సిటీ పోలీస్‌ సక్సెస్‌...చెడ్డిగ్యాంగ్ చిక్కింది

x
Highlights

ఆరు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. ఈ ముఠాలో ముగ్గుర్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ద్వారా...

ఆరు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న చెడ్డీగ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. ఈ ముఠాలో ముగ్గుర్ని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి ద్వారా మిగిలిన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం ముంబై పోలీసులకు చిక్కిన ఈ చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు రాచకొండ పోలీసులకు పట్టుబడటం సంచలనంగా మారింది.

చెడ్డీగ్యాంగ్ అలియాస్ కచ్చాబనియన్ గ్యాంగ్. ఈ పేరు వింటే చాలు తెలుగురాష్ట్రాల ప్రజలు హడలిపోతారు. చెడ్డీలపై అర్ధనగ్నంగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడటం ఈ గ్యాంగ్ స్టైల్‌. తమ దోపిడీలకు అడ్డొస్తే క్షణంలో అంతం చేయడం పోలీసులకు చిక్కకుండా తప్పించుకోడం వీరికి వెన్నతో పెట్టిన విద్య శివారు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా ఉనికి నాలుగు నెలల క్రితం నగరంలోనూ బయటపడింది. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజీలో వీరి దృశ్యాలు నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శివారు ప్రాంతాలతో పాటు అనుమానం ఉన్న ప్రాంతాల్లో గస్తీ పెంచారు. దీంతో చెడ్డీ గ్యాంగ్ నగరం వదిలి వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు జరిపి ముఠా గుజరాత్‌లో సంచరిస్తున్నట్టు గుర్తించారు.

గుజరాత్‌లో దాదాపు నెల పాటు తిష్టవేసిన పోలీసులు ఎట్టకేలకు చెడ్డీగ్యాంగును పట్టుకోవటంలో సక్సెస్ అయ్యారు. దామోద్‌లో ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. వీరిని నగరానికి తరలిస్తున్న పోలీసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంచరించిన వారి ఫోటోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 20 మంది సభ్యులున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు ఈ దిశగానే విచారణ ముమ్మరం చేశారు. 1999లో తమ కార్యకలపాలను ప్రారంభించిన చెడ్డీగ్యాంగు దాదాపు ఆరు రాష్ట్రాల్లో అలజడి సృష్టిస్తోంది.ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి ముంబయి బోరివెల్లిలో 2016 ఫిబ్రవరి 18 న పోలీసులకు చిక్కింది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్ధాయిలో హల్‌చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్‌ తాజా పరిణామాలతో మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో వీరిపై నమోదైన కేసులను వెలికి తీసి పూర్తి స్ధాయిలో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories