logo
ఆంధ్రప్రదేశ్

టీడీపీ, వైసీపీలను ఇరుకున పెట్టిన పవన్

X
Highlights

ఏపీ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మరింత వేడెక్కింది. జగన్ సవాల్ ను స్వీకరిస్తూ.. పవన్ కల్యాణ్ వెల్లడించిన తాజా...

ఏపీ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మరింత వేడెక్కింది. జగన్ సవాల్ ను స్వీకరిస్తూ.. పవన్ కల్యాణ్ వెల్లడించిన తాజా వైఖరి.. టీడీపీతో పాటు వైసీపీని కూడా ఇరుకున పెట్టేలా ఉంది. ఆంధ్రా ప్రజల ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉన్నవారు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్న సర్వత్రా ఉదయిస్తున్న క్రమంలో.. టీడీపీ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న దరిమిలా అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకుంటే ఎలాంటి మద్దతైనా ఇచ్చేందుకు రెడీ అంటూ పవన్ ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

జె.ఎఫ్.సి. తొలి సమావేశంలోనే కేంద్ర, రాష్ట్రాల నుంచి లెక్కల వివరాలు రాబట్టిన పవన్ కల్యాణ్ తాజాగా టీడీపీ, వైసీపీలను దిమ్మదిరిగేలా ఇరుకున పెట్టారు. చంద్రబాబుకు భాగస్వామిగా వ్యవహరిస్తున్న పవన్ పార్లమెంట్లో అవిశ్వాసానికి బాబును ఒప్పిస్తే.. తాము సిద్ధమని, రాజీనామాలకైనా వెనుకాడేది లేదంటూ విసిరిన సవాల్ ను పవన్ కల్యాణ్ స్వీకరించారు.

ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల అంశాన్ని పక్కనపెట్టి.. టీడీపీ, వైసీపీలు రెండూ రాజకీయ డ్రామా ఆడుతున్నాయన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ కల్యాణ్ చక్కగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలతో ప్రమేయం లేని వ్యక్తిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరోటి అక్కర్లేదంటూ పవన్.. చంద్రబాబుకు, జగన్ కు సమాన దూరం పాటించారు. ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై చిత్తశుద్ధిని ప్రదర్శించకుండా రాజకీయ అవసరాల కోసమే కేంద్రానికి దగ్గరయ్యేందుకు ఆ ఇద్దరూ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలకు కలిగేలా పవన్ వ్యవహరించారు. హోదా విషయంలో రాజీపడ్డ చంద్రబాబు, ప్యాకేజీ విషయంలో కూడా కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని, అదే పార్లమెంట్లో బయటపడిందన్నారు పవన్. అందుకే అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని కూడా చంద్రబాబు ఉపయోగించుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. ఈ క్రమంలో ఆ అవకాశాన్ని జగన్ వినియోగించుకోవాలని, అప్పుడు జగన్ కు మద్దతిచ్చేందుకు తాను ముందుంటానని సవాల్ విసిరారు.

కేంద్రాన్ని నిగ్గదీసే ధైర్యం జగన్ కు ఉందని తనకు తెలుసని.. అదే ధైర్యంతో అవిశ్వాసం పెట్టాలని సూచించారు. అవిశ్వాసం పెట్టడానికి ఒక్కరున్నా సరిపోతుందని, అది చర్చకు రావాలంటే మాత్రం 50 మంది ఎంపీల బలం అవసరం అవుతుందని.. ఆ బలాన్ని కూడగట్టేందుకు తాను దేశమంతా తిరిగి వివిధ పార్టీల్ని సంప్రదిస్తానని చెప్పారు. ఏపీకి హోదా విషయంలో ఏ పార్టీ ముందు పడితే... దానికి మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పనిలోపనిగా.. తనకు టీడీపీతో సంబంధం లేదని, ఎన్నికల్లో మద్దతిచ్చాను తప్పితే.. ఏపీ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు కోసం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

పార్లమెంట్ లో ప్లకార్డులు, నినాదాలతో వైసీపీ, కాంగ్రెస్ పక్షాలు హోరెత్తించగా.. టీడీపీ బయట ఆందోళనలు చేస్తూనే పార్లమెంట్లో మాత్రం బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగానే వ్యవహరిస్తోంది. మరోవైపు.. ఇప్పటివరకు ఆ ఇద్దరు నాయకులు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే వ్యూహం మినహా... బీజేపీని దారికి తెచ్చుకునే స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇద్దరు నాయకులు కూడా బీజేపీతో చెలిమి కోసం ప్రయత్నిస్తున్నట్టుగానే వారి వైఖరి కనిపిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ దశలో... కేంద్రం మీద అవిశ్వాసం పెట్టినవారికి తన మద్దతు ఉంటుందని పవన్ డిక్లేర్ చేయడం.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు. జె.ఎఫ్.సి.లో ఉన్న పలువురు సీనియర్ల సూచనలు పాటించడం వల్లే పవన్ వ్యవహారంలో రాజకీయ పరిణతి కనిపిస్తోందంటున్నారు నిపుణులు.

Next Story