ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం

x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయ్యింది. హస్తిన పర్యటన లక్ష్యాన్ని సాధించారు. గత రెండు నెలలుగా పడుతున్న తర్జన భర్జనలకు త్వరలోనే...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయ్యింది. హస్తిన పర్యటన లక్ష్యాన్ని సాధించారు. గత రెండు నెలలుగా పడుతున్న తర్జన భర్జనలకు త్వరలోనే తెరపడనుంది. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలవడ్డాయి. దీనికి సంబంధించి రానున్న రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందంటూ.. సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో మరికొన్ని గంటల్లోనే రాష్ట్ర ముఖచిత్రం అధికారికంగా మారనుంది.

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా.. తెలంగాణ సర్కారు తీసుకున్న కొత్త జోన్ల విధానానికి కేంద్రం జై కొట్టింది. పంద్రాగస్టు లోగా కొత్త జోన్లను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి అనుకున్నది సాధించుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 6 జోన్లుండగా విభజన తర్వాత తెలంగాణకు 5, 6 జోన్లు వచ్చాయి. అయితే పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో 31 జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఉద్యోగ నియామకాలను కొత్త జిల్లాల ప్రకారమే నిర్వహించాల్సిన అవసరం వచ్చింది.

అయితే అదే సమయంలో రాష్ట్రంలో జోన్లను కూడా పునర్వవ్యవస్థీకరించారు. ఏడు జోన్లతో రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా మార్పులు చేశారు. కొత్తగా ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు అసెంబ్లీలో ఆమోదం తెలిపి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంతో మంతనాలు జరుపుతూ వచ్చారు.

రాజ్యాంగంలోని 371 డి అధికరణ ప్రకారం.. కొత్త జోనల్‌ వ్యవస్థను ఆమోదిస్తూ రాష్ట్రపతి తాజా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆరే డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం పొందేలా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని.. ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు.. సంబంధిత కేంద్రమంత్రులను కూడా కలిసిన కేసీఆర్.. జోనల్ వ్యవస్థ ఆమోదానికి చొరవ చూపాలని కోరారు. దీంతో మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. త్వరలోనే 31 జిల్లాల సరికొత్త తెలంగాణను కేంద్రం అధికారికంగా ఆమోదించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories