పెనుమాక దొంగ.. కోడలే

పెనుమాక దొంగ.. కోడలే
x
Highlights

గుంటూరు జిల్లా పెనుమాకలో సంచలనం సృష్టించిన చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగలే ఇంటికి కన్నం వేసేందుకు కుట్ర పన్నారు. భూమి అమ్మిన...

గుంటూరు జిల్లా పెనుమాకలో సంచలనం సృష్టించిన చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు ఛేదించారు. ఇంటి దొంగలే ఇంటికి కన్నం వేసేందుకు కుట్ర పన్నారు. భూమి అమ్మిన డబ్బులు తనకు దక్కకపోవడంతో కోడలే ఈ దొంగతనానికి పథకం పన్నింది. అత్తపై దాడి చేయించి, వింత నాటకం ఆడింది. తమదైన శైలిలో కేసును విచారించిన పోలీసులు డ్రామా కోడలితో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 55 లక్షల 20 వేల నగదు, 210 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో వేమారెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వేమారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు వేమారెడ్డి భార్య కమలు, కోడలు శివపార్వతిపై దాడి చేశారు. బీరువా తాళాలు కమలమ్మ వద్ద తీసుకొని బీరువాలోని 55 లక్షల 20 వేల నగదు, 2 తులాల10 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించారు. పెనుమాకలో ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దొంగతనం కలకలం సృష్టించింది. తమ ఇంట్లో జరిగిన చోరీ గురించి అత్తాకోడళ్లు కమల, శివపార్వతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. అత్తాకోడళ్లు కమల, శివపార్వతిని విచారించారు. డబ్బులు చోరీ విషయం తనకు తెలియదని, రెండు తులాల పది గ్రాముల బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు శివపార్వతి తెలిపింది.

పెనుమాక చోరీపై పది టీమ్ లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల్లో బైక్ ల పై పారిపోతున్న దొంగల దృశ్యాలను పరిశీలించారు. మరోవైపు ఇంటి దొంగల గురించి పోలీసులు ఆరా తీశారు. పెనుమాకలో వేమారెడ్డి తన రెండు ఎకరాల పొలం విక్రయించగా వచ్చిన 2 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం. అత్తాకోడలు కమల, శివపార్వతిల విభేదాలు ఉన్నాయి. పొలం విక్రయించిన వచ్చిన డబ్బుల్లో తనకు ఒక్క రూపాయి దక్కలేదని శివపార్వతి తెగబాధపడింది. ఇంట్లో ఉన్న డబ్బులు ఎలాగైనా తన సొంతం కావాలని శివపార్వతి ప్లాన్ వేసింది. తన సోదరి లక్ష్మి ప్రసన్నతోపాటు సీతారామిరెడ్డి, వెంకటరెడ్డి, చెరువు రాజు, మల్లికార్జున, గోపిచంద్, సాయితో కలసి కుట్ర చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం చేయాలని పథకం పన్నారు.

ప్లాన్ ప్రకారం మల్లికార్జున రావు, సాయి, గోపిచంద్రలు వేమారెడ్డికి ఇంట్లోకి వెళ్లి కమలపై దాడిచేసి తాళాలు లాక్కున్నారు. శివపార్వతిపై దాడిచేసినట్టు నటించారు. డబ్బులు ఎక్కడ ఉన్నదీ శివపార్వతి సైగల ద్వారా తెలిపింది. వెంటనే బీరువా తాళాలు తీసుకొని నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నారు. వాహనాలు మారుతూ ఉడాయించారు. గుంటూరులో చెరువురాజు ఇంట్లో డబ్బుల సంచి ఉంచి అందులో 22 లక్షల 80 వేల రూపాయలు సాయికి ఇచ్చి అక్కడి నుంచి పంపేశారు. మిగిలిన డబ్బులు అందరూ కలసి పంచుకునే ప్రయత్నం చేశారు.

కేసు దర్యాప్తు లో భాగంగా ఇంటి దొంగలే చోరీలో కీలక సూత్రధారి అని నిర్ధారణకు వచ్చారు. శివపార్వతి తీరుపై నిఘా ఉంచిన పోలీసులు ఆమె ప్రధాన నిందితురాలుగా నిర్ధారణకు వచ్చారు. తమదైన శైలిలో విచారిస్తే శివపార్వతి చోరీ గుట్టు విప్పింది. ఈ భారీ చోరీని పోలీసులు 24 గంటల్లో చేధించారు. ఈ చోరీకి రెండు మూడు రోజుల ముందు శివపార్వతి ఇంట్లోని 2 తులాల పది గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టింది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. డబ్బుల చోరీ విషయం తనకు తెలియదని బంగారం చోరీ అయినట్లు శివపార్వతి చెప్పడంతో ఆమెపై పోలీసులకు అనుమానాలు బలపడ్డాయి. దొంగతనం జరిగిన తర్వాతఇంట్లోని వస్తువులు చిందరవందరం పాడేసిన శివపార్వతి పెన్నుతో చేతికి గాయం చేసుకుని నాటకం ఆడింది.

పెనుమాకలో జరిగిన చోరీ కేసులో వేమిరెడ్డి కోడలు శివపార్వతి, ఆమె సోదరితో సహా ఏడుగురు నిందితులను పోలీసులను అరెస్టు చేశారు. 55 లక్షల 20 వేల నగదు, 2 తులాల 10 గ్రాముల బంగారు, ఓ కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సాయి అనే నిందితుడి కోసం గాలిస్తున్నారు. సొంతింట్లోనే కన్నం వేసేందుకు పథకం పన్నిన శివపార్వతి ఉదంతం పోలీసులకు షాక్ కలిగించగా, ఈ చోరీ కేసులో ఓ పోలీసు కానిస్టేబుల్ కుమారుడు ఉండడం విస్మయం కలిగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories