తెలంగాణవాసి

తెలంగాణవాసి
x
Highlights

పవన్‌కల్యాణ్‌... తానిప్పుడు ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌ అంటున్నారు. తనకు ప్రాంతీయ బేధం లేదన్నారు. ఏపీ అయినా... తెలంగాణ అయినా ఒక్కటే అన్నారు. ఆంధ్రప్రదేశ్...

పవన్‌కల్యాణ్‌... తానిప్పుడు ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌ అంటున్నారు. తనకు ప్రాంతీయ బేధం లేదన్నారు. ఏపీ అయినా... తెలంగాణ అయినా ఒక్కటే అన్నారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని ఆవేశంగా ప్రసంగించారు. అందుకే తనకు జై తెలంగాణ అన్న పదం ఇష్టమని నినదించారు. జై తెలంగాణ ఇదీ పవన్‌కల్యాణ్‌ నోట వెంట వచ్చిన మాట. వందేమాతరం నినాదానికి ఎంత పవర్‌ ఉందో జై తెలంగాణ అన్న పదానికి కూడా అంతే పవర్‌ ఉందని పోల్చి చెప్పారు. దేశమంతా స్వాతంత్ర్యం వెలుగుల్లో విరాజిల్లుతుంటే తెలంగాణలో కమ్ముకున్న చీకటిని తొలగించి స్వేచ్ఛ కోసం పరితపించే నినాదమే జై తెలంగాణ అంటూ తనదైన శైలిలో భాష్యం చెప్పారు పవన్‌కల్యాణ్‌

అలాంటి తెలంగాణ నుంచి నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం కావడం తన అదృష్టమన్నారాయన. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలంటూ అభిలషించిన పవన్‌ తెలంగాణ ఉద్యమం స్పూర్తితో ముందుకు సాగాలని ఆవేశంగా ప్రసంగించారు. తెలంగాణ విషయంలో మొదటినుంచీ తనది ప్రత్యేక అభిమానమేనన్నారు. ఉద్యమం పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన ఇక అనివార్యమని తేలినప్పుడు తెలంగాణ గురించి తెలంగాణలోని రాజకీయ నాయకుల గురించి మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ కాలంలో పవన్ మీద టిఆర్ఎస్ నేతలు పరుష కామెంట్లు చేశారు. దానికి పవన్ కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చారు.

రాష్ట్రం విభజన పూర్తయింది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయాలను పక్కనపెట్టి వరుస సినిమాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ తెర ఎక్కారు పవన్‌. గతంలో ఓసారి విజయవాడలో జరిగిన సభలో తెలంగాణపై పవన్ కల్యాణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. విద్యార్థులతో పవన్ సుదీర్ఘంగా ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సమయంలో అనేక అంశాలపై పవన్ మనసు విప్పి మాట్లాడారు. అయితే మాటల సందర్భంలో తెలంగాణ విషయం కూడా చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో కానీ.. తెలంగాణలో కానీ కులపిచ్చి లేదన్న పవన్‌... తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.

కరీంనగర్‌ సభలో కూడా తెలంగాణపై అదే అభిమానాన్ని చూపించారు పవన్‌కల్యాణ్‌. తెలంగాణ అంటే తనకు చాలా ప్రేమ, చాలా ఇష్టమన్నారు. ఓటుకు నోటుకు కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందన్న పవన్‌ ఆ విషయం తనకూ తెలుసని వ్యాఖ్యానించడం విశేషం. కానీ దానిపై బలంగా మాట్లాడకపోవడానికి కారణముందని పవన్ చెప్పారు. భారత రాజకీయ వ్యవస్థలో అలాంటి పనులు అన్ని పార్టీలు చేసేవేనని, ఆ విషయం తెలిసి కూడా తాను గొడవలు పెట్టుకుని రాజకీయంగా అస్థిర పరిస్థితి సృష్టించి విధ్వంసకర రాజకీయాలు చేయడం ఇష్టం లేకే తాను అలా వ్యవహరించానని పవన్ తెలిపారు.
ఇక తెలంగాణ కళల పట్ల, ఆ భాష పట్ల ఆ యాస పట్ల తనకు ఎనలేని గౌరవం ఉందన్న పవన్‌కల్యాణ్‌ తన సినిమాల్లో తెలంగాణ భాష ప్రభావితం అయ్యేలా పాటలు, సీన్లు పెట్టానని కరీంనగర్‌లో చెప్పుకొచ్చారు పవన్‌.

అసలు పవన్‌కల్యాణ్‌ తెలంగాణ టూర్‌ ఎజెండా ఏంటి? ఎన్నికల ఏడాది దగ్గర పడుతున్న సమయంలో జనసేనాని పర్యటన వ్యక్తిగతం తనకెంత లాభం కలిగిస్తుంది?

ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అవుతుందని భావించిన జనసేనాని అనూహ్యంగా తెలంగాణ టూర్‌ ఎంచుకున్నారు. నిజానికి మొదటి నుంచి పవన్‌కల్యాణ్‌ దృష్టంతా ఏపీపైన్నే ఉంది. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయ‌న ఏపీపైనే స్పందిస్తున్నారు. అలాంటిది అనూహ్యంగా ఇటీవ‌ల కాలంలో ఆయ‌న వ్యూహం తెలంగాణ దిశ‌గా మ‌ళ్లింది. తెలంగాణ‌లోనూ త‌న పార్టీ ఉంటుంద‌ని, పోటీ చేస్తుంద‌ని కరీంనగర్‌ సభా వేదికపై నుంచి స్పష్టత ఇచ్చారు. దీనివ‌ల్ల ఏం జరుగుతుంది? ప్రత్యామ్నాయ శ‌క్తిగా ఎదుగుతాడా? పవర్‌లోకి వస్తాడా?

కేవ‌లం కాంగ్రెస్ లేదా బీజేపీ ఓట్లను చీల్చడంలో, విద్యార్థి వ‌ర్గాల ఓట్లు త‌న‌కు దక్కేలా చేసుకోవడంలో ప‌వ‌న్ శ‌క్తిగా మారుతారా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి టీఆర్‌ఎస్‌కి ఉన్న అభిమానులు, పార్టీ నేత‌లు కేసీఆర్‌ను ఇప్పటికిప్పుడు ఎట్టిప‌రిస్థితిలోనూ వ‌దుల‌కునే పరిస్థితిలో లేరు. కానీ మళ్లీ టీఆర్‌ఎస్‌కు అధికారం దక్కాలంటే కాంగ్రెస్ ఓట్లు, విద్యార్థి సంఘాల ఓట్లు రావాలి. అప్పుడే టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ప‌వ‌న్ రూపంలో కేసీఆర్ ఆ పని చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పవన్‌ టూర్‌ను విశ్లేషిస్తున్నారు. విద్యార్థి, కాంగ్రెస్‌, బీజేపీ ఓట్లను ప‌వ‌న్ చీలిస్తే అల్లిమేట్‌గా కేసీఆర్ బ‌లాన్ని కాపాడే అవ‌కాశం ఉంటుంది.

ఏమైనా రాజ‌కీయాల్లో త‌నకంటూ ప్రత్యేక పంథాతో దూసుకుపోతానంటూ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. భవిష్యత్తులో కూడా అదే దూకుడును అవలంబిస్తారో లేదో చూడాలి. 2019 ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతుండటంతో ప‌వ‌న్ త‌న రాజకీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఈ క్రమంలోనే జ‌నాల్ని చేరువ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగమే తెలంగాణ పర్యటన అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories