ప్రత్యర్థులపై పైచేయి సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్...ఆ ఇద్దరిని తప్పించడంలో కీలకపాత్ర

x
Highlights

అప్పుడూ, ఇప్పుడూ ఆ ఇద్దరూ ఒకే జెండా నీడలో ఉన్నారు ఒకే సామాజిక వర్గమైనా ఎప్పడూ ఉప్పు నిప్పులాగే మెలిగారు. ప్రత్యర్థులుగా ఉన్నా అనుకోని పరిస్థితుల్లో...

అప్పుడూ, ఇప్పుడూ ఆ ఇద్దరూ ఒకే జెండా నీడలో ఉన్నారు ఒకే సామాజిక వర్గమైనా ఎప్పడూ ఉప్పు నిప్పులాగే మెలిగారు. ప్రత్యర్థులుగా ఉన్నా అనుకోని పరిస్థితుల్లో ఒకరి వెంట ఒకరు గులాబీ గూటికి చేరారు. అక్కడా వారి మధ్య ఆధిపత్యం పోరు తీవ్రమైంది. దీంతో తనకంటే సీనియర్ నేతగా ఉన్న ఆ ప్రత్యర్థిని కారు నుంచి కిందకి దింపేందుకు ఇంకోనేత వేసిన స్కెచ్ ఫలించింది. ఇంతకీ ఆ నేతలెవరు..? వారి మధ్య ఉన్న విభేదాలేంటి...?

ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన నేత ధర్మపురి శ్రీనివాస్. ప్రశ్నించే నేతగా పేరున్న మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ పార్టీ నుంచే వీరిద్దరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న డి.శ్రీనివాస్ విద్యార్థి నేత నుంచి సీఎం అభ్యర్థి దాకా ఎదిగారు. 1989లో ఆయన ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలు మంత్రిత్వశాఖలు నిర్వహించారు. రెండుసార్లు పీసీసీ చీఫ్‌గా పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కీలకపాత్రను పోషించారు డీఎస్.

ఇక వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనుచరుడిగా జిల్లా రాజకీయాల్లోకి వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్‌కీ, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన డీఎస్‌కూ మధ్య ఆధిపత్య పోరు అప్పటి నుంచే మొదలైంది. వై.ఎస్.హయాంలో బాజిరెడ్డి, డీఎస్‌ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. 2004లో డిఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆర్మూర్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోవర్ధన్‌ని కాదని మిత్రపక్షంగా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీకి ఆ స్థానం కేటాయించడంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. వై.ఎస్.జోక్యంతో బాజిరెడ్డిని బాన్సువాడకు షిఫ్ట్ చేశారు. దీంతో అప్పట్లో వారి వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన డీఎస్, బాజిరెడ్డి మధ్య మరోసారి విబేధాలకు ఆజ్యం పోసింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోటీకి డీఎస్ సిద్ధం కాగా, అదే సీటుపై బాజిరెడ్డి కూడా కన్నేశారు. వై.ఎస్. హఠాన్మరణంతో కాంగ్రెస్‌ పార్టీలో డీ.ఎస్.బలం మరింత పెరిగింది. దీంతో బాజిరెడ్డి గోవర్ధన్‌ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2014లో బాజిరెడ్డికి గాలం వేసిన టీఆర్ఎస్ డీఎస్‌పై పోటీకి నిలిపింది. అనూహ్యంగా బాజిరెడ్డి గోవర్ధన్ డీఎస్‌పై భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఎదిగారు బాజిరెడ్డి గోవర్ధన్.

2015 జులై 8న డీఎస్ కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి మొదలైన వీరి వివాదం ఇప్పుడు డీఎస్‌కు చెక్ పెట్టే వరకూ వెళ్లింది. రూరల్ అసెంబ్లీ స్థానం ఆశించిన ఉద్యమ నాయకుడు భూపతిరెడ్డి బాజిరెడ్డి రాకతో ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. అయినా భూపతిరెడ్డి, బాజిరెడ్డి మధ్య వర్గపోరు తీవ్ర మైంది. అంతలోనే పార్టీలోకి ఎంటరైన డీఎస్ ఆశీస్సులు ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి లభించడంతో బాజిరెడ్డి, భూపతిరెడ్డి మధ్య బహిరంగ యుద్ధమే మొదలైంది.

పార్టీలో అంతర్గతంగా తనకు ఎదురవుతున్న పరిణామాలతో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని టార్గెట్ చేసి మరీ పార్టీ నుంచి బయటకు పంపించారు గోవర్థన్. అంతటితో ఆగకుండా మరో ఆరు నెలల వ్యవధిలోనే చిరకాల ప్రత్యర్థి డీఎస్‌కు చెక్ పెట్టేశారు. ఇలా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను కారులో నుంచి దించేసి పైచేయి సాధించారు బాజిరెడ్డి గోవర్ధన్. మరి ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తాయా..? నష్టం కలిగిస్తాయా అన్నది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories