టీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు...వలసల్ని అడ్డుకొంటున్న నేతలు

టీ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు...వలసల్ని అడ్డుకొంటున్న నేతలు
x
Highlights

అధికారంలోకి రావాలి.. కానీ.. అందుకు నేతలంతా ఉమ్మడిగా ఏమాత్రం యత్నించరు. అధికార పదవులు కావాలి.... కానీ...ఎవరి లాభం వారు చూసుకుంటారు. పార్టీ బలోపేతం...

అధికారంలోకి రావాలి.. కానీ.. అందుకు నేతలంతా ఉమ్మడిగా ఏమాత్రం యత్నించరు. అధికార పదవులు కావాలి.... కానీ...ఎవరి లాభం వారు చూసుకుంటారు. పార్టీ బలోపేతం కావాలనే అంకాంక్ష ప్రతి ఒక్కర్లోనూ ఉంటుంది...కానీ...ఇతర పార్టీల నేతలు వస్తుంటే మాత్రం అడ్డుకుంటారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇది. ఆధిపత్య పోరు కారణంగా నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.

2019లో ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవానే లక్ష్యంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను హస్తం గూటికి ఆహ్వానిస్తోంది. ఈ వలసలే ఇప్పుడు వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయి. కొందరు ఆధిపత్యం కోసం వలసలను ప్రోత్సహిస్తుంటే.. మరికొందరేమో వలసల వల్ల పాత వారికి అన్యాయం జరుగుతుందనే వాదన తెరపైకి తెస్తున్నారు. పైగా నేతలు ఎక్కువయ్యే కొద్దీ వర్గపోరు పెరిగి అసలుకే మోసం వస్తుందని అంటున్నారు.

మహబూబ్ నగర్లో..కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తనకు అనుకూలమైన రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోగా...నాగం జనార్దన్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి దంపతులను కూడా కాంగ్రెస్ చెంతకు చేర్చడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. డీకే అరుణ ఆధిపత్యానికి బ్రేక్ వేయడానికే జైపాల్ ఇలా వలసల్ని ప్రోత్సహిస్తున్నారని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై గతంలో రాహుల్ గాంధీని కలసి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకవేళ ఎవరైనా కాంగ్రెస్‌లోకి వస్తే టికెట్ ఆశించకుండా పని చేయాలని డీకే అరుణ వర్గం తెగేసి చెబుతోంది.

ఇక నల్లగొండ జిల్లాలో కూడా పీసీసీ ముఖ్యనేత... తన అనుచరుడి కోసం జిట్టా బాలకృష్ణ రెడ్డిని , ఉమా మాధవ రెడ్డిని అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ ఆమె గులాబీ గూటికి చేరిపోయారు. అలాగే ముఖ్యనేత అనుచరుడైన కుంభం అనిల్ కుమార్‌కి భువనగిరి టికెట్‌ను కట్టపెట్టడానికే జిట్టా బాలకృష్ణ రెడ్డిని అడ్డుకున్నట్లు సమాచారం. ఇక నల్లగొండ జిల్లాకు చెందిన కంచెర్ల భూపాల్ రెడ్డి సైతం రేవంత్ వచ్చినప్పుడే హస్తం వైపు చూశారు. కానీ..కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన రాకను అడ్డుకున్నట్లు టీ కాంగ్ వర్గాలు చెబుతున్నారు. దీంతో కంచెర్ల కూడా కారెక్కేశారు.

అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన అది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని ప్రయత్నాలు చేశారు. పీసీసీ మెంబర్ మనోహర్ రెడ్డి...శ్రీనివాస్ ను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అలాగే నిర్మల్ ‌లో టీడీపీకి అనుకూలంగా ఉండే ప్రముఖ లాయర్ మల్లారెడ్డి కాంగ్రెస్‌లోకి రావడానికి మొగ్గు చూపితే...ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆయన్ను అడ్డుకొంటున్నట్లు తెలిసింది. మరి ఇన్ని అడ్డంకుల మధ్య హస్తం గూట్లోకి వలసల జోరు కొనసాగుతుందా..లేదంటే బ్రేక్ పడుతుందా అనేది చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories