logo

పాపం మోత్కుపల్లి

ఒకప్పుడు టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి. విభజన తర్వాత కూడా ఆయన తన సత్తా చాటుకున్నారు. సీఎం కేసీఆర్ మీద ఎవరూ చేయని స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలే ఆయన్ని ఇరకాటంలో పడేశాయా? అటు సొంత పార్టీ పట్టించుకోక.. అధికార పార్టీ నుంచి ఆహ్వానం అందక మోత్కుపల్లి అయోమయంలో పడిపోయారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. దళిత నేతగా ఆయన టీడీపీలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. మిగతా నాయకులకు దీటుగా క్రియాశీలంగానూ వ్యవహరించారు. అయితే ఆశపడ్డ గవర్నర్ గిరీ గానీ, రాజ్య సభ సీటు గానీ ఆయన్ని వరించకపోవడంతో అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే కేసీఆర్ మీద విమర్శలం తగ్గించి టీడీపీని ఇరుకున పెట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన చేసిన ప్రతిపాదనలు పెద్ద దుమారమే లేపాయి.

తెలుగుదేశం మనుగడనే ప్రశ్నించేలా, కార్యకర్తల మనోదైర్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నమోత్కుపల్లితో పార్టీకి లాభం కంటే నష్టమే అధికంగా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్లు సైతం ఆయనతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కనీసం పార్టీ కార్యక్రమాలకైనా మోత్కుపల్లిని ఆహ్వానించడం లేదని సమాచారం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకుండా అంతా ఆయన్ని వదిలించుకునే ఉద్దేశంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.

టీడీపీని దెబ్బకొట్టి, గులాబీ దండుకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా టీఆర్ఎస్ నుంచి తనకు పిలుపొస్తుందని మోత్కుపల్లి ఆశించారు. తనను టీఆర్ఎస్ లో చేర్చుకుని తగిన పదవి ఇస్తారని బలంగా నమ్మారు. అందుకే వెనకా ముందు ఆలోచించకుండా టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అయినా టీఆర్ఎస్ పెద్దల నుంచి పిలుపు రాకపోవడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

ఇక మోత్కుపల్లిని పిలిచి పార్టీలో చేర్చుకుంటే ఆయన డిమాండ్లకు తలొగ్గాల్సి వస్తుందని అందుకే ఏ మాత్రం తొందరపడకుండా చేరిక ప్రతిపాదన ఆయన నుంచి వచ్చేవరకు వేచి చూడాలని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే మోత్కుపల్లితో టీఆర్ఎస్ నేతలెవ్వరూ సంప్రదింపులు జరపడం లేదు. దీంతో అటు సొంత పార్టీ టీడీపీ పట్టించుకోక ఇటు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందక రాజకీయాల్లో ఒంటరినయ్యానని మోత్కుపల్లి మథనపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఎన్నో మంత్రిత్వ శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన మోత్కుపల్లి తెలంగాణ రాజకీయాల్లో నామమాత్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆయన ఆశలు చిగురించే రోజు ఎప్పుడొస్తుందో వేచిచూడాలి.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top