తెలంగాణ బీజేపీలో వలసల పర్వం

తెలంగాణ బీజేపీలో వలసల పర్వం
x
Highlights

తెలంగాణ బీజేపీలోకి వచ్చిన నేతలు ఎందుకు తిరిగి వెళ్లిపోతున్నారు..? పార్టీ కండువా కప్పుకొన్నప్పుడు వారిలో ఉన్న జోష్.. ఆ తర్వాత ఎందుకు ఉండటం లేదు..?...

తెలంగాణ బీజేపీలోకి వచ్చిన నేతలు ఎందుకు తిరిగి వెళ్లిపోతున్నారు..? పార్టీ కండువా కప్పుకొన్నప్పుడు వారిలో ఉన్న జోష్.. ఆ తర్వాత ఎందుకు ఉండటం లేదు..? అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇమడలేకపోతున్నారా.. ? లేక ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా..? ఏమై ఉంటుంది.. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతోంది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీలో వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలంతా తిరిగి కొత్త బాటపడుతున్నారు. బీజేపీలోకి వచ్చిన కొత్త నేతలను కాపాడుకోలేకపోతుండటం ఆ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నాగం జనార్ధన్‌రెడ్డి లాంటి సీనియర్‌ నేత పార్టీకి గుడ్‌ బై చెప్పడం బీజేపీని కలవరపరుస్తోంది.

నాగం జనార్ధన్‌రెడ్డికి ముందు ఎంతోమంది సీనియర్లు పార్టీలో ఇమడలేక గుడ్‌బై చెప్పేశారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నాగం రాజీనామా వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కమలనాధుల్లో కూడా దీనిపై అంతర్మథనం మొదలైంది. నాగం మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి తిరిగి వెళ్లిపోయిన వారి జాబితా చాలానే ఉంది.

ఇటీవల నాగం రాజీనామాతో ఆయనకు మద్దతుగా మరికొందరు నేతలు బీజేపీని వీడారు. తాజాగా తెలంగాణ స్వచ్ఛభారత్ కమిటీ కో కన్వీనర్ యోగీశ్వర్‌రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో కోదండరాం పార్టీ టీజేఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేస్తున్నా అధిష్టానం స్పందించడం లేదని నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం స్పందించి పార్టీ వీడుతున్న నేతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories