జగన్‌ విషయంలోనూ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి గేట్‌ వే జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌, ప్రజాసంకల్ప యాత్ర, తూర్పు గోదావరి జిల్లాలోకి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి గేట్‌ వే జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌, ప్రజాసంకల్ప యాత్ర, తూర్పు గోదావరి జిల్లాలోకి నిన్న ప్రవేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా బోర్డర్‌లోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం నుంచి, గోదావరి బ్రిడ్జి మీదుగా, వంలాది కార్యకర్తల నినాదాలు, స్వాగతాల మధ్య రోడ్‌ కం రైలు బ్రిడ్జ్‌పై పాదయాత్ర చేస్తూ, తూర్పులోకి ప్రవేశించారు జగన్.

అడుగడుగునా పూల వర్షం, నిటారుగా నిలబడిన జగన్‌ కటౌట్లు, వైసీపీ కార్యకర్తల హుషారైన నినాదాల నడుమ, చారిత్రాత్మక వంతెనపై నుంచి నడిచివెళ్లారు జగన్. 187వ రోజు పాదయాత్ర, తమ పార్టీ చరిత్రలో నిలిపోతుందని వైసీపీ నేతలు జోష్‌ మీద మాట్లాడుతున్నారు. ఈ బ్రిడ్జ్‌ మీదకు రాగానే, ఇంత జోష్‌ ఎందుకంటే, దీనికి చాలా చరిత్ర ఉంది. రెండు జిల్లాల మధ్య వారధే కాదు, రాష్ట్ర అధికారానికీ వారధిగా కూడా దీన్ని చెప్పుకుంటారు.

గతంలో రోడ్ కం రైలు బ్రిడ్జ్ మీదుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసారు. 2003లో ఇదే బ్రిడ్జ్ పై నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించిన వైఎస్, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. జిల్లాలో నాడున్న 21 నియోజకవర్గాల్లో, ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా సీట్లు సాధించిన పార్టీనే, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ను రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. తిరిగి 2013లో నాటి ప్రతిపక్ష నాయకుడిగా, చంద్రబాబు సైతం చేపట్టిన పాదయాత్ర ఇదే వంతెన మీదుగా జిల్లాలోకి ప్రవేశించింది. తరువాత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు, చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించేలా చేసిందనే సెంటిమెంట్ ఉంది.

ఈ రెండు పాదయాత్రలు చేపట్టిన సమయం కూడా, ఎన్నికల సమయంలోనే కావడం, ప్రస్తుతం మరో ఏడాదిలోపే ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ ప్రజా ప్రస్ధానం, తూర్పులోకి ప్రవేశించడంతో సెంటిమెంట్ కలిసొస్తుందనే భావనలో ఉన్నాయి ఆ పార్టీ శ్రేణులు.

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 15...తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం శాసనసభ స్థానాలు 16...ఉభయ గోదావరి జిల్లాలన్నీ కలిపి, 31 సీట్లు. గత సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 స్థానాల్లో ఒక్క సీటునూ గెలవలేకపోయింది వైసీపీ. మొత్తం క్వీన్‌ స్వీప్ చేసింది టీడీపీ.

అయితే తూర్పు గోదావరి జిల్లాలోని 16 స్థానాల్లో మాత్రం ఐదింటిని కైవసం చేసుకుంది వైసీపీ. జోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, రాజేశ్వరి, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డిలు వైసీపీ తరపున, గెలిచారు. అయితే వీరిలో జోతుల నెహ్రూ, రాజేశ్వరి, సుబ్బారావులు పార్టీ ఫిరాయించి సైకిలెక్కడంతో తూ.గోలో వైసీపీ సంఖ్య రెండుకు పడిపోయింది. అయితే 2019 ఎన్నికల్లో, తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి బలంగా ఫ్యాన్ హవా చూపించాలనుకుంటున్న వైసీపి, జగన్‌ పాదయాత్ర ద్వారా కనీసం 10 స్థానాల్లోనైనా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

దళితులు, కాపు సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకునే విధంగా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్‌ను తయారు చేశారు ఆ పార్టీ నేతలు. జిల్లాలో 16 నియోజకవర్గాల్లో సుమారు 270 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు విశేష ఆదరణ వస్తే మరో పది రోజుల పాటు యాత్రను కొనసాగించే అవకాశం వుందని పార్టీ నేతలు చెప్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 26 రోజులపాటు జగన్ పాదయాత్ర కొనసాగింది. జిల్లాలో చింతలపూడి, పోలవరం మినహా 13నియోజకవర్గాల మీదుగా జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగింది. ఇన్నాళ్లు కాస్త స్ధబ్ధంగా ఉన్న జిల్లా వైసిపిలో జగన్ పాదయాత్ర నూతన ఉత్తేజం తెచ్చింది. 15నియోజకవర్గాలకు గాను పదిహేను స్దానాలు టిడిపికి కట్టబెట్టిన పశ్చిమగోదావరి జిల్లాలో, జగన్ యాత్ర ప్రభావంతో ఫ్యాన్ గాలి స్పీడు పెరిగిందని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓట్లు అధికం. వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్. గత ఎన్నికల్లో ఈ జిల్లాల నుంచి టీడీపీకి అత్యధిక సీట్లు రావడానికి కారణం, పవన్ కల్యాణ్. అదే సామాజికవర్గానికి చెందిన పవన్, టీడీపీకి సపోర్ట్ చేయడంతో భారీగా స్థానాలు దక్కాయన్నది విశ్లేషకుల మాట. ఇప్పుడు జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అటు టీడీపీలో కాపు మంత్రులు చాలామంది ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కీలకమైన కాపు ఓట్లు గంపగుత్తగా పవన్‌కే పడతాయా....టీడీపీకే వెళతాయా....వైసీపీకీ పడతాయా అన్నది ఇప్పుడే తేల్చలేం. కానీ అధికారానికి గేట్‌ వే లాంటి ఉభయ గోదావరి జిల్లాలను కైవసం చేసుకుంటే చాలని అన్ని పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసివస్తుందని వైసీపీ ఆశాభావం. కానీ ఈ వ్యతిరేక ఓట్లు పవన్‌ చీలిస్తే, ఎవరికి ప్రయోజనమన్నది రానున్న కాలమే తేల్చాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories