తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి...మింగుడు పడని అధిష్టానం నిర్ణయాలు

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి...మింగుడు పడని అధిష్టానం నిర్ణయాలు
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతూ ఉంది. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు టి కాంగ్ నేతలకు మింగుడు పడడం లేదు. తాజాగా జిల్లా కాంగ్రెస్...

తెలంగాణ కాంగ్రెస్ లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతూ ఉంది. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు టి కాంగ్ నేతలకు మింగుడు పడడం లేదు. తాజాగా జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన అంశం కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలను మరింత కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో అన్ని పార్టీలు 31 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటిస్తే కాంగ్రెస్ మాత్రం 10 ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. దీంతో హస్తం పార్టీ నేతలు అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉన్నాయి. అన్ని పార్టీలు 31 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. పాత 10 జిల్లాలకే అధ్యక్షులను ప్రకటిస్తే పార్టీ బలోపేతం చేయడం ఎలా సాధ్యం అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. అదే విధంగా ఒక్క హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలకు పాత అధ్యక్షులను ప్రకటించడంపై కూడా నేతలు అసంతృప్తితో ఉన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా కొనసాగుతున్నవారు సైతం పార్టీ బలోపేతానికి ఎటువంటి కృషి చేయడం లేదని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. కొత్తవారికి అవకాశం కల్పించి పార్టీని బలోపేతం చేస్తారని భావించిన వారికి అధిష్టానం నిర్ణయం మింగుడు పడడం లేదు.

లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాది కూడా లేదు. దీంతో అసంతృప్త నేతలు అధిష్ఠానానికి తమ గోడు వినిపించేందుకు వినూత్నంగా ఆలోచించారు. మొత్తం 31 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటిస్తేనే పార్టీలో ఊపు వస్తుందని తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కూడా చేశారు. ఏఐసిసికి కొందరు ఇచ్చిన తప్పుడు రిపోర్టు కారణంగానే ఇలా జరిగిందని....అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరుతూ జిల్లాల నేతలు పీసీసీ ఇంచార్జ్ కుంతియాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం 31 జిల్లాలకు అధ్యక్షులు ఉంటే పార్టీని సమన్వయం చేసుకోవడం సాధ్యమౌతుందని, కేవలం పాత జిల్లాలకే అధ్యక్షులను నియమిస్తే పార్టీలో సమన్వయం దెబ్బతింటుందని జిల్లాల నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో అధిష్టానం కలగజేసుకుని కొత్త జిల్లాలు అన్నింటికీ కూడా అధ్యక్షులను నియమిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories