గుహలో చిక్కుకున్న పిల్లలు క్షణక్షణం ఉత్కంఠ...గుహ నుంచి బయట పడటానికి 4 నెలలు?

గుహలో చిక్కుకున్న పిల్లలు క్షణక్షణం ఉత్కంఠ...గుహ నుంచి బయట పడటానికి 4 నెలలు?
x
Highlights

థాయిలాండ్ గుహలో చిక్కుకున్న బాలురు, వారి కోచ్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే పనులు చురుకుగా సాగుతున్నాయి. అయితే వాళ్లను గుహ నుంచి బయటకు తీసుకురావడం...

థాయిలాండ్ గుహలో చిక్కుకున్న బాలురు, వారి కోచ్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే పనులు చురుకుగా సాగుతున్నాయి. అయితే వాళ్లను గుహ నుంచి బయటకు తీసుకురావడం అంత తేలిక కాదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. 13 మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కనీసం నాలుగు నెలలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

థాయిలాండ్ లోని థామ్‌ లుయాంగ్‌ గుహ అత్యంత ప్రమాదకరమైనది. ఇందులో విహారం కోసం వెళ్లిన 12 మంది బాలురు, వారి కోచ్ జూన్ 23న గుహలో చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు గుహలో బురద పేరుకుపోవడంతో వాళ్లంతా గుహలోనే బందీలుగా మారిపోయారు. జూన్‌ 23 నుంచి తిండిలేక, చలికి వణుకుతూ బాగా నీరసించిపోయిన 13 మందిని రక్షించేందుకు థాయిలాండ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇద్దరు ఈత వచ్చిన వైద్యులను గుహలోకి పంపింది. అత్యంత విటమిన్లతో కూడిన సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని వారికి అందిస్తున్నారు. నాలుగు నెలలకు సరిపడా ఆహారం, కొన్ని మాత్రలు అందజేశారు. ఏడుగురు గజ ఈతగాళ్లు కూడా గుహలో చిక్కుకున్న వారి దగ్గరికి చేరుకొని వారి ధైర్యం చెబుతున్నారు.

సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే గుహలో ప్రధానద్వారం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వారంతా ఉన్నారని నావికాదళం సీల్స్‌ తమ ఫేస్‌బుక్‌ఖాతాలో తెలిపింది. నీటిమట్టానికి రెండు మీటర్ల ఎత్తైన మట్టిదిబ్బపై వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొంది. సోమవారంరాత్రి వీరిని బ్రిటీషు గజ ఈతగాళ్లు ఇద్దరు కనిపెట్టగలిగారని తెలిపింది. వారున్న స్థలం నుంచి బయటకు తీసుకురావాలంటే సాధారణ గజ ఈతగాడు సైతం ఆరు గంటలపాటు ఈదాల్సి ఉంటుంది. అలాంటిది ఆహారంలేక నీరసించిపోయిన బాలురు ఏమాత్రం ఈదలేరని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంచి ఆహారం, నీరు అందిస్తున్నారు.

మరోవైపు ముందుజాగ్రత్తగా వారికి ఈదడంలో శిక్షణ ఇవ్వనున్నారు. గుహను పైనుంచి తొలిచి రక్షించే అవకాశం ఉందో, లేదో పరిశీలిస్తున్నారు. గుహలో నీటిస్థాయి పెరగడకుండా ఉండేందుకు ఇంజినీర్లు గంటకు పదివేల లీటర్ల చొప్పున నీటిని తోడిస్తున్నారు. ఫలితంగా ప్రతి గంటకు సెంమీ నీటిమట్టం తగ్గుతోంది. ఇటీవల ఉపశమించిన వర్షాలు మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి నవంబరు మధ్య లోపలికి ప్రవేశించవద్దని ప్రధాన ద్వారం వద్ద ప్రభుత్వం బోర్డులు సైతం ఏర్పాటు చేసింది. ఈ హెచ్చరికలు ఏవి పట్టించుకోకుండా సాకర్ టీం కోచ్ తో సహా గుహలోకి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories