కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మరో 15 మంది!

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మరో 15 మంది!
x
Highlights

గులాబీ బాస్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారా ? ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ సెకండ్ ఎపిసోడ్‌కు తెరతీశారా? ఢిల్లీ పర్యటన తరువాత వ్యూహాలకు...

గులాబీ బాస్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారా ? ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ సెకండ్ ఎపిసోడ్‌కు తెరతీశారా? ఢిల్లీ పర్యటన తరువాత వ్యూహాలకు పదును పెట్టారా? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు పక్కాగా అడుగులు వేస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు టీఆర్ఎస్ భవన్‌ నుంచి జోరుగా వినిపిస్తున్నాయి.

పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టారా? ఇందుకోసమే ప్రజా సంక్షేమ పథకాలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారా ?

సంక్షేమ పథకాలతో కారు జోరు పెరుగుతోందని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సై అన్నారు. ఇందుకు ప్రతిపక్షాలు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరిన ఆయన .. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు వంద స్ధానాలపైనే వస్తాయంటూ లెక్కలతో సహా వివరించారు. 82 స్ధానాల్లో 60 శాతం పైగా ఓట్లు సాధిస్తామన్న ఆయన... వంద స్ధానాల్లో 50 శాతానికి పైగానే ఓట్లు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు తమ పార్టీ దరిదారుల్లోకి కూడా ఎవరూ రాలేరంటూ ప్రకటించారు.

ఢిల్లీ పర్యటనలో సంకేతాలు అందుకున్న తరువాతే సీఎం కేసీఆర్ ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఫాంహౌస్‌లో కీలక నేతలతో సమావేశమయిన ఆయన .. ఇటీవల కాలంలో నిర్వహించిన సర్వేను విశ్లేషించారు. ఇటీవల చేపట్టిన సంక్షేమ పథకాలతో రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పార్టీపై మరింత నమ్మకం పెంచుకున్నారని నేతలకు వివరించారు. నవంబర్ డిసెంబర్‌ల మధ్య ఎన్నికలు వచ్చే అవకాశాలున్నందును అప్రమత్తంగా ఉండాలంటూ నేతలను హెచ్చరించినట్టు సమాచారం. సర్వేలో పనితీరు బాగోలేదంటూ వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించే బాధ్యతను తానే తీసుకుంటానంటూ నేతలకు వివరించినట్టు సమాచారం.

మాజీ మంత్రి దానం నాగేందర్ చేరిక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇలాంటి చేరికలు మరిన్ని ఉంటాయంటూ ప్రకటించారు. రాబోయే రోజుల్లో పది పదిహేను మంది కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్‌కు దమ్ముందా అని బీజేపీ నేతలు పాటలు పాడుతున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎంత దమ్ముందో అందరికీ తెలుసు. టీఆర్‌ఎస్‌ పథకాలు ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి. వరంగల్‌ ఉప ఎన్నికల్లో నాపై కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి అనుచితంగా మాట్లాడారు. ఇలాంటి నాయకుల మాటల వల్ల ఏనాడూ సర్పంచ్‌గా కూడా పనిచేయని దయాకర్‌ను ప్రజలు ఆ ఎన్నికల్లో ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపించారు అని కేసీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ పునర్ నిర్మాణం తమకు పవిత్ర యజ్ఞంతో సమానమన్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని చేరికలుంటాయంటూ హెచ్చరించడం ద్వారా ఆత్మరక్షణ ధోరణిలో పడేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు వెల్‌కం చెప్పడం ద్వారా రాజనీతిని ప్రదర్శిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories