24 గంటలు.. 28 మంది ప్రాణాలు

24 గంటలు.. 28 మంది ప్రాణాలు
x
Highlights

24 గంటల్లో.. 28 మంది ప్రాణాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో రహదారుల రక్తదాహానికి.. లెక్కలివి. ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన రోడ్లపై ప్రయాణం.. సరాసరి...

24 గంటల్లో.. 28 మంది ప్రాణాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో రహదారుల రక్తదాహానికి.. లెక్కలివి. ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిన రోడ్లపై ప్రయాణం.. సరాసరి నరకానికే దారి తీస్తోంది. ఓవర్‌లోడ్‌తో పాటు.. ఓవర్‌ కాన్ఫిడెన్సే.. ప్రయాణీకుల పాలిట మృత్యువుగా పరిణమించుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రైవర్లే.. యమకింకరులుగా మారుతున్నారు.

24 గంటలు.. 28 మంది ప్రాణాలు... సోమవారం...రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగాల..ఆటో, కారు ఢీ. ఆరుగురు ప్రయాణీకులు మృతి

ఆదివారం...యాదాద్రి జిల్లా వలిగొండ...అదుపు తప్పి మూసీ కాల్వలో పడ్డ ట్రాక్టర్...మూసీ నీటిలో కలిసిన 15 మంది ప్రాణాలు

ఆదివారం...కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె..నేషనల్ హైవేపై రాంగ్‌రూట్‌లో ఆటో ప్రయాణం...9 మంది బలి

24 గంటలు.. 28 మంది ప్రాణాలు. గమ్యం చేరాల్సిన ప్రయాణీకుల ప్రాణాలు.. గాల్లో ఎందుకు కలుస్తున్నాయి..? తప్పెక్కడ జరుగుతోంది..? నిర్లక్ష్యం ఎవరిది..? రంగారెడ్డి మంచాల మండలం లింగాల దగ్గర జరిగిన ప్రమాదంలో.. వేగంగా వస్తున్న ఆటోను.. కారు ఢీ కొట్టగా.. ఆరుగురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆటోలో ఏకంగా 10 మంది ప్రయాణిస్తుండటం.. నిర్లక్ష్యంగా నడపడమే.. ఈ ప్రమాదానికి కారణమని తేల్చారు.

యాదాద్రి జిల్లా వలిగొండ దగ్గర ఆదివారం జరిగిన ప్రమాదంలో ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ చేత్తో బీడీ పట్టుకుని.. మరో చేత్తో స్టీరింగ్ పట్టుకుని.. కేర్‌లెస్‌గా నడిపిన డ్రైవర్.. 15 మంది ప్రాణాలను మూసీలో కలిపేశాడు. వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్‌లో.. భారీ సంఖ్యలో జనాలను ఎక్కించుకోవడం.. నిర్లక్ష్యంగా నడపడంతో.. భారీగా ప్రాణనష్టం వాటిల్లింది.

ఇటు కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె దగ్గర్లో.. ఆటో డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యం.. 9 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆటో డ్రైవర్ ఓవర్‌ కాన్ఫిడెన్స్.. విలువైన ప్రాణాలను మింగేసింది. 13 మందిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్.. సోమయాజుల పల్లె దగ్గర తొందరగా వెళ్లే క్రమంలో.. నేషనల్ హైవేపై రాంగ్‌రూట్‌లో ఆటోను నడిపించాడు. ఎదురుగా వేగంగా వచ్చిన నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఆటోను ఢీ కొట్టడంతో.. రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఆటో నుజ్జునుజ్జవగా.. స్పాట్‌లోనే ఏడుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. చనిపోయిన వారిలో 8 మంది మహిళలే కావడంతో.. ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఓవర్ లోడ్‌, ఓవర్ కాన్ఫిడెన్సే.. ఈ ప్రమాదాలకు కారణమని తేల్చిచెబుతున్నారు. తన చేతుల్లో విలువైన ప్రాణాలున్నాయని తెలిసినా.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్న డ్రైవర్లు.. అమాయకులను బలి తీసుకుంటున్నారు. రాంగ్‌రూట్‌లో ఆటోను తీసుకెళ్లడం, పొగతాగుతూ కేర్‌లెస్‌గా ట్రాక్టర్‌ను నడపడం.. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం.. ప్రమాదాలను కొనితెచ్చుకునేలా చేస్తున్నాయి. పట్టింపులేని వాహనాలను నడుపుతున్న డ్రైవర్లే.. ప్రయాణీకుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories