మాట్లాడే చెట్టు.. పోలీసులొచ్చాక మూగబోయింది..

x
Highlights

కొండగట్టు ప్రాంతంలో ఒక తాటిచెట్టు నుండి మాటలు వినిపిస్తున్నాయన్న వార్త జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్యాల...

కొండగట్టు ప్రాంతంలో ఒక తాటిచెట్టు నుండి మాటలు వినిపిస్తున్నాయన్న వార్త జగిత్యాల జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు చెందిన బత్తిని మల్లేశం అనే వ్యక్తికి సంబంధించిన స్థలంలో ఒక తాటిచెట్టు ఉంది. ఈ తాటిచెట్టు నుండి గత మూడు రోజులుగా మూలుగులు, శబ్ధాలు వినిపిస్తున్నాయన్న వార్త దావానంలా వ్యాపించింది. కొండగట్టు ప్రాంత వాసులు, చుట్టు ప్రక్కల గ్రామాల జనాలు ఈ విచిత్రాన్ని చూడటానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కొంత మంది భక్తులు ఏకంగా పసుపు కుంకుమలతో, పూలతో పూజలు చేయడం, చూసిన వారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో విషయం పోలీసులకు చేరింది.

సదరు మాట్లాడే చెట్టు పోలీసులు తన వద్దకు రాగానే మౌనవ్రతం పట్టేసింది. దీంతో వదంతులకు తెరపడింది. ‘మేం గురువారం సాయంత్రం ఆ చెట్టు వద్దకు వెళ్లాం. దగ్గరగా చెవి పెట్టి మరీ విన్నాం. మాకు ఎలాంటి శబ్దమూ వినిపించలేదు. చుట్టుపక్కల ఉన్న చెట్లపై కొన్ని తేనెపట్లు ఉన్నాయి. తేనెటీగల శబ్దాన్ని జనం తాటిచెట్టు మాటలుగా అపోహపడ్డారు.. ’ అని మల్లియాల్ సీఐ నాగేందర్ చెప్పారు. జనం ఇలాంటి పుకార్లను పట్టించుకోవద్దని, బుర్రపెట్టి ఆలోచించాలని హితవు పలికారు. దీంతో మూడు రోజులుగా పూజలందుకున్న తాటిచెట్టమ్మ ఇప్పుడు బోసిపోయింది. తేనెటీగల శబ్దంతోపాటు చెట్ల నుంచి హోరుమని వీస్తున్న గాలిని కూడా జనం అమ్మోరి మాటలుగా భావించినట్లు అధికారులు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories