మనసున్న మారాజులూ... మమ్మల్ని బతికించండి

x
Highlights

కాలేయ వ్యాధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు..ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలకీ వచ్చింది. దీంతో వారి తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు....

కాలేయ వ్యాధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు..ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలకీ వచ్చింది. దీంతో వారి తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు. పిల్లల నరకయాతన చూడలేక, వైద్యం చేయించే స్తోమత లేక తల్లిడిల్లిపోతున్నారు. పిల్లల వైద్యం కోసం అందిన చోటల్లా అప్పులు చేసినా, సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం 13లక్షలు చేసినా.. అవి వైద్య ఖర్చులకే సరిపోయాయి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఒక్కొక్కరికీ 30లక్షలు చొప్పున ముగ్గురికీ 90 లక్షలు అవసరమవుతుందని వైద్యులు చెప్పడంతో దేవుడి మీదే భారం వేశారు ఆ తల్లిదండ్రులు.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఆమర్త వెంకన్న, చిన్నా దంపతులకు ముగ్గురు పిల్లలు. ఏడేళ్ల దుర్గాప్రసాద్, నాలుగేళ్ల లక్ష్మి, మరో ఏడాది కుమార్తె ఉన్నారు. ఈ ముగ్గురికీ ఒకటే వ్యాధి. కడుపు ఉబ్బడం, తిన్నది అరక్కపోవడం, వాంతులు చేసుకోవడం జరుగుతోంది. దీంతో వైద్యులను సంప్రదిస్తే కాలేయ వ్యాధి వచ్చినట్టు తేల్చారు.

ముందుగా కొడుకు దుర్గాప్రసాద్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్తే 25లక్షలు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. దీంతో ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు కనిపించిన వారందరికీ తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆఖరికి స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను కలిసి తమ పిల్లల ప్రాణాలు కాపాడాలని ప్రార్థించారు. స్పందించిన చినరాజప్ప సీఎం సహాయ నిధి నుంచి 10లక్షలు మంజూరు చేయించారు. మరోవైపు ఎంపీ తోట నరసింహం కేంద్ర ప్రభుత్వం నుంచి 3లక్షలు మంజూరు చేయించారు.

అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన 13లక్షలు అందులో ఏ ఒక్కరికీ సరిపోవు. రోజువారి కూలి పనులు చేసుకునే ఆ తల్లిదండ్రులు ఇప్పటికే పిల్లల వైద్యం కోసం అప్పులు చేశారు. రోజంతా కష్టపడి పనిచేసినా వారికి వచ్చేది రెండొందలు మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలను ఎలా కాపాడుకోగలమని రోదిస్తున్నారు. పిల్లలను కళ్లెదుట పెట్టుకుని ఆ తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాతలు సహకరిస్తేనే తమ పిల్లలు బతుకుతారని విలవిల్లాడుతున్నారు.

మరోవైపు కాలేయ మార్పిడి అంటే ఖర్చుతో కూడుకున్నదని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కరుణించి ఆ ముగ్గురు చిన్నారుల వైద్య ఖర్చులను భరిస్తే తప్ప ఆ కడుపుకోత భారం తీరదని వైద్యులు చెబుతున్నారు. అప్పటికీ కుమారుడికి కాలేయ దానం చేసి బతికించుకోవాలని తల్లి ఆతృత పడుతుందని, పూర్తి స్థాయిలో డబ్బులుంటేనే ఆపరేషన్ సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వంతోపాటు దయగల దాతలు ఆదుకుని తమ పిల్లలను బతికించాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories