ప్రత్యర్థులపై ఎదురుదాడికి సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ...సొంత దళాన్ని రంగంలోకి...

x
Highlights

సోషల్ మీడియాలో ఇక గులాబీ దళం ప్రవేశిస్తోంది. తమపై వస్తున్న విమర్శలకు దీటైన సమాధానం చెప్పేందుకు సొంత బలగాన్ని నియమించబోతుంది. నియోజకవర్గానికి 100 మంది...

సోషల్ మీడియాలో ఇక గులాబీ దళం ప్రవేశిస్తోంది. తమపై వస్తున్న విమర్శలకు దీటైన సమాధానం చెప్పేందుకు సొంత బలగాన్ని నియమించబోతుంది. నియోజకవర్గానికి 100 మంది చొప్పున సోషల్ మీడియా యాక్టివిస్టులను తయారు చేయబోతుంది. త్వరలోనే హైదరాబాద్‌లో వందలాది మందికి శిక్షణ ఇచ్చి రంగంలోకి దించబోతుంది టీఆర్ఎస్ పార్టీ. అయితే, ఈ దళం ఎందుకు..? ఎవరిపై దండయాత్ర చేస్తుంది..?

సోషల్ మీడియా.. ఇప్పుడు అందరినీ వణికిస్తోన్న నెట్‌వర్క్. నేతలపై ఎలాంటి ఆరోపణలొచ్చినా వారి పరువును బజారుకు ఈడుస్తోంది. అది నిజమో, కాదో తెలిసే లోగానే కావాల్సినంత డ్యామేజ్ జరిగిపోతుంది. దీంతో ప్రత్యర్థి పార్టీలపై ఎదరుదాడికి దిగేందుకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగా సొంత దళాన్ని రంగంలోకి దించబోతుంది.

తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలు, ప్రజా సంఘాలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌ అయ్యాయి. ప్రభుత్వంపైనా, నేతలపైనా నిత్యం వందలాది పోస్టులు పెడుతుండటం అధికార పక్షానికి ఇబ్బందిగా మారింది. దీంతో ముల్లును ముల్లుతోనే తీయాలని భావించిన టీఆర్‌ఎస్ పార్టీ తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పకడ్బంధీగా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఓ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్న గులాబీ పార్టీ కేటీఆర్ సన్నిహితుడు దిలీప్ నేతృత్వంలో శిక్షణ కార్యక్రమాలకు సిద్దమైంది.

ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున ఉత్సాహవంతులైన యువతను ఎంపిక చేయాలని ఆదేశాలిచ్చారు. ఎంపికైన వారిని హైదరాబాద్‌లో శిక్షణా తరగతులకు పంపాలని సూచించారు. అయితే, ఈ శిక్షణ పూర్తయితే...ట్విట్టర్, వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి మాద్యమాల్లో ప్రతిపక్షాలపై యుద్ధానికి గులాబీ దళం మూకుమ్మడిగా దాడి చేస్తుంది.

టీఆర్‌ఎస్ పథకాలు, నేతల పనితీరును ప్రచారం చేసేలా ఎన్నికల వరకూ ఈ యుద్ధం కొనసాగించాలని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. ప్రతిపక్షాలకు కూడా సోషల్ మీడియాలో చుక్కలు చూపించాలని చూస్తోంది. మరి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఈ దళాన్ని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories