వాళ్లు మృగాళ్లు.. మనుషుల రూపంలో ఉన్న కామపిశాచులు.. అమ్మాయి, మహిళ ఒంటరిగా కనబడితే చాలూ వదలిపెట్టరు.. అటు వైపు వచ్చే ప్రేమ జంటలు.. ప్రకృతి అందాలను...
వాళ్లు మృగాళ్లు.. మనుషుల రూపంలో ఉన్న కామపిశాచులు.. అమ్మాయి, మహిళ ఒంటరిగా కనబడితే చాలూ వదలిపెట్టరు.. అటు వైపు వచ్చే ప్రేమ జంటలు.. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన వారిపై మూకుమ్మడిగా దాడి చేయడం.. యువతులపై లైంగికదాడులకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. ఎప్పుడూ ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్న వీరు ఇప్పటికే పదుల సంఖ్యలో అఘాయిత్యాలకు పాల్పడ్డారు. విషయం బయటికి తెలిస్తే పరువుపోతుందనే భయంతో బాధితులు బయట చెప్పుకోలేకపోతున్నారు. దీన్ని అదునుగా చేసుకుని ఈ గ్యాంగ్ రెండేళ్లుగా అడ్డూఅదుపులేకుండా అకృత్యాలకు పాల్పడుతోంది. ప్రకాశం జిల్లా కేంద్రం సమీపంలో వరుసగా జరిగిన ఈ ఘటనలు వేలెత్తిచూపుతున్నాయి.
రెండేళ్లుగా వారు సాగించిన కృత్యాలు అన్నీ ఇన్నీ కావు.. 13 ఏళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల ముదుసలి వరకు వారి వాళ్ల కంటపడితే పాపమే. ప్రశాంతత కోసం దూరంగా వున్న మహిళలు,యువతుల నుంచి పొలాల్లో పని చేసుకునే మహిళల వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు.. ఆ నరరూప రాక్షసులు. చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వారిపట్ల పైశాచికంగా వ్యవహరించారు.. ఎక్కడా పోలీసులకు దొరక్కుండా రెండేళ్ళుగా వారు సాగించిన అరాచకాలు ఎన్నో...చివరకు ఓ ఏఎస్సై చొరవతో బయటపడ్డాయి.
ఎదుట వారి బలహీనతే వీరి ధైర్యం..నిందితులు పదిమందీ చీమకుర్తివాసులు. సంచారజాతికి చెందిన వీరు నలుగురైదుగురు కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై షికారుకు బయలుదేరేవారు. చీమకుర్తి ప్రాంతం నుంచి సాగర్ కాలువకట్టపై వీరి ప్రయాణం సాగేది. మార్గం మధ్యలో వీరికి జంటలు తారసపడేవి. ప్రేమజంటలతో పాటు ఏకాంతగా గడిపేందుకు వచ్చే వారు సాగర్ కాలువల వెంబడి ప్రాంతాల్లో కనిపించేవారు. ఈ తరహా సంబంధాల్లో సాధారణంగానే ఎదుటి వ్యక్తులను చూడగానే కాసింత జంకు కలుగుతుంది. తమ సంబంధం బహిర్గతం అవుతుందేమోననే ఆందోళన, భయం సహజం. ఈ బలహీనతే నిందితులకు బలంగా మారింది. ఏం చేసినా పర్వాలేదనే ధైర్యంతో ఈ ముఠా సుమారు రెండేళ్లుగా ఇష్టారాజ్యంగా పేట్రేగిపోయింది. కాలువ కట్టపై సంచరిస్తూ వరుసగా అత్యాచారాలూ, దోపిడీలకు తెగబడింది.
ఈ ముఠా నేరానికి పాల్పడే పద్ధతి సైతం భీతిగొల్పుతుంది. ఏదైనా జంట తమ కంటపడగానే అక్కడ వాలిపోతారు. పురుషుడిపై కర్రలు, బండరాళ్లతో విచక్షణరహితంగా విరుచుకుపడతారు. ఇష్టారాజ్యంగా బాదేస్తారు. ఆ దెబ్బలకు తాళలేక ఇక మరణం తప్పదనే పరిస్థితిని కల్పించి అనంతరం అతడి ముందే ఆ మహిళలపై సామూహికంగా అత్యాచారం చేస్తారు. అనంతరం వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు ,బైక్ లను లాక్కుని ఉడాయిస్తారు. అయితే ఈ ముఠా చేసే నేరాలన్నీ పట్టపగలే...ఈ తరహాలో ఇప్పటిదాకా వీరు 30కి పైగా నేరాలకు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల్లోపే వీరు నేరాలకు పాల్పడేవారు. చీమకుర్తి నుంచి సంతనూతలపాడు మీదుగా మంగమూరు డొంక, సర్వేరెడ్డిపాలెం రోడ్డు కొణిజేడు, యరజర్ల, కొప్పోలు మార్గాల్లో వీరు అకృత్యాలకు పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లాలోని కొణిజేడు, యరజర్ల సమీపంలోని కొండప్రాంతాల్లో పలువురిపై దాడి చేసి అత్యాచారాలకు పాల్పడినట్లు తెలిసింది. బాధితుల్లో కళాశాల విద్యార్థులతో పాటు భార్యాభర్తలు సైతం ఉన్నారు. తాము భార్యాభర్తలమని కాళ్లావేళ్లా పడినా కనికరించని ఈ నరరూప రాక్షసులు భర్తలపై విచక్షణరహితంగా కర్రలతో దాడిచేసి కొట్టి తాళ్లతో కట్టేసి వారి ఎదుటే భార్యలను బలాత్కరించారు. మంగమూరు పరిసరాల్లో ఒక వృద్ధ జంటపైనా ఈ తరహాలో దాడి చేసిన నిందితులు 60 ఏళ్ల వయసున్న వృద్ధురాలిపైనా పైశాచికంగా అత్యాచారానికి తెగబడ్డారు. ఒంగోలు నగరానికి తూర్పువైపున జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్న సమయంలో ఆ ప్రాంతానికి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థుల జంటను నిర్బంధించి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నరరూప రాక్షసుల ముఠా బారిన పడిన బాధితులు పరువు పోతుందని జడిసి ఈ రాక్షసకాండపై పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వలేదు. బాధితుల్లో ఇద్దరు మాత్రం తమపై కొందరు యువకుల ముఠా దాడి చేసి తమ వద్ద బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు దోచుకున్నట్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.
సుమారు ఎనిమిది నెలల క్రితం కొణిజేడు వద్ద జరిగిన నేరంలో ఒక జంట టంగుటూరు పోలీసులకు, నెలన్నర క్రితం మంగమూరురోడ్డులో వీరి బారిన పడిన జంట తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల్లోనూ సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించలేదు. వీటిని కేవలం దోపిడీలుగా భావించిన పోలీసులు విచారణ జరుపుతామంటూ పక్కన పడేసినట్లు తెలిసింది. ఈ ఘోరాలపై పోలీసులు పెద్దగా దృష్టి సారించకపోవటంతో ఈ ముఠా ఇష్టారాజ్యంగా రెచ్చిపోయింది. చివరకు ఒక బాధితుడు ఈ ఘోరాలను ఒక ఏఎస్సై దృష్టికి తీసుకెళ్లటంతో ఈ బాగోతం వెలుగు చూసింది. నేర పరిశోధనలో పట్టున్న ఈ ఏఎస్సై తనకు వున్న పరిచయాలతో ముఠాపై దృష్టి సారించి కొందరిని అదుపులోకి తీసుకుని విచారించటంతో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రెండేళ్లుగా సదరు నరరూప రాక్షసులు స్వైరవిహారం చేశారు. శివారు ప్రాంతాల్లో జంటలే లక్ష్యంగా చెలరేగిపోయారు. 30 మందికి పైగా మహిళలు, యువతులు, విద్యార్థినులపై లైంగిక దాడి చేశారు. వీటిలో ఏ ఒక్కటీ పోలీసుల దృష్టికి రాలేదు.
శివారు ప్రాంతాల్లో ముఠాలుగా రాక్షసులు సంచరిస్తున్నా ఏనాడూ వారు పోలీసుల కంటబడలేదు. దీన్ని బట్టే శివారు ప్రాంతాల్లో పోలీసు నిఘా, గస్తీ ఎంత పటిష్ఠంగా ఉందో అర్థమవుతోంది. పోలీసింగ్ ప్రధాన వీధులకు మాత్రమే పరిమితమవుతుందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. రెండు ఘటనల్లో దోపిడీ, దాడి జరిగినట్లు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం కనీస స్పందన లేకుండా ఫిర్యాదులను పక్కన పెట్టడమే విచారకరమంటున్నారు పలువురు మహిళా నేతలు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire