నిజామాబాద్‌ జిల్లాలో సాంఘిక బహిష్కరణ కలకలం

x
Highlights

పట్టా భూముల్లో పంటసాగు ఓ కులాన్ని సాంఘిక బహిష్కరణ శిక్ష విధించింది. తమ పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతున్న గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాకానికి ఏకంగా...

పట్టా భూముల్లో పంటసాగు ఓ కులాన్ని సాంఘిక బహిష్కరణ శిక్ష విధించింది. తమ పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతున్న గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాకానికి ఏకంగా 30 మంది గౌడ కులస్థులపై బహిష్కరణ వేటు పడింది. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం వడ్యాట్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. వడ్యాట్‌లో గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాకానికి ఇది పరాకాష్ట. పట్టా భూమిలో మట్టికట్ట తొలగింపుపై ఆగ్రహించిన గ్రామ అభివృద్ధి కమిటీ ఆ భూమి తమదిగా చెప్పుకుంటున్న గౌడ కులస్తులకు సాంఘిక బహిష్కరణ శిక్ష విధించింది.

గొల్లపల్లి పద్మ, గొల్లపల్లి ఆంజనేయులు తమ పట్టా భూములలలో నలభై ఏళ్లుగా పంట సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి మీద కన్నేసిన గ్రామ కమిటీ అది ప్రభుత్వ భూమి మీరెలా సాగు చేసుకుంటారని ప్రశ్నించింది. సర్కారీ భూమి కాదనీ, నాలుగు దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న తమ సొంత భూమి అని చెప్పినా కమిటీ వినలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ గతంలో ఉన్న చెరువు కట్టను మీరే తొలగించారు కాబట్టి కట్టను మళ్లీ పునర్మించాలని గ్రామకమిటి ఆంక్షలు విధించిందని బాధితులు వాపోతున్నారు.

తమ భూమి మీద తామెందుకు కట్ట వేస్తామని గొల్లపల్లి మారుతీగౌడ్ శంకర్‌గౌడ్ గ్రామాభివృద్ధి కమిటీని ప్రశ్నించారు. దీంతో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహంతో ఉన్న కమిటీ గౌడ కుల సంఘానికి టార్గెట్‌ విధించి మారుతీగౌడ్‌ ఎలాగైనా ఒప్పించాలని షరతు విధించింది. అయినా దిగిరాని గొల్లపల్లి బ్రదర్స్‌పై గ్రామాభివృద్ది కమిటి కక్ష కట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే అదనుగా గౌడ సంఘంతో పాటు 30 మంది గౌడ కులస్థులను గ్రామ కమిటీ సాంఘిక బహిష్కరణ శిక్ష విధించిందని బాధితులు వాపోతున్నారు. గ్రామంలో తమకు హోటల్‌కు రానివ్వడం లేదనీ, కనీసం ఛాయ్‌ కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఆటో ఎక్కనివ్వడం లేదనీ, తమ ఇళ్లల్లోకి ఏ పని వాళ్లను కూడా రానివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై మోర్తాడ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు బాధితులు. అయితే దీనిపై మోర్తాడ్‌ ఎస్సై సురేష్‌ను హెచ్‌‌ఎంటీవీ వివరణ కోరింది. తమకు దీనిపై ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని ఎస్సై చెప్పడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories