టీడీపీ పని గోవింద

టీడీపీ పని గోవింద
x
Highlights

తెలంగాణ‌లో టీడీపీ ప‌ని అయిపోయిన‌ట్లేనా? పార్టీ మ‌నుగ‌డ అసాధ్యమ‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారా? అధినేత చంద్రబాబు పార్టీని ప‌ట్టించుకోనందునే‌.. అధికార...

తెలంగాణ‌లో టీడీపీ ప‌ని అయిపోయిన‌ట్లేనా? పార్టీ మ‌నుగ‌డ అసాధ్యమ‌ని సీనియ‌ర్లు భావిస్తున్నారా? అధినేత చంద్రబాబు పార్టీని ప‌ట్టించుకోనందునే‌.. అధికార టీఆర్ఎస్ లో విలీనం చేయ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? మోత్కుపల్లి వ్యాఖ్య‌లతో టీడీపీ భవిష్యత్తు మీద కమ్ముకున్న నీలినీడలు మరోసారి బహిర్గతమయ్యాయి.

తెలంగాణ టీడీపీ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంది. సొంత బ‌లమున్న నేత‌లు త‌మ దారి తాము చూసుకుంటుండగా.. ఇత‌ర నేత‌లు అవ‌కాశం కోసం వేచి చూస్తున్నారు. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల మీద కూడా కేడ‌ర్ పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం లేదన్న అభిప్రాయాలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. టీడీపీకి ఆంధ్రా పార్టీ అన్న ముద్ర ఉండ‌టంతో... తెలంగాణలో ప్రజ‌ాద‌ర‌ణ నానాటికీ కోల్పోతోంది. హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల హ‌డావుడి త‌ప్ప మెజారిటీ నేత‌లు పార్టీ మీద ఆస‌క్తి కనబరచడం లేదని కార్యకర్తలే అంటున్నారు. మరోవైపు తెలంగాణ శాఖ‌ను బ‌లోపేతం చేయాలన్న ఉద్దేశం అధినేతకు కూడా పెద్దగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోక్రమంగా పార్టీ బ‌ల‌హీనప‌డుతూ వ‌స్తోంది.

తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే చంద్రబాబు యాత్ర చేయాలని టీ-టీడీపీ నేతలు కోరినా ఆయన అందుకు అంగీకరించడం లేదన్నట్లు మోత్కుపల్లి చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా కేవ‌లం ఆ రాష్ట్రానికే ప‌రిమిత‌మ‌వుతుండడంతో తెలంగాణ‌లో ఉనికే ప్రశ్నార్ధక‌మ‌వుతోందని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోత్కుపల్లి వ్యాఖ్యల‌ను చాలా మంది టీ-టీడీపీ నేత‌లు స‌మ‌ర్థిస్తుండడం విశేషం. రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం వీలైతే టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకోవాల‌ని... లేక‌పోతే విలీనమైనా చేయాల‌న్న ఆకాంక్షను వారు వ్యక్తప‌రుస్తున్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తే ఒక్క అసెంబ్లీ సీటైనా గెలిచే ప‌రిస్థితి లేదని.. పైగా ఇప్పుడు మిగిలిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తో ట‌చ్ లో ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అందుకే స‌హ‌జ మిత్రుడైన కేసీఆర్ తో చేతులు క‌ల‌పాల‌ని వారు కోరుతున్నారు. దీంతో తెలంగాణ టీడీపీ బాధ్యులు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. పార్టీని వీలినం చేస్తామ‌ని గానీ, చేయ‌లేమ‌ని గానీ చెప్ప‌లేక‌పోవడంలో మతలబు అదేనంటున్నారు విశ్లేషకులు. పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ సైతం సంక‌ట ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. పైకి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ంటున్నా... ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఖ‌చ్చితంగా పార్టీ మారుతార‌నే ప్ర‌చారం సాగుతోంది. తెలంగాణ కోసం కనీసం గంట సమయం కూడా కేటాయించని చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని బతికించడం కష్టంమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories