ఫిరంగిపురంలో ఘోర ప్రమాదం..ఐదుగురి మృతి

ఫిరంగిపురంలో ఘోర ప్రమాదం..ఐదుగురి మృతి
x
Highlights

మంచు మాటున దూసుకొచ్చిన మృత్యుశకటం.. ఓ స్కూలు ఆటోను తునాతునకలు చేసింది. మరికాసేపటిలో బడికి చేరాల్సిన విద్యార్ధులు అనంతలోకాలకు వెళ్లారు. ఈ దారుణ...

మంచు మాటున దూసుకొచ్చిన మృత్యుశకటం.. ఓ స్కూలు ఆటోను తునాతునకలు చేసింది. మరికాసేపటిలో బడికి చేరాల్సిన విద్యార్ధులు అనంతలోకాలకు వెళ్లారు. ఈ దారుణ ప్రమాదంలో గాయపడిన పలువురు విద్యార్ధులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఉదయం కమ్మిన పొగమంచు తొలిగిపోకముందే రోడ్డుప్రమాద వార్త విషాదంలో ముంచింది. తమ చిన్నారులకు పుస్తకాల సంచి, టిఫిన్ బాక్స్ అప్పజెప్పి స్కూల్ బస్సు ఎక్కించి బైబై చెప్పి సాగనంపిన తల్లిదండ్రులు కొద్దిసేపటికే శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెను పిండేసిన ఈ ఘోరమైన ఘటన గుంటూరు జిల్లాల్లో జరిగింది.

వేమవరం గ్రామం నుంచి పేరేచర్లలోని ఇంటెల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు వెళ్లేందుకు కొంత మంది విద్యార్థులు ఆటో ఎక్కారు. పొగ మంచు రోడ్డుపై దూసుకుపోతున్న ఆటోను ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు నలుగురు విద్యార్ధులు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో మృతదేహాలు, స్కూల్‌ పుస్తకాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన పలువురికి కలిచివేసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పొన్నూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నరసరావుపేటకు తరలించగా ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు విద్యార్ధులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు అప్పటిదాక కళ్లముందు కనిపించిన బిడ్డలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న జిల్లా మంత్రులు బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories