శివాజీ చెప్పినట్లే ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు....కలకలం రేపుతున్న....

x
Highlights

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు మరో 15మందిపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు...

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు మరో 15మందిపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోర్టు నోటీసుల వ్యవహారంలో ఏం చేయాలనే అంశంపై టీడీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఈ నెల 21 న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా లేదంటే మరేం చేయాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారు. బాబ్లీ కేసు, నోటీసులపై న్యాయ నిపుణులతో సంప్రదించాలని నిర్ణయించారు.

చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేయడాన్ని తెలుగుదేశం నేతలు తప్పు బడుతున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బాబ్లీ కేసును తిరగదోడడం ఆశ్చర్యంగా ఉందని నోటీసుల అందుకున్న మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. నిజానికి కేసు ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లో మహారాష్ట్ర పోలీసులు చెప్పారని కానీ కేసును తిరగతోడటం వెనుక ఎవరి హస్తం ఉందో తేలాలని వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని నక్కా ఆనందబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక కేంద్రం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసిన చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్‌ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

సీఎం చంద్రబాబుకు త్వరలో నోటీసులు అందుతాయని సినీ హీరో శివాజీ ప్రకటించిన కొద్ది రోజులకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయబోతున్నారంటూ శివాజీ గత వారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు కుట్రలుపన్నుతున్నారని కూడా శివాజీ ఆరోపించారు. శివాజీ చెప్పినట్లే ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు రావడం చర్చకు దారి తీసింది.

చంద్రబాబుకు వ్యతిరేకంగా కచ్చితంగా కుట్ర జరుగుతోందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కక్షతోనే నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబును ముట్టుకుంటే భస్మమైపోతారని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోడీ బెదిరింపులకు చంద్రబాబు భయపడరనీ...చంద్రబాబుపై కక్షసాధింపులకు పాల్పడితే బీజేపీకి గుణపాఠం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories