ఏపీని వణికిస్తోన్న పెథాయ్...ఇవాళ కాకినాడ-తుని మధ్య తీరం దాటే అవకాశం..

ఏపీని వణికిస్తోన్న పెథాయ్...ఇవాళ కాకినాడ-తుని మధ్య తీరం దాటే అవకాశం..
x
Highlights

పెథాయ్‌ తుపాను తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత.. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కాకినాడ పరిసరాల్లో...

పెథాయ్‌ తుపాను తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత.. ఉత్తర వాయవ్య దిశగా గంటకు 28 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కాకినాడ పరిసరాల్లో తుపానుగా బలహీనపడి తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. అయితే, ఆర్టీజీఎస్‌ మాత్రం కాకినాడ–తునిల మధ్య తీరం దాటవచ్చని వెల్లడించింది. మరోవైపు అమెరికా నిర్వహిస్తున్న జాయింట్‌ టైఫూన్‌ వార్నింగ్‌ సెంటర్‌ విశాఖ సమీపంలో తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తోంది. ఇలా మూడు సంస్థల వేర్వేరు అంచనాలతో పెథాయ్‌ ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై గందరగోళం నెలకొంది.

తుపాను తీరం దాటే సమయంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఐఎండీ సూచించింది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, పాతఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, రోడ్లకు గండు పడవచ్చని, వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటాయని హెచ్చరించింది. కోస్తాంధ్రలో ఒకట్రెండు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. హుద్‌హుద్, తిత్లీ తుపాన్లు ముందుగా తాము పేర్కొన్న చోటే తీరం దాటాయని ఐఎండీ చెబుతోంది.

పెనుతుపానుగా మారిన ‘పెథాయ్‌’ తీరానికి చేరువ అవుతుండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను సమాయత్తం చేసింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది. అక్కడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలతో పాటు విద్యుత్తు శాఖకు చెందిన 2వేల మందిని మోహరించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు వంద కిలోమీటర్లకు చేరడంతో పాటు.. 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడి ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు స్పష్టంచేసింది.

తూర్పు గోదావరి జిల్లాలో 17 మండలాలపై పెథాయ్‌ విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలో వర్షం ప్రారంభమైంది. సముద్రం భీకరంగా మారింది. అలలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున కెరటాలు దూసుకొస్తుండటంతో తీరం కోతకు గురవుతోంది. కాకినాడ–తుని బీచ్‌ రోడ్డుపై కెరటాలు వచ్చిపడుతున్నాయి. రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో బీచ్‌ రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుపాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని 295 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 283 సహాయ శిబిరాలు, 61 తుపాను షెల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీ కోసం సుమారు 16వందల మంది సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

తుపాను నేడు తీరం దాటనున్న నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖపట్నం, భీమిలి, పెదగంట్యాడ, గాజువాక తదితర ఎనిమిది తీర మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. సహాయక దళాలను సిద్ధం చేసింది. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లా బోగాపురం మండలం కోయ్యపేడలో ఈదురగాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి. తిత్లీ తుపాను వల్ల దారుణంగా నష్టపోయి ఇంకా కోలుకోని శ్రీకాకుళం జిల్లా వాసులు.. పెథాయ్‌ తుపానుతో కలవరపడుతున్నారు. కోసిన, కోత దశకు వచ్చిన వరి పంట పాడవుతుందని ఉభయగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ గాలులు వీస్తే కొబ్బరి తోటలు పడిపోతాయనే భయం కోనసీమ రైతులను వెంటాడుతోంది.

తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వాకాడు, విడవలూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. 13 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. సముద్రంలో వేటకు వెళ్లిన 200 పడవలను వెనక్కి రప్పించారు. పెథాయ్‌ వల్ల ఎలాంటి విపత్తు సంభవించినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

పెథాయ్‌ తుపాను పశ్చిమ గోదావరి జిల్లావాసులను వణికిస్తోంది. రాత్రి గంటల నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి. తీరంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, యలమంచిలి, పాలకొల్లు మండలాల్లో తుపాను ప్రభావం చూపుతోంది. 26 పునవాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆచంట, పోడూరు, పెనుగొండ మండలాల్లో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో విద్యుత్‌ తీగలు తెగాయి. ఫలితంగా రెండు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

కృష్ణాజిల్లాలోని తీర మండలాలైన మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృత్తివెన్నులో పెథాయ్‌ ప్రభావం కనిపించింది. నిన్నంతా తేలికపాటి వర్షాలు పడ్డాయి. జిల్లాలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకాశం మేఘావృతమైంది. చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గిలకలదిన్నె తీరానికి చేరారు. తీర ప్రాంతాల్లో 64 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కోడూరు మండలం పాలకాయతిప్పలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలు ఆకలితో అలమటించారు. 60 మంది ఉన్న కేంద్రంలో కేవలం 10 కిలోల బియ్యం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. మంగినపూడి బీచ్‌లో అలల ఉధృతి పెరిగింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి నేలకొరిగింది.

పెథాయ్‌ ప్రభావంతో గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పాటు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గుంటూరు జిల్లాపై తుపాను ప్రభావం అంతగా ఉండదని, తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారు. పశ్చిమ డెల్టాలో వరి పంట, పల్నాడు ప్రాంతంలో మిరప, పత్తి చేతికొచ్చే దశలో ఉన్నాయి. తుపాను వల్ల వర్షం ఎక్కువ కురిస్తే కోత దశలో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రకాశం జిల్లాలో పెథాయ్‌ తుపాను ఇప్పటికే ప్రభావం మొదలైంది. చలిగాలుల తీవ్రతతోపాటు జిల్లా అంతటా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. తీర ప్రాంతంలో 10 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. అలలు ఎగసి పడుతున్నాయి. ఇవాళ జిల్లాలో అతిభారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశించారు. తుపాను సమాచారం కోసం ఒంగోలు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే 14 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories