ముందస్తు ప్రచారం వేళ గ్రేటర్‌లో కీలక పరిణామం

x
Highlights

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే ప్రచారం జోరందుకున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ క్లీన్‌స్వీపే లక్ష్యంగా దూసుకుపోతున్న...

ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే ప్రచారం జోరందుకున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ క్లీన్‌స్వీపే లక్ష్యంగా దూసుకుపోతున్న కేసీఆర్ సర్కార్‌ గ్రేటర్‌లో పట్టుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు జలమండలి, హెచ్‌ఎండీఏ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే బదిలీలు ఇక్కడితో ఆగవని త్వరలోనే జిల్లా కలెక్టర్లకు కూడా ట్రాన్స్‌ఫర్లుంటాయని చెబుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం శుక్రవారం తీసుకున్న నిర్ణయం ముందస్తు ప్రచారానికి మరింత మసాలా వేసినట్లుగా మారింది. పల్లెల్లో, పట్టణాల్లో పట్టు సాధించిన టీఆర్ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ క్లీన్ స్వీప్‌ లక్ష్యంగా దూసుకుపోతోంది. అందులో భాగంగా ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న జనార్ధన్‌రెడ్డిని హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ జలమండలి ఎండీగా విధులు నిర్వహిస్తున్న దాన కిశోర్‌ను గ్రేటర్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు.

మరోవైపు ప్రస్తుతం హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న చిరంజీవులును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్ అండ్ ఇన్ స్పెక్టర్ జనరల్ గా ట్రాన్స్ ఫర్ చేసింది. ఇప్పటి వరకు ఈ శాఖ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాకాటి కరుణను రిలీవ్ చేసింది.

అయితే టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలోనూ హైదరాబాద్‌లో ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. రాజధానిలో పట్టు సాధించాలని అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో భాగ్యనగరం విషయంలో ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే గంట ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తర్వాత బదిలీలకు అవకాశం లేకపోవడంతో ముందే కీలక ఐఏఎస్‌లను బదిలీ చేయడం ఆసక్తికరంగా అంతకుమించి చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories