నిజామాబాద్ లో వారసుల జోరు

x
Highlights

రాజకీయ చైతన్యం ఉన్న ఆ జిల్లాలో సీనియర్ నేతల పుత్రరత్నాలు. రాజకీయ వారసులుగా తెరపైకొస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కొందరు నేతల కుమారులు...

రాజకీయ చైతన్యం ఉన్న ఆ జిల్లాలో సీనియర్ నేతల పుత్రరత్నాలు. రాజకీయ వారసులుగా తెరపైకొస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కొందరు నేతల కుమారులు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తండ్రుల స్ధానంలో తామే పోటీలో ఉంటామనే సంకేతాలిస్తూ క్యాడర్ ను సిద్దం చేస్తున్నారు. అధికార పార్టీలో ఒకరిద్దరు ముఖ్యనేతలు. తమ స్ధానంలో వారసులను పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. సదరు నేతల కుమారులు సైతం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొంటున్నారు.

ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలతో తెలంగాణలో రాజకీయనేతలు జోరు పెంచుతున్నారు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే ఉద్దేశంలో ఉన్నారు. పైగా ఈసారి ఎన్నికల్లో సీనియర్లను పార్లమెంటు కు పంపుతానని కేసీఆర్ చూచాయగా చెబుతుండటంతో తమ స్థానంలో తమ వారసులను రంగంలోకి దించాలని సీనియర్లు నిర్ణయించుకుంటున్నారు. వారి సీటుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. అధికార పార్టీలో కీలక నేతగా ఉన్న రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి రాబోయే ఎన్నికల్లో తన వారసులను పోటీలో నిలిపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి తిరుగులేని నేతగా ఎదిగిన పోచారం ఇక తన రాజకీయ వారసుల అరంగేట్రానికి రెడీ అవుతున్నారు. చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డిని బాన్సువాడ బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. పోచారం జహీర్ బాద్ ఎంపీగా లేదా బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీకి సిద్దం అవుతున్నారు. పార్టీ అధిష్ఠానం జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే బాన్సువాడ నుంచి తన వారసుల్లో ఒకరిని పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

పోచారం రెండో కుమారుడు సురేందర్ రెడ్డి, చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి చెరో మూడు మండలాల్లో కార్యకర్తల మంచి చెడులు చూస్తున్నారు. దేశాయిపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా ఉన్న భాస్కర్ రెడ్డి ఇటీవల తన పుట్టిన రోజును బాన్సువాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో ఘనంగా నిర్వహించి రాబోయే ఎన్నికల్లో పోటీకి సై అంటూ సంకేతాలిచ్చారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి భాస్కర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా జర్చ జరుగుతోంది అందుకు అనుగుణంగా ఆయన పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతగా చేస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు.

అధికార పార్టీకి చెందిన మరో నేత కుమారుడు సైతం పోటీకి సై అంటున్నాడు. ప్రస్తుతం రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు బాజిరెడ్డి జగన్ ను పోటీలో నిలిపే అవకాశాలున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి జగన్ తండ్రితో పాటు చురుగ్గా పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లోను పాల్గొంటున్నారు. బిజీ షెడ్యూల్ వల్ల తండ్రి వెళ్లలేని గ్రామాలకు సైతం కుమారుడు వెళ్లొస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నట్లు పార్టీ లో జోరుగా చర్చ జరుగుతోంది. బాజిరెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకునేందుకు అధిష్ఠానం సైతం సన్నహాలు చేస్తోంది.

సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్దానంపై కన్నేసిన అరవింద్ చాపకింద నీరులా కార్యక్రమాలు చేస్తూ తండ్రి పలుకుబడితో పాటు తన పట్టును నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. సంజయ్ సైతం వరంగల్ అర్బన్ నియోజకవర్గం పై కన్నేసి ఉంచారు. ఐతే ఊహించని విధంగా డి.ఎస్. అధికార పార్టీకి దూరంగా ఉండటంతో సంజయ్ పోటీపై సందిగ్ధత నెలకొంది. అరవింద్ మాత్రం పోటీకి సై అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్ధిగా నియోజకవర్గాన్ని చుట్టొచ్చారు.

అధికార పార్టీలో వారసుల సందడి నెలకొనడం.. ఆసక్తికరంగా మారింది. సీనియర్ ప్రజా ప్రతినిధులు తమ వారసులను ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపితే క్యాడర్ ఏ మేరకు సహకరిస్తారన్న చర్చ జరుగుతోంది. వారసులను తెరపైకి తెస్తే ఏ మేరకు కలిసొస్తుందనే అంశంపై రానున్న రోజుల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories