పవన్ కల్యాణ్ ట్రైన్ జర్నీ..

x
Highlights

పవన్ కల్యాణ్ మరో దఫా ప్ర‌జా పోరాట యాత్రకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇవాల్టి నుంచి పోరు బాట పడుతున్నారు. తుని నుంచి శ్రీకారం చుట్టే ఈ...

పవన్ కల్యాణ్ మరో దఫా ప్ర‌జా పోరాట యాత్రకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇవాల్టి నుంచి పోరు బాట పడుతున్నారు. తుని నుంచి శ్రీకారం చుట్టే ఈ యాత్ర‌ను పవన్ వినూత్నంగా ప్రారంభించబోతున్నారు. తుని వెళ్ళడానికి పవన్ రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. వివిధ వర్గాల ప్రజలను, అభిమానులను కలుసుకుంటూ ఇవాళ మధ్యాహ్నం పవన్ విజ‌య‌వాడ నుంచి రైలు ప్రయాణం ప్రారంభిస్తారు. ఇందుకు జన్మ‌భూమి ఎక్స్ ప్రెస్ వేదిక కాబోతోంది.

ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ప్రజా పోరాట యాత్ర చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావ‌రి జిల్లాలోనూ ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్రతో పాటు ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో యాత్రకు మంచి స్పంద‌న రావడంతో కాస్త విరామం తీసుకుని ఐదో జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్రారంభమవుతున్న పవన్ ప్రజా పోరాట యాత్ర తుని బహిరంగ సభతో శ్రీకారం చుడుతున్నారు. అయితే తుని సభతో మొదలయ్యే యాత్రను కాస్త వినూత్నంగా ప్లాన్ చేశారు. తుని వెళ్ళడానికి పవన్ ట్రైన్‌ను ఎంచుకున్నారు. విజ‌య‌వాడలో నుంచి సాగే ఈ కార్య‌క్ర‌మానికి "జ‌న‌సేనానితో రైలు ప్ర‌యాణం" అని పేరు పెట్టారు.

జ‌న‌సేనానితో రైలు ప్ర‌యాణం కార్యక్రమంలో భాగంగా పవన్ ఇవాళ మ‌ద్యాహ్నం విజ‌య‌వాడ‌లో జ‌న్మ‌భూమి ఎక్స్ ప్రెస్ ఎక్క‌ి తుని పయనమవుతారు. ఈ ప్రయాణంలో జనసేనాని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో ప‌వ‌న్ సమావేశ‌మ‌వుతారు. రైల్వే పోర్ట‌ర్ల‌ు, మామిడి రైతులు, అసంఘ‌టిత రంగంలో ఉన్న చిరు వ్యాపారుల‌ు, చెర‌కు రైతులు, చేనేత కార్మిక‌ులు, విద్యార్ధులు, ఏటికొప్పాక బొమ్మ‌ల త‌యారీ క‌ళాకారుల‌ సమస్యల గురించి రైలు ప్రయాణంలోనే ఆరా తీస్తారు. అలాగే నూజివీడు, ఏలూరు, తాడేప‌ల్లి గూడెం, రాజ‌మహేంద్రవరం, సామ‌ర్ల‌కోట‌, అన్న‌వ‌రం రైల్వే స్టేష‌న్ల‌లో కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌ను కూడా ప‌వ‌న్ క‌లుస్తారు.

పవన్ రైలు యాత్ర నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలకు జనసేన పార్టీ పలు సూచనలు చేసింది. విజయవాడ నుంచి తుని వరకూ వివిధ స్టేషన్‌లో పవన్‌కు శుభాకంక్షలు తెలిపేందుకు వచ్చే వాళ్లు విధిగా ప్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుని, వాటిని బ్యాడ్జిలుగా ధరించి రావాలని సూచించింది. రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు రైలు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దని కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories