కన్నడ నాట కాంగ్రెస్‌ నావను సోనియా గట్టెక్కిస్తారా?

కన్నడ నాట కాంగ్రెస్‌ నావను సోనియా గట్టెక్కిస్తారా?
x
Highlights

దేశంలో ఇప్పుడు అందరి దృష్టి కర్నాటక ఎన్నికలపైనే ఉంది. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మలుపు తిప్పనున్నాయి. రాహుల్ ను, కాంగ్రెస్ ను కాపాడేందుకు స్వయంగా...

దేశంలో ఇప్పుడు అందరి దృష్టి కర్నాటక ఎన్నికలపైనే ఉంది. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మలుపు తిప్పనున్నాయి. రాహుల్ ను, కాంగ్రెస్ ను కాపాడేందుకు స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరి ఆమె కాంగ్రెస్ ను కాపడగలుగుతారా ? పార్టీలో రాహుల్ గాంధీ స్థానాన్ని సుస్థిరం చేస్తారా ? విపక్ష ఫ్రంట్ ఏర్పాటుపై కొత్త ఆశలు రేకెత్తిస్తారా ? సుమారు రెండేళ్ళుగా బహిరంగ సభలకు దూరంగా ఉన్న సోనియా గాంధీ ఇప్పుడు రంగంలోకి దిగారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారానికి కొత్త బలాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె రంగంలోకి దిగడం కాంగ్రెస్ కు ఊపిరి పోస్తుందా ? లేదంటే ఆమెపై ఉన్న విదేశీ ముద్ర మరోసారి దుమారం రేపనుందా ?

అంటోనియో మైనో .... అసలు ఈ పదమే అర్థం కావడం లేదు కదా.. కర్నాటకలో సోషల్ మీడియాలో మాత్రం ఈ పేరు మారుమోగిపోతోంది. ఇటలీలో పుట్టి పెరిగిన మహిళ పేరు ఇది. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు... ఆమెనే సోనియా గాంధీ. కాంగ్రెస్ మిగిలిన చివరి కోటల్లో ఒకటైన కర్నాటకకు కాపాడుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. సుమారు రెండేళ్ళుగా బహిరంగ సభలకు దూరంగా ఉన్న ఆమె ఈ రోజున దక్షిణాదిన ఒక రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఒకప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతురాలైన మహిళ ఆమె. నాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నా రిమోట్ కంట్రోల్ తో దేశాన్ని పాలించిన మహిళ ఆమె. రాహుల్ గాంధీకి పార్టీ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షుడిగా పట్టం కట్టిన తరువాత ఆమె క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగానే ఉన్నారు. అనారోగ్యం కారణంగా రెండేళ్ళుగా బహిరంగ సభలకు దూరంగా ఉన్నారు. అలాంటి సోనియా గాంధీ ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం, పార్టీలో రాహుల్ గాంధీ స్థానాన్ని సుస్థిరం చేయడం, కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ఫ్రంట్ ను బలోపేతం చేయడం ఆమె లక్ష్యాలుగా మారాయి. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఓడిపోతూ రావడం కాంగ్రెస్ పై ఒత్తిడిని పెంచింది. వరుసగా 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కర్నాటకలోనూ ఓడిపోతే అది 13 వ రాష్ర్టం కానుంది. మరో వైపున పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావడంలో పెద్దగా చిక్కులు ఎదురు కానప్పటికీ, ఎలాంటి ఘన విజయాలు సాధించకుండానే ఆయన ఆ పదవి లోకి వచ్చారు. అంతకుముందు కొన్నేళ్ళ పాటు ఆయనను పరాజయాలు వెంటాడాయి. కర్నాటకలోనూ పరాజయం పాలైతే అది ఆయన సారథ్యంపై సందేహాలు కలిగించే అవకాశం ఉంది. మరో వైపున యూపీఏ ఫ్రంట్ నుంచి ఎన్నో మిత్రపక్షాలు దూరమైపోయాయి. అవి తిరిగి చేరువ కావాలంటే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచితీరాల్సిన అవసరం ఏర్పడింది. లేని పక్షంలో మిత్ర పక్షాలతో బేరసారాలు చేసే శక్తిని కూడా కాంగ్రెస్ కోల్పోనుంది.

సోనియా గాంధీ ఎంచుకున్న మూడు లక్ష్యాలూ కర్నాటక ఎన్నికలతోనే ముడిపడి ఉన్నాయి. ఆ లక్ష్యసాధన మాత్రం అంత సులభమేమీ కాదు. కొన్ని వారాల కిందటి వరకూ కర్నాటకలో కాంగ్రెస్ గెలవగలదన్న అభిప్రాయం ఉండింది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ల రాకతో అక్కడ పరిస్థితి మారిపోయింది. ఉత్తరాది నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటున్నారని మొన్నటి వరకూ కాంగ్రెస్ నాయకులు బీజేపీని విమర్శించారు. ఇప్పుడు సోనియా రాకతో కర్నాటకలో కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. బీజేపీ నేరుగా ఆమె జాతీయతపైనే అస్ర్తాలు సంధించింది. దేశానికి విదేశీ సారథ్యం అవసరమా అంటూ ప్రశ్నిస్తోంది. కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న చివరి కోటను కాపాడుకునేందుకు ఆంటోనియో మైనో కర్ణాటకకు వచ్చారని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో సాగుతున్న ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడం కాంగ్రెస్ కు కష్టంగానే మారింది.

కర్నాటకలో సోనియా జాతీయత వివాదం కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఈ అంశం వివిధ ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. సోనియా గాంధీ కర్నాటకకు కొత్త కాదు. గతంలో ఆమె కర్నాటకలోని బళ్ళారి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. అప్పట్లో భారతీయ బేటీ, విదేశీ బహు గా వారి పోటీని అభివర్ణించారు. అప్పట్లో సోనియాగాంధీ అక్కడి నుంచి గెలిచినా....బళ్ళారిలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకోలేదు. అందుకే ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ బీజేపీ మాత్రమే కర్నాటకను అభివృద్ధి చేయగలదన్నారు.

ఎన్నికల ప్రచారంలో మోడీ చేస్తున్న ఎదురుదాడిని తట్టుకోవడం కాంగ్రెస్ వల్ల కావడం లేదు. దాడికి దిగాల్సిన కాంగ్రెస్ కు ఆత్మరక్షణ చేసుకోవడమే సరిపోయింది. మోడీ, అమిత్ షా చేస్తున్న పదునైన విమర్శలకు కాంగ్రెస్ నేతలు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. సైనికాధికారులను అవమానించడం, స్థానిక హిందూ వీరుల చరిత్రను విస్మరించడం, టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించడం ఇలా ఎన్నో అంశాల్లో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. కర్నాటక అభివృద్ధి, రైతుల సంక్షేమం గురించి సోనియాగాంధీ ప్రస్తావించారు. ప్రసంగాలు కడుపు నింపవంటూ విమర్శించారు. చరిత్రను మోడీ తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యలపై ఢిల్లీ కి వెళ్ళిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య కు మోడీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.

లింగాయత్ లకు మైనారిటీ హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో సోనియా గాంధీ సభను వ్యూహాత్మకంగా బీజాపూర్ లో ఏర్పాటు చేశారు. అక్కడ లింగాయత్ వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పాటిల్ ఈ సభ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అయితే, లింగాయత్ లకు మైనారిటీ గుర్తింపు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ బెడిసికొట్టింది. లింగాయత్ లు రెండు వర్గాలుగా చీలిపోయారు. మొత్తం వరుస పరాజయ భారాలతో తల్లడిల్లుతున్న రాహుల్ గాంధీకి తల్లి పర్యటన కాస్తంత ఊరటనిచ్చింది. సభకు హాజరైన జనాన్ని చూసి కాంగ్రెస్ నేతలు సంతోషించారు. సోనియాగాంధీ ప్రచారం కర్నాటకలో కాంగ్రెస్‌కు మేలు చేసిందో లేదో 15వ తేదీన తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories