ప్రాణం తీసిన బైక్ ఫొటోగ్రఫీ ఈవెంట్!

ప్రాణం తీసిన బైక్ ఫొటోగ్రఫీ ఈవెంట్!
x
Highlights

సరికొత్త బైక్ లంటే అతనికి పిచ్చి అభిమానం. ఖరీదైన బైక్‌లను నడపాలని, వాటిమీద డ్రైవ్ చేస్తూ ఫోటోలు తీయించుకోవాలని సరదా. కానీ అంత ఖరీదైన బైక్‌లు కొనలేని...

సరికొత్త బైక్ లంటే అతనికి పిచ్చి అభిమానం. ఖరీదైన బైక్‌లను నడపాలని, వాటిమీద డ్రైవ్ చేస్తూ ఫోటోలు తీయించుకోవాలని సరదా. కానీ అంత ఖరీదైన బైక్‌లు కొనలేని ఆర్ధిక పరిస్థితి. అందుకే బైక్‌లను అద్దెకు ఇస్తూ ఫోటోలు తీసి ఇచ్చే బైక్ ఫోటోగ్రఫి అనే సంస్ధ వారితో స్నేహం చేశాడు విద్యార్థి వంశీకృష్ణ. చివరికి ఆ బైక్‌ల మీద ఉన్న సరదానే యువకుడి ప్రాణాలు తీసింది.

హైదరాబాద్‌ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో నివసించే వంశీకృష్ణ డిగ్రి చదువుతున్నాడు. అతని తండ్రి ఒక చిన్న ఫ్రాబ్రికేషన్ వర్క్ షాపు నిర్వహిస్తున్నాడు. తండ్రి సంపాదన తక్కువ కావడంతో వచ్చే కొద్దిపాటి డబ్బుతో గుట్టుగా బతుకుబండి లాగిస్తున్నారు. వంశీకి కొత్త కొత్త బైక్‌లంటే వల్లమాలిన ఇష్టం. తాను కొత్త బైక్‌లు కొనలేడు కాబట్టి బైక్‌లను అద్దెకు ఇస్తూ ఫొటోలు తీసి ఇచ్చే శ్యామ్ అనే వ్యక్తితో స్నేహం చేశాడు. ఇద్దరు మరికొందర్ని కలుపుకుని బైక్ ఫోటోగ్రఫి అనే ఈవెంట్‌కు ప్లాన్ చేశారు.

కూకట్‌పల్లి ఐడిఎల్ చెరువు వద్ద ఈనెల 29న బైక్ ఫోటోగ్రఫి ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వంశీ ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫారం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఇలా వచ్చి బైకుల మీద రైడ్ చేసి ఫోటో తీసుకోవాలంటే ఒకొక్కరు 350 నుంచి 400 చెల్లిస్తే చాలని వంశీ, శ్యామ్ కలిసి ప్రచారం చేశారు. శ్యామ్ మరికొందరు కలిసి కెమెరాలు, బైకులు తీసుకుని రాగా, వంశీ ఈవెంట్‌కు 500 మంది విద్యార్ధులను తీసుకుని వస్తానని ప్రామిస్ చేశాడు.

అయితే వంశీ అంచనా ఇక్కడ తప్పింది. అనుకున్న సంఖ్యలో బైక్ ఫోటోగ్రఫి ఈవెంట్‌కు విద్యార్థులు రాలేదు. కేవలం వంశీ తరఫున 50 నుంచి 60 మంది మాత్రమే వచ్చారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్ ఆగ్రహంతో వంశీపై విరుచుకుపడ్డాడు. నీవల్ల నాకు నష్టం జరిగింది. కెమెరాలు, బైక్‌లు అద్దెకు తీసుకుని వచ్చాను. ఆ డబ్బు ఎవరు చెల్లిస్తారు?.. నీవే డబ్బు కట్టాలంటూ బెదిరించాడు. జరిగిన నష్టానికి దాదాపు లక్షన్నర డబ్బులు చెల్లించాలని వేధించాడు.

ఈ విషయం ఇంట్లో తెలిస్తే కష్టం అని భావించిన వంశీ, ఆ డబ్బు చెల్లించలేక ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ ఆత్మహత్య విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్యామ్ వేధింపుల వల్లే తమ కుమారుడు మరణించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని వంశీ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరదా... కాస్తా చివరికి యువతీ, యువకుల ప్రాణాలు తీస్తుందని చెప్పడానికి ఇదే ఓ ఉదాహరణ. ఇలాంటి పరిస్థితులు పునావృతం కాకుండా ఉండాలంటే... యువత సరదాలు హద్దుల్లో ఉంటే అన్నివిధాలా మంచిదన్నది కొందరు పెద్దల సలహా.

Show Full Article
Print Article
Next Story
More Stories