ఉత్తరాదికి ధూళి తుఫాను భయం

ఉత్తరాదికి ధూళి తుఫాను భయం
x
Highlights

రాత్రి రాజధాని ఢిల్లీని వణికించి ధూళి తుఫాను మరోసారి పంజా విసరబోతోంది. ఏ క్షణంలోనైనా ఇంకోసారి దుమ్ము తుఫాను విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం...

రాత్రి రాజధాని ఢిల్లీని వణికించి ధూళి తుఫాను మరోసారి పంజా విసరబోతోంది. ఏ క్షణంలోనైనా ఇంకోసారి దుమ్ము తుఫాను విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం హస్తినలో వాతావరణమంతా మారిపోయింది. వాతావరణం చల్లబడింది. ఢిల్లీలో కారు మబ్బులు కుమ్మకున్నాయి. దీంతో ఏ క్షణంలోనైనా ఉరుములు, మెరుపులతో కూడిన దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది. ప్రచండగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. మెరుపులతో కూడిన భారీ వర్షాలు, దుమ్ము తుపాను సంభవిస్తుందన్న హెచ్చరికలతో ఢిల్లీవాసులు హడలెత్తిపోతున్నారు.

దుమ్ము తుఫాను రావొచ్చన్న హెచ్చరిక నేపథ్యంలో ఉత్తరాది రాప్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హర్యానా ప్రభుత్వం నిన్నటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేయగా...ఢిల్లీలో సాయంత్రం పని చేసే అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఆరుబయట ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని ఢిల్లీ సర్కారు హెచ్చరించింది. ఎమర్జెన్సీ టీములు , ప్రత్యేక సహాయక బృందాలను సిద్ధం చేసింది. ప్రచండగాలులు, ఉరుములు మెరుపులకు కరెంటు తీగలు తెగితే వెంటనే కరెంటు పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేసింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు న్యూఢిల్లీలో తుఫాను హెచ్చరికల నేపధ్యంలో మెట్రో రైలు అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాను సమయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మెట్రో సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తుఫాను సమయంలో గాలుల వేగం గంటకు 70 నుంచి 90 కిలోమీటర్లు ఉన్నా..అండర్ గ్రౌండ్ స్టేషన్లలో రైళ్లు యధావిధిగా నడుస్తాయని తెలిపారు. అయితే గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తే ఎలివేటెడ్ స్టేషన్లలో ట్రైన్లను నిలిపివేస్తామని చెప్పారు. గాలివేగం తగ్గేవరకు రైళ్లను పునరుద్ధరించలేమని వివరించింది.

గత రాత్రి ఢిల్లీలో వచ్చిన దుమ్ము తుఫాను బీభత్సం సృష్టించింది. ఢిల్లీకి సమీపంలోని గుర్‌గావ్‌, నోయిడా, రోహ్‌తక్‌, భివానీ, ఝాజ్జర్‌, మీరట్‌, ఘజియాబాద్‌లలోనూ భారీ దుమ్ము తుఫాను సంభవించింది. అయితే తుపాను ప్రభావం ఢిల్లీపైనే ఎక్కువగా ఉంది. ఢిల్లీలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. విపరీతమైన దుమ్ము, ధూళి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రగతి మైదాన్ ప్రాంతంలోని పాఠశాలలకు రెండురోజులపాటు సెలవు ప్రకటించారు.

బలమైన గాలులు... దక్షిణ భారతదేశంలో కూడా తుఫాన్‌ ప్రభావం ఉంటుందని ఐఎండీ ఆ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, తెలుగురాష్ట్రాల్లో 70 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో 2 నుంచి 7 సెం.మీల మేర వర్షం పడే అవకాశం ఉందని, ఉరుములు-మెరుపులోతో కూడిన వర్షం పడొచ్చని ప్రకటలో వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories