టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు...స‌ర్వే రిపోర్టుతో కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావొచ్చని ప్లాన్

x
Highlights

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు.. పార్టీ అధినేత కేసీఆర్ మాదిరిగానే తమ...

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు.. పార్టీ అధినేత కేసీఆర్ మాదిరిగానే తమ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకుంటున్నారు. చివ‌రి నిమిషంలో టికెట్ నిరాక‌రిస్తే..తమ స‌ర్వే రిపోర్టుతో కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావొచ్చని ప్లాన్ వేస్తున్నారు. లేకుంటే విపక్షంలో టికెట్ దక్కించుకునేందుకు పనికివస్తుందని భావిస్తున్నారు.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ బాటలో నడుస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఆయన మాదిరిగానే సర్వేలు నిర్వహిస్తున్నారు. గులాబి బాస్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే ప‌లు ద‌ఫాలు సర్వేలు నిర్వహించిన కేసీఆర్ 50 శాతం మార్కులు రాని వారికి టికెట్లు కష్టమని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యేలకు హితోపదేశం చేశారు.

సీఎం సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు సర్వే ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ప్రజలకు తమ పై ఏలాంటి అభిప్రాయం ఉంది? టీఆర్ ఎస్ పట్ల ప్రజలకు గత ఎన్నికల నాటి అభిమానం ఉందా? ప్రభుత్వ పని తీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? నియోజకవర్గంలో ప్రతిపక్షాల బ‌లం ఎంత‌? విప‌క్షాల మ‌ధ్య పొత్తు కుదిరితే గెలుపు అవకాశాలు ఏలా ఉంటాయన్న అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వే ఏజేన్సీల ద్వారా సేకరిస్తున్నారు. సర్వే ఫలితాలు అనుకూలంగా వచ్చిన ఎమ్మెల్యేలు సంతోషంలో ఉంటే, రాని వారు తల పట్టుకుంటున్నారు.

కొన్ని జిల్లాల్లో స్వయంగా మంత్రులే స‌ర్వేలు చేయిస్తున్నారు. తమ పని తీరుతో పాటు ఎమ్మెల్యేల ప‌నితీరును తెలుసుకుంటున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట,నకిరెకల్ ,తుంగతుర్తిలలో సర్వే చేయించారు. ఈ మూడు నియోజక వర్గాల రిపోర్టులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వచ్చాయి. గతంలో సిఎం సర్వే చేయించినప్పుడు మంత్రి జగదీష్ రెడ్డికి తక్కువ మార్కులు వచ్చాయి. సొంత సర్వేలో మంచి మార్కులు వచ్చాయని జగదీష్ రెడ్డి సన్నిహితులతో చెప్పుకుంటున్నారు

నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా సర్వే చేయించుకున్నారు. సర్వే రిపోర్టు తనకు అనుకూలంగా ఉందని ఆర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ శివారు నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సర్వే చేయించాలనుకుంటున్నారు. కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సర్వే రిపోర్టుతో సీఎం కేసీఆర్ కలుస్తానని అంటున్నారు. ఇప్పుడు సర్వేలు చేయించుకుంటున్న ఎమ్మెల్యేలు గతంలో ముఖ్యమంత్రి సర్వే రిపోర్టులో తక్కువ మార్కులు వచ్చినవారే కావడం విశేషం.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు సొంత‌ స‌ర్వేలు చేయించుకోవ‌డానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. స‌ర్వేల్లో త‌మ‌కు త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌నే సాకుతో సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించే అవకాశం, త‌మ సీట్లను ఆశిస్తున్న సీనియ‌ర్లు స‌ర్వే స‌మాచారాన్ని తారు మారు చేసే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలు స‌ర్వేలు నిర్వహించుకుంటున్నారు. మంచి మార్కులు వచ్చిన వారు తమకు టికెట్ పక్కా అని మురిసిపోతున్నారు. ఏదైనా కార‌ణంతో టికెట్ నిరాక‌రిస్తే...త‌మ స‌ర్వే రిపోర్టు ద్వారా సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెంచి టికెట్ ద‌క్కించుకోవ‌చ్చని భావిస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే బలమైన ప్రతిపక్షంలో చేరి టికెట్ ద‌క్కించుకునేందుకు స‌ర్వే పనికొస్తుందని భావిస్తున్నారు. సొంత స‌ర్వేల‌తో ఎంత మంది టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ద‌క్కుతుందో లేదో తెలియ‌దు కానీ, స‌ర్వే ఏజెన్సీల దందా మాత్రం జోరుగా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories