శ్రీశైలంలో క్షుద్రపూజలు

x
Highlights

జ్యోతిర్లింగ ఆలయం పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవాలయం సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆలయ పరిసరాల్లో తాంత్రిక పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ప్రధాన...

జ్యోతిర్లింగ ఆలయం పరమ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవాలయం సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆలయ పరిసరాల్లో తాంత్రిక పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ప్రధాన పూజారిని సస్పెండ్‌ చేయడం కలకలం రేపుతోంది. అధికారులకు, అర్చకులకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరే ఇంతటి పరిణామానికి దారి తీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో తాంత్రిక పూజలు కలకలం రేపుతున్నాయి. భ్రమరాంబ ఆలయ ప్రధాన అర్చకులు గంటి రాధాకృష్ణ ఆలయ పరిసరాల్లో నిర్వహించిన తాంత్రిక పూజల తాలూకు దృశ్యాలు భయం గొల్పుతున్నాయి.

గంటి రాధాకృష్ణ శ్రీశైలం ఆలయం ప్రధానార్చకులు. గత 30 యేళ్లుగా అర్చకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణకు ఈవో శ్రీరామచంద్రమూర్తికి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుందనే ఆరోపణలున్నాయి. అయితే మొన్నటి పౌర్ణమి రాత్రి సమయంలో ఆలయం పరిసరాల్లో రాధాకృష్ణ తాంత్రిక పూజలు, హోమాలు నిర్వహించారనే ఆరోపణలపై ఆయన్ను సస్పెండ్‌ చేశారు. దీని తాలూకు దృశ్యాలను ఈవో శ్రీరామచంద్రమూర్తి విడుదల చేశారు.

ఈవోపై కక్ష కట్టిన రాధాకృష్ణ ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఈవోను ఏదో చేయాలనే ఉద్దేశ్యంతోనే అర్ధరాత్రి సమయంలో ఇలాంటి తాంత్రిక పూజలు చేశారని చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఈవో నిఘా పెట్టించారు. ఆయన ఇంటికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది అర్ధరాత్రి జరిగిన హోమాలు, పూజలపై రాధాకృష్ణను నిలదీశారు. అయితే మానసిక, శారీరక రుగ్మతలు తొలగించుకునేందుకే చండీ హోమం నిర్వహించామని అర్చకులు గంటి రాధాకృష్ణ చెబుతున్నారు. తాను ఒకరిని బాధపెట్టే పని ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చారు.

అయితే ఘటనపై విచారణ చేపట్టిన ఈవో శ్రీరామచంద్రమూర్తి పూర్తి ఆధారాలతో ఆగమ శాస్త్ర మండలికి ఫిర్యాదు చేశారు. వారి అనుమతితో గంటి రాధాకృష్ణను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలతో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అంతర్గత విభేదాలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories