logo
జాతీయం

సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న రాహుల్ గాంధీ

సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న రాహుల్ గాంధీ
X
Highlights

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహల్‌ గాంధీ పార్టీలో తన మార్క్‌ను చూపిస్తున్నారు. సోనియా గాంధీ నుంచి అధ్యక్ష పదవి...

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహల్‌ గాంధీ పార్టీలో తన మార్క్‌ను చూపిస్తున్నారు. సోనియా గాంధీ నుంచి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పార్టీపై పట్టు సాధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోనియా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని రద్దు చేసి పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు సానుకూల ఫలితాలు రావడంతో రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని రద్దు చేశారు. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రులు పి చిదంబరం, గులాం నబీ ఆజాద్, జనార్దన్ ద్వివేదీ ఉన్నారు.

పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన అంశాలను స్టీరింగ్ కమిటీ నిర్ణయించనుంది. వచ్చే నెలలో కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయ్. ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ....2019 సార్వత్రిక ఎన్నికలకు టీంను తయారు చేసుకునే అవకాశాలున్నాయ్. తన టీంలో పార్టీ సీనియర్లు, గాంధీ ఫ్యామిలీకి లాయల్టీగా ఉన్న వారితో పాటు యువ నాయకత్వానికి పెద్ద పీట వేసే అవకాశాలున్నాయ్. గుజరాత్‌ ఫలితాలతో పాటు రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు సిట్టింగ్‌ ఎంపీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీలో జోష్‌‌ను పెంచాయ్.

త్వరలోనే కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన టీం నియామకంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో హర్దిక్‌ పటేల్‌, అల్పేశ్‌ ఠాకూర్, జిగ్నేశ్‌ మేవానీలను కలుపుకొని వెళ్లడంతో బీజీపీ వంద సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఇదే వ్యూహాన్ని కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తన టీంలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ యువ నాయకత్వానికి పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. లోక్‌నీతి సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ నిర్వహించిన సర్వే‌లో... దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి ప్రజాదరణ పెరుగుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా...టీం ఏర్పాటు చేసి తన మార్క్‌ను చూపించాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారు.

Next Story