కలిసి నడుస్తాం కేసీఆర్ ను ఓడిస్తాం..

x
Highlights

మహా కూటమిలో సీట్ల కేటాయింపుపై నెలకొన్న సందిగ్థత ఇంకా కొనసాగుతోంది. ఎలాంటి నిర్ణయం జరగకుండానే మహాకూటమి చర్చలు ముగిశాయి. కామన్ ప్రోగ్రామ్ నిర్ణయించడంపైన...

మహా కూటమిలో సీట్ల కేటాయింపుపై నెలకొన్న సందిగ్థత ఇంకా కొనసాగుతోంది. ఎలాంటి నిర్ణయం జరగకుండానే మహాకూటమి చర్చలు ముగిశాయి. కామన్ ప్రోగ్రామ్ నిర్ణయించడంపైన మాత్రమే ప్రస్తుత చర్చలు జరుగుతున్నాయని మహా కూటమి నేతలు వెల్లడించారు. ఎన్నికల బరిలో దిగుతున్న మహా కూటమికి త్వరలోనే పేరు కూడా పెడతామని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం రద్దయిన తర్వాత శంకుస్థాపనలు చేస్తున్నా ఎన్నికల కమిషన్‌, గవర్నర్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే విధంగా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరే విధంగా మహాకూటమి ఎన్నికల బరిలో దిగనుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టిడిపి,సిపిఐ,టిజెఎస్‌ పార్టీ నాయకులతో చర్చించిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కార్యాచరణపై కొంత క్లారిటీ ఇచ్చారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని అందరూ భావించారని ఆ ఉద్యమ ఆకాంక్షలను సాధించాలనే క్రమంలోనే తామంతా కూటమిగా ఏర్పడటం జరిగిందని టీజేఎస్ అధినేత కోదండరామ్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశ పాలనను తొలగించాలని అన్నారు.

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల పాలు చేశారంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకుతిన్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలను శత్రువులుగా టీఆర్ఎస్ చూస్తోందని అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని సిపిఐ నాయకుడు చాడా వెంకట్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అమలు చేయడమే అందరి లక్ష్యమని చెప్పారు. ఒకే ఎజెండాతో మహాకూటమి ముందుకు వెళ్తుందని తెలిపారు. కెసిఆర్‌ను గద్దె దించే లక్ష్యంతో ఏర్పాటైన మహాకూటమి ఆచితూచి వ్యవహరిస్తోంది. అభ్యర్ధుల ఎంపికలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాతనే ప్రచారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories