ఆసక్తికరంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు

ఆసక్తికరంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
x
Highlights

రాజకీయ చైతన్యం వెల్లివిరిసే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత ఎన్నికలు మూడు ముక్కలాటగా ముగిసిపోగా ఈసారి అది బహుముఖ పోటీగా మారే...

రాజకీయ చైతన్యం వెల్లివిరిసే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత ఎన్నికలు మూడు ముక్కలాటగా ముగిసిపోగా ఈసారి అది బహుముఖ పోటీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొట్టమొదటి సారి జనసేనను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపుతున్న పవన్ కళ్యాణ్ వ్యూహాలు అంతుబట్టడం లేదు. మొన్నటిదాకా మిత్రులని అంటకాగిన వారిపైనే పవన్ కత్తులు దూసి వామపక్షాలవైపు మొగ్గతుండటం చూస్తున్నవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పొత్తులు చిగురించడం ఖాయమని అంటున్నారు.

సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ ఏపీలో మాత్రం పొలిటికల్ టెంపరేచర్ 104కి చేరింది. ఆరోపణలు, విమర్శలు, ఇష్యూ దొరికితే విమర్శలతో విరుచుకు పడిపోవడం జరిగిపోతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హాదా రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తోంది. పూర్తి కాలం రాజకీయ నాయకుడిగా అవతారమెత్తిన జనసేనాని.. పవన్ కళ్యాణ్, వ్యూహాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి మిత్రుడిగా ఉన్న పవన్ ఇప్పుడు ఆ పార్టీలంటేనే మండిపడుతున్నారు. అధికార టీడీపీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపైనా నిప్పులు చెరుగుతున్నారు. కేంద్రంలో అధికార బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల జనసేనాని తీరు చూస్తుంటే ఆయన వామపక్షాల వైపు మొగ్గుతున్నట్టు సూచనలున్నాయి. మొదటి నుంచి తనలో లెఫ్ట్ ఐడియాలజీ ఎక్కువని చెప్పుకొనే పవన్ అందుకే ఎర్రన్నలను దగ్గరకు తీస్తున్నారా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అంటే రాజకీయ పరిశీలకులు పలు విశ్లేషణలు చెబుతున్నారు. మొదటి నుంచి లెఫ్ట్ పార్టీలు ప్రజాసమస్యలపై పోరాటాలకు, పునాదుల నుంచి బలమైన కేడర్‌కు మారుపేరుగా నిలిచాయి. ఓట్లు, సీట్లు సంగతి పక్కన పెడితే సిద్ధాంతపరంగా పోరాడతాయన్న మంచిపేరును జనంలో సంపాదించాయి. బలమైన కేడర్ ఉన్నా నిండుగా నిధులు, చరిస్మా ఉన్న నేతలు లేకపోవడంతో ఏదైనా పార్టీకి మద్దతివ్వడానికే పరిమితమయ్యాయి.

ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పవన్‌తో ఒకే వేదికపైకి వచ్చి ఆలోచనలు పంచుకోవడంతో రెండు వైపులా మంచి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పొత్తులకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగేందుకు వామపక్షాలు, పవన్ రెడీ అయ్యారని టాక్. ఇన్నాళ్లూ టీడీపీ-బీజేపీల తోక పార్టీ అని వచ్చిన అపప్రథను తొలగించి మేథావుల పార్టీగా గుర్తింపు తేవాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే మేథావిగా గుర్తింపు ఉన్న లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. ఎన్నికల నాటికి లోక్‌సత్తాను పునర్నిర్మించి.. ఓ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories