‘జనసేన’పై బాబు నిఘా?

x
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, మంత్రి నారా లోకేష్‌పైనా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తోన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టిందా? జనసేన...

ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, మంత్రి నారా లోకేష్‌పైనా తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తోన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టిందా? జనసేన కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గూఢచారులను నియమించుకుందా? పవన్‌‌ను ఎవరెవరు కలుస్తాన్నారో ఆరా తీస్తోందా? సరిగ్గా ఇలాంటి అనుమానమే పవన్‌ కల్యాణ్‌‌కు వచ్చింది. జనసేన అంతర్గత విషయాలు లీకవుతున్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

పాలు నీళ్లలా ఇంతకాలం కలిసున్న జనసేన, టీడీపీ ఇప్పుడు ఉప్పునిప్పులా మారడంతో జనసేనాని సర్కార్ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వపక్షం నుంచి వ్యతిరేక పక్షంగా మారిన తనపై ప్రభుత్వ నిఘా పెట్టిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ‌ బలంగా నమ్ముతున్నారు. గడచిన నెల రోజుల్లో తాను చేపట్టిన ప్రతి కార్యక్రమ వివరాలు అధికార పార్టీ నేతలకు ముందే తెలిసిందని నిర్ధారించుకున్న పవన్ దీని వెనకున్న వారి వివరాలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. సమాచారం ఎలా లీకవుతుందో ఆరా తీసిన పవన్ కల్యాణ్‌ తనకు కేటాయించిన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల పలువురు నేతలతో నిర్వహించిన సమావేశాల వివరాలు లీక్‌ కావడం మినిట్‌ టు మినిట్‌ అప్డేట్స్‌ ప్రభుత్వానికి, తెలుగుదేశం నేతలకు చేరాయన్న విషయం తెలుసుకుని పవన్‌ అవాక్కయినట్లు సమాచారం. అయితే ఇదంతా తనకు కేటాయించిన గన్‌మెన్ల ద్వారానే లీక్‌ అయినట్లు జనసేనాని అనుమానించారు. గన్‌మెన్లనే గూఢచారులా ప్రభుత్వం వాడుకుంటోందని, సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకుంటుందనే నిర్ణయానికి వచ్చిన జనసేనాని తన సెక్యూరిటీని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.

అయితే ఏవో ఊహించుకుని భద్రత కల్పించేందుకు వచ్చిన గన్‌మెన్లపై ఊహాజనిత అభాండాలు వేయడం తగదంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ వివాదంపై స్పందించిన జనసేన ప్రతినిధులు గన్‌మెన్లను వెనక్కు పంపే విషయంలో దురుద్దేశాలు ఆపాదించవద్దంటున్నారు. ప్రైవేటు భద్రత పూర్తి స్ధాయిలో ఉన్నందునే వెనక్కు పంపామంటూ సమర్ధించుకుంటున్నారు. గన్‌మెన్లను కేటాయించిన నెల తర్వాత ప్రభుత్వానికి సరెండర్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే టీడీపీ నుంచి పలువురు నేతలు జనసేనలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో సేనాని జాగ్రత్తపడుతున్నాని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories