మా ప్రేమ‌ను బ్ర‌తికించండి

x
Highlights

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి కాపురం చేయాలనుకున్నారు. ఇంట్లో వారిని ఒప్పించి ఒకటవ్వాలనుకొని తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అమ్మాయి...

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి కాపురం చేయాలనుకున్నారు. ఇంట్లో వారిని ఒప్పించి ఒకటవ్వాలనుకొని తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అనడంతో గుట్టుగా గుళ్లో పెళ్లి చేసుకున్నారు. దీన్ని పరువు తక్కువగా భావించిన పిల్ల తరఫువాళ్లు తాము మారినట్టు మాయమాటలు చెప్పి రప్పించారు. అబ్బాయిని నడిరోడ్డు మీద చితకబాది అమ్మాయిని దాచేశారు. చావుదెబ్బలు తిన్న ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన భార్యను తన దగ్గరకు చేర్చాలని వేడుకుంటున్నాడు.

కరీంనగర్ జిల్లా గంగాధరమండలం ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన నేరేళ్ల నవీన్... గోపాల్ రావు పల్లికి చెందిన జ్యోతి ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ లో కలుసుకున్నారు. పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇళ్లల్లో ప్రేమ విషయం ధైర్యంగా చెప్పారు. అబ్బాయి నిర్ణయాన్ని అతని తల్లిదండ్రులు ఆమోదించారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు సమేమిరా అన్నారు. జ్యోతిని ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. అక్కడి నుంచి ఎలాగో తప్పించుకున్న జ్యోతి.. వెంటనే పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. ఇద్దరూ వరంగల్ రహదారిలోని ఓ దేవాలయంలో ఒక్కటయ్యారు.

అమ్మాయి తరపు బంధువులు తమ కోసం వెదుకుతున్నారని తెలుసుకున్న కొత్త జంట.. ముంబైకి పారిపోయి ఫ్రెండ్స్ దగ్గర తలదాచుకున్నారు. కొంతమంది నవీన్ కు ఫోన్ చేసి.. గ్రామంలోకి వస్తే చంపేస్తామని హెచ్చరించారు. పెళ్లి చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ జంటను నమ్మించి ఇంటికి పిలిపించారు. జ్యోతి తల్లి అనారోగ్యం పాలైందని.. ఐసీయూలో చేర్చారని ఫోన్ చేశారు. నిజమని నమ్మిన జ్యోతి, నవీన్ లు...కరీంనగర్ కు వచ్చారు. ప్రేమజంటను విడగొట్టేందుకు పథకం పన్నిన అమ్మాయి బంధువులు ఆసుపత్రిలోనే నవీన్ పై దాడికి తెగబడ్డారు.

దాడిని అడ్డుకోబోయిన నవీన్ స్నేహితుడు సతీష్ పైన దాడి చేశారు. జ్యోతి బంధువుల దాడిలో సతీష్ కు చేయి విరిగిపోయింది. నవీన్ ను బలవంతంగా నాంపల్లి శివారుకు తీసుకెళ్లి స్పృహ తప్పేలా చితకబాదారు. తీవ్రంగా గాయపడిన నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్యను బలవంతంగా లాక్కేళ్లారని నవీన్ కన్నీరుమున్నీరు అవుతున్నాడు. అమాయకుడైన తన కొడుకుపై దాడి చేసి.. గొడ్డును బాదినట్టు బాదారని నవీన్ తల్లి కన్నీరు మున్నీరవుతుంది. ప్రేమించి పెళ్లాడిన పాపానికి ప్రాణాలు తీస్తారా అంటూ నిలదీస్తుంది. దాడి గురించి కరీంనగర్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డవారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మేజర్లయిన ప్రేమికులను కలపాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories