. ఈ ఐదుగురిని బెంగళూరు తీసుకెళ్లింది. ఫ్లైట్ టికెట్లు కూడా వారితోనే బుక్ చేయించింది. అక్కడే ఓ స్టార్ హోటల్‌లో 4 రోజుల పాటు మకాం వేశారు. తర్వాత వీరికి సమీర్ అనే ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ను పరిచయం చేసింది. అతగాడు ఓ అట్ట బాక్సు తీసుకొచ్చి నేహాకు ఇచ్చాడు. అందులో 160 కోట్ల డబ్బు ఉందని వీళ్లందరినీ నమ్మించింది. హోటల్‌లో బిల్లు 80 వేలు వీరితోనే కట్టించింది. రిటర్న్ టికెట్స్ కూడా వీరితోనే తీయించింది.

తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో దిగారు. డబ్బు వచ్చిందన్న ఆనందంలో అంతా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా హోటల్ బిల్లు మళ్లీ వరంగల్ వాళ్లే కట్టారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్యాన్స్ మాస్టర్‌ను నేహా పెళ్లి చేసుకుంది. మీరు షాక్ అయినా.. షేక్ అయినా.. ఇదే నిజం. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాగానే.. ఓ హోటల్‌లో హానీమూన్ కూడా చేసుకున్నారు.

కాటన్ బాక్సులో డబ్బులున్నాయని పది రోజులు నమ్మించింది. డబ్బులు అడిగితే.. చెక్కులు రాసిచ్చింది. అవేమో బౌన్స్ అవుతున్నాయి. అప్పటికే.. ఈ ఐదుగురి దగ్గర భారీగా డబ్బులు లాగేసింది. డ్యాన్స్ మాస్టర్ దగ్గర పెళ్లి పేరుతో 2 లక్షలు లాగేసింది. ఇంకొకరి దగ్గర 2 లక్షలు, హాస్టల్‌లో పరిచయమైన యువతి దగ్గర్నుంచి 80 వేలు, ఇంకొ అబ్బాయి దగ్గర్నుంచి లక్ష.. ఇలా అందరి దగ్గర అందినకాడికి లాగేసింది.

15 రోజుల నుంచి.. ఈ ఐదుగురిని ఓ ఆటాడుకుంది ఈ చెన్నై బ్యూటీ. ఇక అనుమానం వచ్చి.. అంతా కలిసి నిలదీశారు. రేపు కాటన్ బాక్సు తెరిస్తే.. మన కష్టాలన్నీ తీరతాయని చెప్పింది. తెల్లారేసరికి మూట.. ముల్లే సర్దుకొని చెక్కేసింది. పోతే పోయింది.. డబ్బులున్న కాటన్ బాక్సు ఇక్కడే వదిలేసిందని.. అంతా హ్యాపీగా ఫీలయ్యారు. తెరచి చూసి షాకయ్యారు. అందులో అన్నీ తెల్లకాగితాలే ఉన్నాయి. అవి చూసి.. వీళ్లూ తెల్లబోయారు.

ఇక షాక్ నుంచి తేరుకోగానే నేహాశ్రీకి ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ అని రావటంతో.. వీరికి క్లారిటీ వచ్చింది తామంతా మోసపోయామని. వెంటనే పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఐతే.. ఈ కిలాడీ లేడి బాగోతాలు.. ఒక్క వరంగల్‌లోనే కాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా చాలా చోట్ల చాలా మందిని బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. బాధితులు చెప్పిన సమాచారం మేరకు.. పోలీసులు కిలాడీ లేడీని గుర్తించే పనిలో పడ్డారు.

డ్యాన్స్ స్కూల్ పేరుతో వరంగల్ మహీంద్రా షోరూంలో నాలుగు ఫోర్ వీలర్‌ వెహికిల్స్ ను బుక్ చేసింది. మొత్తం 75 లక్షల రూపాయలకు చెక్కులు షోరూం వారికి ఇచ్చింది. ఫోర్ వీలర్‌ బుక్ చేసి... షోరూం వారు తెప్పించారు. అయితే లేడీ కిలాడీ ఇచ్చిన చెక్కులు క్రెడిట్ కాకపోవడంతో డెలివరీ చేయలేదు. దాంతో వెహికిల్స్ షోరూమ్‌లోనే ఆగిపోయాయి. దాంతో లేడీ కిలాడీ వ్యవహారం బయటికొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories